శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 28, 2020 , 03:28:48

పురపీఠం గులాబీ మయం

పురపీఠం గులాబీ మయం
  • - అత్యధిక పురపాలికలను దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి
  • - మేడ్చల్‌ జిల్లాలో అన్నీ కైవసం
  • - 4 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీలు కారు ఖాతాలోకి
  • - రంగారెడ్డి లో మూడు కార్పొరేషన్లు, 8 పురపాలక సంఘాలు టీఆర్‌ఎస్‌కే
  • - కాంగ్రెస్‌ 2 , బీజేపీ1, ఎంఐఎంకు 1
  • - కోరం లేక మేడ్చల్‌ చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర శివార్లలోని మేడ్చల్‌, రంగారెడ్డి  జిల్లాల పరిధిలోని పురపాలిక  పీఠాల్లో గులాబీ జెండాఎగిరింది. మేడ్చల్‌ జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు,  నాలుగు కార్పొరేషన్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మేడ్చల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నిక కోరం లేక నేటికి వాయిదా పడింది. అక్కడ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది.  రంగారెడ్డి జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు గానూ ఎనిమిది, మూడు కార్పొరేషన్లలోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. తుర్కయంజాల్‌, మణికొండలో కాంగ్రెస్‌, ఆమనగల్లును బీజేపీ, జల్‌పల్లి మున్సిపాలిటీని ఎంఐఎం దక్కించుకున్నాయి.


మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. మేడ్చల్‌ జిల్లా పరిధిలో మొత్తం 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగగా అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసిన టీఆర్‌ఎస్‌ మేయర్‌, చైర్‌పర్సన్‌ పీఠాలను దక్కించుకున్నది. ప్రజాక్షేత్రంలో చిత్తుగా ఓడిన ప్రతిపక్షాలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కనీస పోటీ ఇవ్వలేకపోయాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ నెల 27వ తేదీన మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక, మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికను ఎన్నికల ఆథరైజ్డ్‌ అధికారులు నిర్వహించారు. ఇందులో పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌ నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్లలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగగా, బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో మాత్రం 14 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నలుగురు స్వంతంత్ర అభ్యర్థులు, మంత్రి మల్లారెడ్డి ఎక్స్‌ అఫిషియో ఓటుతో కలిపి 19 మంది సభ్యులు ఏకగ్రీవంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అలాగే మున్సిపాలిటీల్లోనూ దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్‌, తూంకుంట, దుండిగల్‌, గుండ్లపోచంపల్లిలో చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లను ఏకగీవ్రంగా ఎన్నుకోగా, కొంపల్లిలో కేవలం చైర్‌ పర్సన్‌ను మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. అలాగే మేడ్చల్‌లో కోరం లేకపోవడంతో చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా పడింది. 


అన్నింటా ఏకగీవ్రమే..

జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో తన పార్టీ అభ్యర్థులకు ముందస్తుగానే విప్‌ను జారీ చేసింది. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలోను, కార్పొరేషన్లలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక లాంచనమే అయింది. మేడ్చల్‌లో చైర్మన్‌ అభ్యర్థిపై ఏకాభిప్రాయం లేని కారణంగా, కొంపల్లిలో వైస్‌ చైర్మన్‌ పదవికి ఏకాభిప్రాయం కుదరని కారణంగా నేటికి ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. జిల్లాలో మొత్తం 289 స్థానాలకు (డివిజన్లు/వార్డులు) ఎన్నికలు జరుగగా, ఇందులో 4 కార్పొరేషన్లలో 115 డివిజన్లు 76 మంది టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా విజయం సాధించారు. తొమ్మిది మున్సిపాలిటీలలో 174 వార్డులలో 111 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. అంటే మొత్తం 289 స్థానాల్లో 187 స్థానాలను కైవసం చేసుకొని మరోమారు మేడ్చల్‌ గడ్డ టీఆర్‌ఎస్‌ అడ్డా అని నిరూపించింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 43 మంది, బీజేపీ నుంచి కేవలం 13  మంది మాత్రమే గెలిచారు. ఇతర పార్టీలు కనీసం ఖాతా తెరవలేదు.


అభివృద్ధే గెలిపించింది: ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి

పీర్జాదిగూడ మేయర్‌గా జక్క వెంకట్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బండి గార్డెన్‌లో పాలక వర్గం కృతజ్ఞత సభను టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలను పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రభావం చూపించి పార్టీని విజయం వైపు తీసుకెళ్లిందన్నారు. అనంతరం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జక్క వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే ఐకాన్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అహర్షిషలు కృషి చేస్తానన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ఏ సమస్యలు ఉత్పన్నమైనా తక్షణమే వాటిని పరిష్కరిస్తానన్నారు.  ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మేయర్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు బుచ్చి యాదవ్‌, దేవిసింగ్‌ కురుణాకర్‌ రావు, పాండు, కాలనీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


మిన్నంటిన సంబురాలు...

ప్రజా తీర్పు ఏకపక్షంగా రావడంతో పాటు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగడంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు శాయశక్తుల కృషి చేస్తామని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన అభ్యర్థులు తెలిపారు. 


ఏకపక్ష తీర్పు

ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక, ఐటీ శాఖ మంత్రి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బలపర్చేలా మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చిన మేడ్చల్‌ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు ధన్యవాదాలు. నూతనంగా ఎన్నికైన మేయర్లకు, చైర్మన్లకు అభినందనలు. పదవులు వచ్చాయని బాధ్యతలను విస్మరించకుండా జిల్లాలో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా గెలిచిన సభ్యులందరు ఓట్లువేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలి.

- మంత్రి మల్లారెడ్డి 


బాధ్యత పెరిగింది

టీఆర్‌ఎస్‌ పార్టీపై, మేయర్లు, డిప్యూటీ మేయర్లు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లతో పాటు కార్పొరేటర్లపై, కౌన్సిలర్లపై బాధ్యత పెరిగింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనలు పాటిస్తూ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో మేడ్చల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఎన్నిక ఏదైనా ఫలితాలు ఏకపక్షమే అన్నట్లుగా, మేడ్చల్‌ జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అఖండ విజయం సాధించారు.

-మర్రి రాజశేఖర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు.


logo