శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 25, 2020 , 02:58:41

పార్టీ నిర్ణయానికి అభ్యర్థులు కట్టుబడి ఉండాలి

పార్టీ నిర్ణయానికి అభ్యర్థులు కట్టుబడి ఉండాలి
  • సమీక్షలో మంత్రి మల్లారెడ్డిమేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ఘట్‌కేసర్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ కౌన్సిలర్లు నడుచుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రెండు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని, అందులో సందేహం అవసరం లేదన్నారు.
మున్సిపల్‌ ఫలితాల్లో దాదాపుగా అన్ని సీట్లు టీఆర్‌ఎస్సే గెలుచుకుంటుందన్నారు. పార్టీ ఆధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ అభ్యర్థులు నడుచుకోవాలని, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారికి విప్‌ జారీ చేస్తామన్నారు. దీంతో కౌన్సిలర్‌ పదవులకు అనర్హత వేటు పడుతుందన్నారు. పదవులు ఆశించిన వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని, పార్టీ నిర్ణయానికి శిరసా వహించాలని అభ్యర్థులకు సూచించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం : మంత్రి

శామీర్‌పేట : మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా తూంకుంట మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగర వేస్తామని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారితో శుక్రవారం బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ విప్‌ జారీ చేసిందనే విషయాన్ని అభ్యర్థులు మరిచిపోవద్దన్నారు.  ఎన్నికల ఫలితాలకు ముందే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్లు నర్సింహా యాదవ్‌, నరేంద్రచారి, ఏఎంసీ చైర్మన్‌ సునీతలక్ష్మి, తూంకుంట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు, ఇన్‌చార్జి తాళ్ల జగదీశ్‌గౌడ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ లావణ్యనర్సింహారెడ్డి, రాజు, మురళీగౌడ్‌, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo