బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 28, 2020 , 03:19:37

నగరంలోనూ నైట్‌లైఫ్‌..!

నగరంలోనూ  నైట్‌లైఫ్‌..!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహానగరంలో రాత్రీ-పగలు తేడాలేకుండా ఎవరి పనుల కోసం వారు నిత్యం ఉరుకులు పరుగులు తీస్తుంటారు. ఇలా నిరంతరం యమబిజీగా గడుపుతారు. రోజువారీ పని ఒత్తిడితో ఉండే జనానాకి వారానికి ఒక్కరోజు వచ్చే సెలవు ఎటూ సరిపోదు. దీంతో వారు షాపింగ్‌ను, సినిమా సరదాలను వాయిదా వేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించేందుకే నైట్‌లైఫ్‌ విధానం అమల్లోకి వచ్చింది. లండన్‌లో ప్రారంభమైన ఈ పద్ధతి ఇప్పుడు ముంబై వరకు పాకింది. ఈనెల 27 నుంచి ముంబైలో నైట్‌లైఫ్‌ పేరుతో షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాలను 24/7 తెరిచి ఉంచేలా మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. ముందుకు 25 ప్రధాన మార్కెట్‌ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసి దశలవారీగా నగరమంతా విస్తరించాలని నిర్ణయించారు. ఈనేపథ్యం లో దాదాపు కోటికి పైగా జనాభా, నిత్యం పనిఒత్తిడితో బిజీబిజీగా గడిపే జనాలు, ముఖ్యంగా రాంత్రిబవళ్లూ పనిచేసే ఐటీ, బీపీఓ ఉద్యోగులు, నైట్‌ షిఫ్టుల్లో పనిచేసే కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్న మననగరంలో సైతం ఈ విధానం అమలుచేస్తే ఎంతో బావుంటుందనే అభిప్రా యం సర్వత్రా వినిపిస్తోంది. మననగరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఉండడంతో రోజూ వచ్చిపోయే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ క్రమంలో ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు నైట్‌లైఫ్‌ విధానానికి మొగ్గు చూపుతున్నారు.


 గతంలోనే ప్రతిపాదన

వినూత్న విధానాలు, భారీ ప్రాజక్టులను చేపట్టే విషయం లో  ఇతర మెట్రో నగరాలతో పోటీపడే మన నగరం దాదాపు దశాబ్దం క్రితమే నైట్‌లైఫ్‌ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేసింది. అప్పట్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆర్థికవేత్త సమీర్‌శర్మ నగరంలో నైట్‌లైఫ్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని పేర్కొం టూ ప్రభుత్వం అనుమతిస్తే తాము సిద్ధమని చెప్పారు. కొంతకాలానికే  ఆయన బదిలీకి గురికావడంతో ఈ ప్రతిపాదన అప్పట్లో కాగితాలపైకి కూడా ఎక్కలేదు. 


నైట్‌లైఫ్‌తో ప్రయోజనాలు

 నైట్‌లైఫ్‌ విధానం వల్ల ఆర్థికపరమైన లాభాలే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశముంది. ప్రజలు నైట్‌ షాపింగ్‌కు అలవాటుపడితే వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల వ్యాపారులకు ప్రయోజనమే కాకుండా పన్నులరూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదా యం కూడా పెరుగుతుంది. అలాగే, నైట్‌షిఫ్టుల్లో ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పెద్ద సం ఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చాలామంది పగటి వేళల్లో చిన్నాచితకా పనులు చేసుకునేవారు కూడా రాత్రి షిఫ్టుల్లో పనిచేసి ఉపాధి పొందుతారు. మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, హోటళ్లు తదితరవాటిని తెరిచి ఉం చడం వల్ల వాటికి అనుబంధంగా ఉండే ఇతర చిన్నాచితకా కాఫీ షాప్‌లు, పాన్‌షాప్‌లు తదితర వాటికి కూడా ప్రయోజనం లభిస్తుంది. 


మెరుగైన శాంతిభద్రతలు

నైట్‌లైఫ్‌ విధానానికి ప్రధాన అడ్డంకి శాంతిభద్రతల సమ స్య. రాత్రివేళల్లో ఏమైనా జరగరానిది జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో సహజంగానే భయపడుతుంటారు. ముంబాయిలో సైతం నైట్‌లైఫ్‌ విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పటినుంచి ప్రతిపక్షాల నుం చి ఇదే అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నగరంలో శాంతిభద్రతల సమస్య దాదాపు లేదనే చెప్పవచ్చు. గడచిన ఆరేళ్లలో ఎక్కడా చెప్పుకోదగ్గ పెద్ద సంఘటన చోటుచేసుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలవారు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు, అనేక దేశాలనుంచి విద్యార్థులు, రోగులు, పర్యాటకులు విద్యా, వైద్యం, పర్యాటకం, వ్యా పార కార్యకలాపాల కోసం వస్తున్నారు. జనం ఆలోచన, అలవాట్లలో సైతం మార్పు వచ్చింది. గతంలో మాదిరి ఎవ్వరూ వివాదాలు, అల్లర్లతో సమయాన్ని వృథా చేయడంలేదు. ఈనేపథ్యంలో నగరం శాంత్రిభద్రతల సమస్య నుంచి దాదాపు అధిగమించిందనే చెప్పవచ్చు. 


నగరంలో ప్రస్తుత పరిస్థితి

 శాంతిభద్రతల సమస్య పేరుతో నగరంలో ప్రస్తుతం పదిన్నర గంటల వరకు మాత్రమే వ్యాపార అనుమతి ఉంది. సమయం దాటిందంటే పెట్రోలింగ్‌ పోలీసులు అన్నింటినీ మూసివేయిస్తుంటారు. దీనివల్ల ముఖ్యంగా రాత్రివేళల్లో విధులు నిర్వహించేవారికి రాత్రి పది-పదకొండు దాటిందంటే కనీసం టీ కూడా దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు, చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో అనధికారికంగానే కొంత ఆలస్యం వరకూ వ్యాపారాలు కొనసాగుతుంటాయి. చార్మినార్‌ ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడం తో దేశ-విదేశాలకు చెందిన పర్యాటకులు అత్యధికంగా సందర్శనకు వస్తుంటారు. రోజూ దాదాపు 20వేలమంది చార్మినార్‌ను సందర్శిస్తారని ఓ అంచనా. ఈ నేపథ్యంలో గతంలో చార్మినార్‌, శిల్పారామమ్‌ వద్ద అధికారికంగానే నైట్‌ బజార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయి తే అది ఆచరణలో సాధ్యం కాలేదు. అయినప్పటికీ చార్మినార్‌ వద్ద అర్థరాత్రి వరకూ వ్యాపారాలు కొనసాగుతుంటాయి. ఇతర ప్రాంతాల్లోనూ నైట్‌లైఫ్‌ విధానాన్ని అమలుచేయవచ్చనే అభిప్రాయం ఉద్యోగ, వ్యాపార వర్గాలతోపాటు అధికారవర్గాల్లోనూ వినిపిస్తోంది. 


ప్రభుత్వం నిర్ణయిస్తే అమలు

 ‘నైట్‌లైఫ్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ హైదరాబాద్‌కు ఉన్నాయి. అనేక అంశాల్లో ఇప్పటికే మనం ముంబాయి తో పోటీ పడుతున్నాం. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ విషయంలో ఏ ఇతర మెట్రో నగరంలో లేనంతగా మన నగరంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చాం. అయితే నైట్‌లైఫ్‌ విధానాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణ యం తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసు, జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై చర్చించి ముందుకుసాగవచ్చు. దీనివల్ల ఆర్థిక, ఉపాధిపరమైన ప్రయోజనాలు ఉంటాయనడంలో సందేహం లేదని జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 


logo