మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:43:57

భరోసా ఇస్తున్న బస్తీ దవాఖానలు..

భరోసా ఇస్తున్న బస్తీ దవాఖానలు..
  • గ్రేటర్‌లో ప్రస్తుతం సేవలందిస్తున్న 122 దవాఖానలు
  • త్వరలో మరిన్ని దవాఖానల పెంపునకు అధికారుల కసరత్తు
  • 300 దాటుతున్న ఓపీ సంఖ్య
  • ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణ
  • 5 రకాల వైద్యపరీక్షలు,125 రకాల మందులు

నమస్తే తెలంగాణ: అట్టడుగు వర్గాలవారికి  వైద్యసేవలు చేరాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానలు ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తున్నాయి. సాధారణంగా రోజువారీ పనులు చేసుకునే ప్రజలు చిన్నపాటి జలు బు, దగ్గు, ఇతర సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం, లేదా మెడికల్‌ షాపుకెళ్లి నాలుగు మందుబిల్లలు తీసుకోవ డం వంటివి చేస్తుంటారు. తీరా రోగం ముదరడంతో పెద్ద దవాఖానలకు పరుగులు తీస్తుండడం పరిపాటి. దీనివల్ల వ్యాధులు ప్రబలడంతోపాటు రోగుల సంఖ్య పెరగడం, కోరంటి, ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానలపై భారం పెరగడం జరిగేది. అంతేకాకుండా ప్రజలు ఆర్థికఇబ్బందులకు గురయ్యేవారు. బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బస్తీ దవాఖానలు పూర్తిగా ప్రజల నివాసాల మధ్యలో ఉండడంతో ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెం టనే రోగులు బస్తీదవాఖానను ఆశ్రయిస్తున్నారు. దీంతో వ్యాధులకు  ఆదిలోనే చెక్‌ పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, వైరల్‌ ఫీవర్‌, డయేరియా, కలరా, చికున్‌గుణ్య తదితర వ్యాధులు బస్తీ గడపదాటకుండా ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. దీని వల్ల రోగులు పెద్ద దవాఖానలకు వెళ్లి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పడంతోపాటు ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానలపై భారం కూడా తగ్గుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా వ్యాధులను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ నియంత్రించగలుగుతున్నారు. 


ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖాన

గ్రేటర్‌ పరిధిలో ప్రభుత్వం ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖాన చొప్పున ఏర్పాటుకు శ్రీకారం చుట్టి  మొదటివిడుతలోనే 122 దవాఖానలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ప్రస్తుతం 68 బస్తీ దవాఖానలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. 25 దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి తెలిపారు. జిల్లాలో మొత్తం 106 దవాఖానలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 60 దవాఖానలకు ప్రతిపాదనలు రూపొందించగా మొదటివిడుతలో భాగంగా ప్రస్తుతం 22 దవాఖానలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. 


ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణ

బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మురికివాడల్లో ఈ దవాఖానల సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో బస్తీ దవాఖానలకు రోగుల తాకిడి పెరుగుతోంది. పాతబస్తీలోని ఈదీబజార్‌, మసీమాబాద్‌, జంగమ్మెట్‌, బల్కంపేట బస్తీ దవాఖానల్లో రోగుల సంఖ్యం ప్రతిరోజు 200 దాటుతున్నారని, సీజనల్‌ సమయాల్లో ఈ సంఖ్య 300 దాటుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మరో 15 నుంచి 20 దవాఖానల్లో ప్రతిరోజు 150మంది రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో నందనవనం, ఎన్టీఆర్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ప్రతిరోజూ ఓపీ 100కు పైగా నమోదవుతుందని, మిగిలిన దవాఖానల్లో సరాసరిగా 60కి పైగానే నమోదవుతున్నట్లు వైద్యాధికారులు వివరించారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానల్లో కూడా ఇదే క్రమంలో ప్రజల నుంచి ఆధరణ పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 


125 రకాల మందులు 

బస్తీ దవాఖానల్లో 125 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ఈ మందులు దాదాపు 40శాతం వ్యాధులకు పనిచేస్తాయని, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలోని వ్యాధులను నియంత్రిస్తాయని వైద్యాధికారులు తెలిపారు. సాధారణంగా ఏదైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరకు వెళితే డాక్టర్‌ స్థాయిలోని వ్యాధులను నియంత్రిస్తాయని వైద్యాధికారులు తెలిపారు. సాధారణంగా ఏదైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరకు వెళితే డాక్టర్‌ ఫీజుకంటే మందులకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. బస్తీ దవాఖానల్లో 125 రకాల మందులను అందుబాటులో ఉంచడం వల్ల నిరుపేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందడమే కాకుండా ఆర్థిక భారం తగ్గుతున్నట్లు చికిత్స పొందుతున్న రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


త్వరలో డివిజన్‌కు 2 చొప్పున ఏర్పాటుకు చర్యలు 

బస్తీదవాఖానల ద్వారా నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందడంతోపాటు వ్యాధులను ప్రారంభ దశలోనే అరికట్టడంలో సఫలీకృతమవుతుండడంతో ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తున్న బస్తీ దవాఖానల సంఖ్యను మరింత పెంచాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం డివిజన్‌కు ఒకటి చొప్పున ఉన్న బస్తీ దవాఖానలను డివిజన్‌కు రెండు చొప్పున ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లోని అన్ని బస్తీ దవాఖానలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తుండగా సీజనల్‌ వ్యాధుల సమయాల్లో మాత్రం ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు వైద్యసేవలు అందించినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. 


logo
>>>>>>