శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 30, 2020 , 00:45:03

రూపాయి ఫీజులేకుండా.. డిగ్రీ

రూపాయి ఫీజులేకుండా.. డిగ్రీ
  • ఇగ్నోలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత ప్రవేశాలు
  • రేపటితో ముగియనున్న ప్రవేశాలకు గడువు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎస్సీ,ఎస్టీలకు చెందిన పేద విద్యార్థులు రూపాయి చెల్లించకుండానే డిగ్రీని పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో). సంప్రదాయ డ్రిగీ కోర్సులతోపాటు, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సుల్లోనూ ఉచితంగా ప్రవేశాలు పొందేందుకు అవకాశమిస్తున్నది. 128 కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పించి, ఈనెల 31వరకు గడువును పొడిగించింది.


ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఇది ప్రజల విశ్వవిద్యాలయం. కష్టాల కడలిలో చదువుకు స్వస్తి చెప్పిన వారికి ఆశాదీపం. ఆసక్తిగల వారి ఇంట్లో విద్యాకుసుమాలు పూయించే పూదోట. ఆర్థిక ఇబ్బందులు.. వయస్సు నిబంధనలు..హాజరుపట్టికలతో అవసరం లేకుండా వెలుగులు నింపే అక్షరజ్యోతి. గృహిణులు, రైతులు, నైపుణ్యత గల కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వృత్తి ఏదైనా అందరి జీవితాల్లో ఉదయించే కుసుమం. మొత్తంగా సార్వత్రిక విద్యకే మకుటం. ఇలాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఉచిత విద్యనందిస్తున్నది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి ఫీజు మినహాయింపు లేదంటే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ద్వారా ఉచితంగా విద్యనందిస్తున్నది. దీంతో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు రూపాయి చెల్లించకుండానే డిగ్రీని పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లోనూ ఉచితంగా ప్రవేశాలు పొందేందుకు అవకాశమిస్తున్నది. ఇలా ఏకంగా 128 కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించింది.


కోర్సులు.. :  ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, సోషల్‌వర్క్‌, టూరిజం స్టడీస్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఏ(టూరిజం)

సర్టిఫికెట్‌ కోర్సులు.. : లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ట్రాన్స్‌లేషన్‌, సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌, అనలెటికల్‌ కెమిస్ట్రీ, జర్నలిజం -మాస్‌ కమ్యూనికేషన్స్‌, న్యూట్రిషన్‌ హెల్త్‌

31 వరకు ప్రవేశాలు..:  ఇగ్నో పరిధిలోని పలు కోర్సుల్లో చేరేందుకు మరో రెండు రోజులు మాత్రమే అవకాశమున్నది. పీజీ సర్టిఫికెట్‌, పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాముల్లో చేరడానికి గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడగించారు. అభ్యర్థులు www.ingou. in, http://www.ingou.in వెబ్‌సైట్‌, 94924 51812, 040 - 23117550 నంబర్లను సంప్రదించవచ్చని ఇగ్నో హైదరాబాద్‌ ప్రాంతీయ సంచాలకులు ఫయాజ్‌ అహ్మద్‌ తెలిపారు. తెలంగాణలోని ఆశావహులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవేశాలు పొందచ్చవన్నారు.


logo