సోమవారం 30 మార్చి 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:39:12

పౌరసత్వ సవరణ చట్టం ఎస్సీ,ఎస్టీ, బీసీలకూ వ్యతిరేకం..

పౌరసత్వ సవరణ చట్టం ఎస్సీ,ఎస్టీ, బీసీలకూ వ్యతిరేకం..

సుల్తాన్‌బజార్‌: పౌరసత్వ సవరణ చట్టం అనేది కేవలం ముస్లింలకే కాకుండా ఎస్సీ,ఎస్టీ, బీసీలకూ వ్యతిరేకంగా ఉం దని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ‘రాజ్యాంగం,పౌరసత్వ హక్కులు’ అనే అంశంపై ఒక్కరోజు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మతప్రాతిపదికన సీఏఏను అమలు చేయడం సరికాదన్నారు.పౌరసత్వ సవరణ చట్టం కేవలం ముస్లింలకే కాదని ప్రతి పౌరుడికి వర్తిస్తుందన్నారు.ఈ అంశం పై ముస్లింలు సామాజిక బాధ్యతగా ఒక్కటై పోరాటం చేయడం అభినందనీయమన్నారు. దేశంలో ప్రస్తుతం ఈ అంశంతో సంక్షోభం నెలకొందన్నారు.సీఏఏ,ఎన్‌ఆర్‌సీ,ఎన్‌ఆర్‌పీలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుతో 1980 కంటే ముందు పుట్టిన వారికి రెండు జన్మ తేదీలతో ఇబ్బంది ఉంటుందని,1990 అనంతరం జన్మించిన వారికి విద్యార్హత ఉన్న తల్లిదండ్రులు ఉన్నందున పిల్లలకు పుట్టిన తేదీలు బర్త్‌సర్టిఫికేట్‌లు ఉన్నాయన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్‌ మాట్లాడుతూ పౌరత్వం,పౌరసత్వం రెండింటికి తేడాలున్నాయన్నారు.


భారతదేశాన్ని హిందూ దేశంగా చేయలానే కుట్ర జరుగోతోందన్నారు. ఈ చట్టాల అమలు ఓ వర్గాన్ని అవమానించడంతో పాటు కించపరిచేలా ఉన్నాయన్నారు.రచయిత సంగిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ముస్లింలందరికి సీఏఏ ఒక సవాలు వంటిదన్నారు. ఆర్టికల్‌-15 సమానత్వపు హక్కుకు పూర్తిగా వ్యతిరేకమన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోంద న్నారు. ప్రజాస్వామిక రచయితిల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత మాట్లాడుతూ సీఏఏ వల్ల మతం స్వేచ్ఛకు ప్రజలు దూరంగా అయ్యేలా వివక్షకు గురి చేయడం తగదన్నారు. ప్రరవే జాతీయ కార్యదర్శి కెఎన్‌ మల్లేశ్వరి మాట్లాడుతూ రాజ్యంగం,పౌరసత్వ హక్కులు అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడమే సదస్సు ముఖ్య లక్ష్యమన్నారు.కార్యక్రమంలో కనీజ్‌ ఫాతిమా,రచన ముద్ర బోయిన,హెచ్‌సీయూ స్టూడెంట్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు శ్రీచరణ్‌, కత్తి మహేశ్‌,పీఓడబ్ల్యూ రమ, విజయ, దేవకీ దేవి,కెవి రామలక్ష్మీ,రుక్మిణి,విద్మహే, క్రాంతి, పద్మజ షా,సదస్సు సమన్వయకర్తలు మానస ,వి.మమత తదితరులు పాల్గొన్నారు.


logo