గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 24, 2020 , 02:01:29

రోడ్ల స్థితిగతులపై ‘ఓలా’ అధ్యయనం

రోడ్ల స్థితిగతులపై ‘ఓలా’ అధ్యయనం
  • -కార్లకు సెన్సార్లు అమర్చి రహదారుల పరిశీలన
  • - నివేదిక ఆధారంగా బల్దియా చర్యలు

 ప్రముఖ క్యాబ్‌ సేవల కంపెనీ ‘ఓలా’ నగర రోడ్ల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నది. ఆధునిక సాంకేతిక విధానాలతో కార్లకు చిప్‌లను అమర్చి సెన్సార్లతో రహదారులను పరిశీలిస్తారు. ఓలా సంస్థ నివేదిక ఆధారంగా బల్దియా అధికారులు రోడ్ల మరమ్మతులు చేపడుతారు.
-సిటీబ్యూరో,
 నమస్తే తెలంగాణ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రముఖ క్యాబ్‌ సేవల కంపెనీ ‘ఓలా’ నగరంలోని రోడ్ల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ అధ్యయనం నిర్వహించి జీహెచ్‌ఎంసీకి నివేదికను అందిస్తారు. దాని ఆధారంగా అధికారులు రోడ్లను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. నగర వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో ఓలా క్యాబ్‌లు సంచరిస్తున్నాయి. కోర్‌ సిటీతోపాటు శివార్లలో సైతం ఆ క్యాబ్‌లు వెళ్లని ప్రాంతమంటూ లేదు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా వారు రోడ్ల స్థితిగతులపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. సిబ్బందితో పని లేకుండా కార్లకు చిప్‌లను అమర్చుతారు. సెన్సార్‌ సహాయంతో అది రోడ్ల స్థితిగతులను రికార్డు చేస్తుందని అధికారులు తెలిపారు. కొద్దిరోజులపాటు ఇలా అధ్యయనం చేసిన అనంతరం ఎక్కడెక్కడ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో స్పష్టమవుతుంది. ఈ సమాచారాన్ని జీహెచ్‌ఎంసీకి అందిస్తారు. రోడ్ల కారణంగా ఎక్కడ వాహనాలకు ఇబ్బంది కలుగుతుందో అధ్యయనం ద్వారా తెలుస్తుంది. దీని ఆధారంగా జీహెచ్‌ఎంసీ రోడ్లకు తగిన మరమ్మతులు, రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతుంది. సర్వే కోసం జీహెచ్‌ఎంసీ ఎటువంటి నిధులు ఖర్చు చేయడంలేదని, పూర్తిగా ఓలా సంస్థ తమ అవసరాల కోసం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, రోడ్లను మెరుగుపర్చడం వల్ల తమ ట్యాక్సీ సేవలు మరింత మెరుగుపడుతాయనే ఉద్దేశంతో వారు రోడ్ల వివరాలను తమకు అందించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. సమగ్ర నివేదిక ఉచితంగా వస్తుండడం తమకు కూడా సంతోషకరమని, అంతేకాకుండా దాని ఆధారంగా ఎక్కడ ఏ రోడ్డును ఏ విధంగా మెరుగుపర్చుకోవాలో నిర్ణయించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.logo
>>>>>>