గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 25, 2020 , 03:02:19

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌ వెల్లడి
  • -రంగారెడ్డి జిల్లాలో 3 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 348 వార్డులు
  • - ఆరు కౌంటింగ్‌ కేంద్రాల్లో 119 టేబుళ్లు ఏర్పాటు
  • - తేలనున్న 1,278 మంది అభ్యర్థుల భవితవ్యం
  • - 595 మంది కౌంటింగ్‌ అధికారులు, సిబ్బంది నియామకం
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల పరిధిలో 348 వార్డుల్లో 1278 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో పోలీసులు నిబంధనలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆర్డీవోలు కౌంటింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కౌంటింగ్‌ కేంద్రాల్లో 119 టేబుళ్లు ఏర్పాటు చేసి 595 మందిని కౌంటింగ్‌ అధికారులను నియమించారు. ఉదయం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌లను ఓపెన్‌ చేయనున్నారు. ఎన్నికల్లో మొదటి ఫలితం శంకర్‌పల్లిదే. ఇక్కడ 14 వార్డులకు గాను 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 13,764 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత ఆదిభట్ల, తుక్కుగూడ, ఆమనగల్లు, నార్సింగి మున్సిపాలిటీలు వరుస ఫలితాలు వెల్లువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో చివరి ఫలితం మాత్రం బడంగ్‌పేట్‌దే కానున్నది. ఇక్కడ 62వేల ఓట్లు పోలయ్యాయి.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు   : ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, పెద్దఅంబర్‌పేట్‌, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మంగళ్‌పల్లిలోని భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, శంషాబాద్‌, నార్సింగి, బండ్లగూడ జాగీర్‌, మణికొండ కిస్మత్‌ పూర్‌ లార్డ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఆమనగల్లు మున్సిపాలిటీ ఆమనగల్లు ఎంపీడీవో కార్యాలయం, షాద్‌నగర్‌ మున్సిపాలిటీ షాద్‌నగర్‌ ప్రభుత్వ కళాశాలలో జరుగుతుందని ఆయన తెలిపారు. 28 వార్డులకు గాను 10 టేబుళ్లు ఏర్పాటు చేశామని, శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు శంకర్‌పల్లి మోడల్‌ స్కూల్‌లో జరుగుతుందని 14 వార్డులకు గాను 5 టేబుళ్లు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు కౌంటింగ్‌ సిబ్బంది ఉంటారని, అదేవిధంగా ఒక్కో టేబుల్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి, ఒక సహాయ రిటర్నింగ్‌ అధికారి ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తారని కలెక్టర్‌ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణలో భాగంగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా, కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించగా, శిక్షణకు హాజరు కాని అధికారులకు షోకాజ్‌ నోటీస్‌లు జారీ అయ్యాయి.

ముద్ర మధ్యలో ఉంటే స్కేల్‌తో కొలిచి నిర్ణయం ..

బ్యాలెట్‌ పత్రంపై ఓటర్లు వేసిన స్వస్తిక్‌ ముద్ర ఇద్దరు అభ్యర్థుల పేర్ల మధ్యలో ఉంటే అధికారులు స్కేల్‌తో కొలిచి నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి పేరుకు సమీపంలో స్వస్తిక్‌ ముద్ర ఉందో చూసి ఓటును ఆ అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఏదైనా వార్డుల్లో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేతను ప్రకటిస్తారు. ఇందుకు గాను రెండు బాక్స్‌ల్లో ఒక్కో అభ్యర్థి పేరు మీద ఐదు చీటీలు రాసి వేస్తారు. ఇలా పది చీటీలను మరో డబ్బాలో వేసి కలిపిన తదనంతరం లాటరీ తీసి ఫలితాన్ని ప్రకటించనున్నారు.logo