శనివారం 28 మార్చి 2020
Hyderabad-city - Jan 26, 2020 , 02:17:58

సందడిగా..సాహితీ సంబురం

సందడిగా..సాహితీ సంబురం
  • - రెండో రోజు జనరంజకంగా కొనసాగిన హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌
  • - నగరం నలుమూల దారులు విద్యారణ్య స్కూల్‌ వైపే

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చిన్నా పెద్ద అంతా ఏకం కాగా, విద్యారణ్య పాఠశాలలో నిర్వహించిన ‘హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌' అంగరంగ వైభవంగా రెండోరోజు కొనసాగింది. దారులన్నీ విద్యారణ్య స్కూల్‌ ప్రాంగణం వైపే సాగాయి. సందర్శకులు అధికంగా రావడంతో పాఠశాల ప్రాంగణమంతా కిటకిటలాడింది. లిటరరీ సెషన్స్‌లో భాగంగా ‘రైటింగ్‌ ద నేషన్‌'(దేశానికి ధర్మాసనం)పై టాక్‌ షోలో  ప్రముఖ జర్నలిస్ట్‌ అశుతోష్‌ మాట్లాడారు. హిందూ మతం ఒక మతం కాదని, కులాల కలయిక అని అన్నారు.  ‘ది లెగసీ ఆఫ్‌ పార్టిషన్‌' అనే చర్చా వేదికపై హరీందర్‌ సింగ్‌, విక్రమ్‌ కపూర్‌ పాల్గొన్నారు. ‘ఎ లైఫ్‌ స్టోరీస్‌ లాంగ్‌ అండ్‌ షార్ట్‌'పై పాల్‌ జచారియా చర్చించారు. ‘సర్‌ మౌంటింగ్‌ చాలెంజెస్‌' (సవాళ్లను అధిగమించడం)పై అలహాబాద్‌కు చెందిన స్వాతి అగర్వాల్‌ పలు సందేహాలపై తన విలువైన సలహాలను అందించారు. ‘రి ఇమేజినింగ్‌ సీత’ చర్చా వేదికలో బెంగాల్‌కు చెందిన నబనీత, సంహిత, వోల్గాలు పాల్గొని సీత ఎలా ఉంటే బావుండేది? అనే అంశంపై పలు విధాల ఆలోచనలతో చర్చించారు.
‘తెలంగాణ లిటరేచర్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌' అనే అంశంపై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ‘తెలంగాణ కవిత్వం, సాహిత్యం అనువాదంలో తీరు తెన్నులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు రకాల సలహాలను, ఆలోచనా విధానాలను వ్యక్తపరిచారు. కావ్యధారలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌ఫ్రెడ్‌ టేలర్‌, కీరన్‌ డాలిన్‌లు ఆస్ట్రేలియాకు చెందిన కవిత్వాన్ని, ట్రైబల్‌ సాహిత్యాన్ని వినిపించి సభికులు, సాహితీవేత్తలచే మన్ననలు పొందారు. ఇంకా మల్టీ లింగ్వల్‌ పోయెట్రీలో భాగంగా వసంత బిరాన్‌, కవి యాకూబ్‌, ఆల్‌ఫ్రెడ్‌ టేలర్‌, అనితా తంపిలు పాల్గొని భిన్న రకాల భాషల్లోని కవిత్వాన్ని జనరంజకంగా ఆవిష్కరించారు.

స్టేజ్‌ టాక్స్‌.. కథలు..చెప్పే

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌లో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేజ్‌ టాక్స్‌, కథలు చెప్పే వేదికలు సందడి సందడిగా కొనసాగాయి. ‘డేటింగ్‌ అవర్‌ డిజైర్స్‌-న్యూ లాంగ్వేజ్‌ ఆఫ్‌ డిజిటల్‌ లవ్‌'పై, కేరళకు చెందిన ‘తెయ్యం అండ్‌ కూడియట్టం’పై సాంస్కృతిక జుగల్బందీ కార్యక్రమం పలువురిని ఆకర్షించింది.logo