బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 29, 2020 , 04:07:28

ఫిబ్రవరి మొదటి వారంలో జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ ‘మెట్రో’

ఫిబ్రవరి మొదటి వారంలో జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ ‘మెట్రో’
  • - కారిడార్‌-2ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న అధికారులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కారిడార్‌-2కు సంబంధించి జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఫిబ్రవరి మొదటివారంలో అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే ట్రయల్న్‌ పూర్తయి సేఫ్టీ సర్టిఫికెట్‌ వచ్చి ఆపరేషన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఇక అధికారికంగా కమర్షియల్‌ ఆపరేషన్స్‌ మాత్రమే మిగిలి ఉన్నది. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ రావడంతో మెట్రోరైలు ప్రారంభాన్ని నిలిపివేశారు. కోడ్‌ ముగిసినందున ఇక ప్రారంభానికి సన్నద్ధమవుతున్నారు. ఈ కారిడార్‌ ప్రారంభమైతే మొదటిదశ ప్రాజెక్టు దాదాపు మూడు కారిడార్లకు సంబంధించిన ఆపరేషన్స్‌ పూర్తయినట్లే. అందుబాటులోకి రానున్న 11 కిలోమీటర్ల మేర ప్రయాణం కేవలం 16 నిమిషాల్లో ప్రయాణించే వీలుంటుంది. దీనికి సంబంధించిన ట్రయల్న్‌ నవంబర్‌ 26 నుంచి కొనసాగుతున్నది. ఇప్పటికే నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు కారిడార్‌-3తోపాటు ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు కారిడార్‌-1 అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన 57 కిలోమీటర్ల రాకపోకలు సాగిస్తున్నాయి. అదనంగా మరో 11 కిలోమీటర్లు జోడించనున్నారు. 


దీంతో 68 కిలోమీటర్ల మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానున్నది. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి మొదలుకుని అన్ని స్టేషన్ల తనిఖీలు పూర్తై  గ్రీన్‌ సిగ్నల్‌ కూడా లభించింది. అతిపెద్ద ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ ఎంజీబీఎస్‌ ఇప్పటికే సిద్ధమైంది.  కారిడార్‌ -1, కారిడార్‌-2లను కలుపుతూ నిర్మించే ఈ నిర్మాణం పలు ప్రత్యేకతలు కలిగి ఉన్నది. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్‌, నాణ్యమైన సిమెంట్‌ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ మార్గంలో ప్రయాణించే కారిడార్‌-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ఛేంజ్‌ మెట్రోస్టేషన్‌ మొదటి, రెండవ అంతస్తుల నుంచి రాకపోకలు సాగించనుండగా, కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైళ్లు 3, 4 అంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తుంటాయి. స్టేషన్ల విషయానికి వస్తే పరేడ్‌గ్రౌండ్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ దవాఖాన, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ వంటి స్టేషన్లలో ఆపరేట్‌ చేస్తారు.


logo