గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 29, 2020 , 04:01:10

ఇదెక్కడి అన్యాయం? ప్లాట్లకు ‘పాస్‌బుక్కులు, రైతుబంధు’

ఇదెక్కడి అన్యాయం? ప్లాట్లకు ‘పాస్‌బుక్కులు, రైతుబంధు’

కీసర : ‘ప్రతాపసింగారం సర్వే నంబరు 315, 316, 317లో 25.17 ఎకరాల్లో జీపీవో పర్మిషన్‌తో లే అవుట్‌ చేసి ఉన్న 390 ప్లాట్లను 1988లో మేం కొనుగోలు చేశాం. 2018 వరకూ.. అవి రెసిడెన్షియల్‌ జోన్‌లోనే ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా అవి మళ్లీ వ్యవసాయ భూములుగా మారిపోయాయి. కొంతమంది అక్రమార్కులు తమ పేరు మీదికి మార్చుకున్నారు.. పాసు బుక్కులు తెచ్చుకున్నారు. రైతుబంధు సాయమూ పొందుతున్నారు. ఈ అన్యాయాన్ని సవరించండి. మా ప్లాట్లు మాకు ఇప్పించండి’ అంటూ ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప్‌సింగారం భవానీనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు చెందిన సుమారు 400 మంది ప్లాట్ల కొనుగోలుదారులు కీసర ఆర్డీవో రవికుమార్‌కు మొరపెట్టుకున్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ప్లాట్ల యజమానులు మాట్లాడారు. కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ప్లాట్లు కొంటే నేడు తమ ప్లాట్ల స్థలాన్ని వ్యవసాయ భూమిగా మార్చిన రెవెన్యూ అధికారులను విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్లాట్లు చేసిన స్థలంలో ప్రభుత్వం నుంచి రైతుబంధు కింద ఏ విధంగా డబ్బులు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. 


న్యాయం చేయండి..

ప్రతాప్‌సింగారం సర్వే నంబర్‌ 315, 316, 317లో 25.17 ఎకరాల్లో 1988లో జీపీవో పర్మిషన్‌తో 390 ప్లాట్స్‌తో లేఅవుట్‌ చేశారని.. అప్పట్లోనే రెవెన్యూ రికార్డులో కూడా ప్లాట్లు, ఇండ్లకు అనుకూలమని అధికారులు మార్చేశారని ప్లాట్ల యజమానులు వెల్లడించారు. 1988 నుంచి 2018 సంవత్సరం వరకు రెసిడెన్షియల్‌ జోన్‌ కిందనే ఉన్న ఆ భూమిలో కొంతమంది అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై పాసు పుస్తకాలు తెచ్చుకున్నారని వాపోయారు. అక్రమంగా పాసు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా రెసిడెన్షియల్‌ జోన్‌ను ఎల్‌ఆర్‌ఎస్‌ అప్రూవల్‌, ఇండ్లు, బెస్‌మెంట్స్‌ ఉన్నప్పటికీ వ్యవసాయ భూమిగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు డబ్బులు కూడా అక్రమార్కులకు ఇస్తున్నారని ఆర్డీవోకు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అవినీతికి పాల్పడ్డ అధికారులు, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్లాట్ల కొనుగోలుదారులు ఉపేందర్‌, యాదగిరి, మల్లేశ్‌, సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, సుదర్శన్‌రావు, నాగిరెడ్డి, శ్రీధర్‌, రాజు, రాజేశ్‌తోపాటు 400 మంది పాల్గొన్నారు. కాగా, ఈ సమస్యపై తగు విచారణ చేస్తామని కీసర ఆర్డీవో రవికుమార్‌ తెలిపారు.


logo