ఆదివారం 24 మే 2020
Hyderabad-city - Jan 26, 2020 , 02:11:39

అభివృద్ధికే పట్టం

అభివృద్ధికే పట్టం
  • - మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌
  • - రేవంత్‌రెడ్డిని తిరస్కరించిన ఓటర్లు
  • - అబద్ధపు ప్రచారాన్ని నమ్మని జనాలు
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించింది. సీఎం కేసీఆర్‌ అనుభవంతో చేపట్టిన పథకాలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ డైనమిజం ముందు ప్రతిపక్షాలు వెలవెలబోయాయి. ఉనికి ప్రశ్నార్థకంగా మారి కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు తోకముడిచాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో నిల్చోవడానికి కూడా సాహసం చేయలేదు. ముఖ్యంగా నగరంలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ వెంటే మేముంటామని ప్రజలందరూ ముక్తకంఠంతో తమ ఓటు ద్వారా నిరూపించారు. నగర ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి పథకాలు డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఆసరా, వికలాంగుల పెన్షన్లు, ఇంటింటికీ అర్బన్‌ మిషన్‌ భగీరథ మంచి నీళ్లు, నగరంలో ఎక్కడ చూసిన సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, డ్రైనేజీ వ్యవస్థ, వైకుంఠధామాలు వంటి అభివృద్ధి పథకాలు టీఆర్‌ఎస్‌ను గెలుపుతీరాలకు చేర్చాయి. 

రేవంత్‌రెడ్డిని ఛీకొట్టిన ఓటర్లు..

అబద్ధాలు పలికిన రేవంత్‌రెడ్డిని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ప్రజలు ఛీకొట్టి ఎన్నికల్లో చెంప చెల్లుమనిపించారు.కాంగ్రెస్‌ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అబద్ధాల రేవంత్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు. విలువలు గాలికొదిలి మంత్రి కేటీఆర్‌ మీద వ్యక్తిగత దూషణలకు దిగినప్పటికీ పరువు నిలుపుకోలేకపోయారు. ముఖ్యంగా మేడ్చల్‌ జిల్లాల్లో మంత్రి మల్లారెడ్డితోపాటు మల్కాజిగిరి ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై పెద్దఎత్తున దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు తిప్పికొట్టి టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎత్తులు వేసినా మేడ్చల్‌ జిల్లాలో మూడు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మంత్రిగా మల్లారెడ్డి చేసిన అభివృద్ధి పనులు, కేసీఆర్‌, కేటీఆర్‌ ఆదేశాల ప్రకారం మర్రి రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన చర్యలకు ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్ల జల్లులు కురిపించారు. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా ఓటర్లు వాటికి చెక్‌ పెట్టారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని కొంపల్లి, నిజాంపేట్‌, దుండిగల్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఎమ్మెల్యే వివేకానందతోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌కు ఓట్ల వర్షం కురిపించారు.


logo