శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 20, 2020 , 01:43:14

అమ్మలకు..‘అనామిక’ అండ

అమ్మలకు..‘అనామిక’ అండ
  • - సోషల్‌ మీడియాలో ‘తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌'
  • - యాక్టివ్‌గా ఉంటున్న 2 వేల మంది మామ్స్‌
  • - ‘అనామిక’ పేరుతో పోస్టులుసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:
అమ్మ కోసం మరో అమ్మ అండగా నిలుస్తున్నది. ఒకరి సమస్యలు ఒకరు పరిష్కరించుకుంటూ సోషల్‌ మీడియాలో ఆదర్శంగా నిలుస్తున్నారు. సమస్య ఏదైనా ‘అనామిక’ పేరుతో పోస్టులు చేసి వాటి పరిష్కారానికి దారులు వెతుకుతున్నారు. తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ గ్రూపుగా ఏర్పడి అమ్మలందరూ ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకుంటున్నారు. ఆరోగ్యం నుంచి ఆర్థిక సమస్యల వరకు  చర్చించి భరోసా  కల్పించుకుంటున్నారు. ఆ గ్రూపులో డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, బిజినెస్‌ నిర్వాహకులు, సైకాలజిస్టులు,  హౌస్‌వైఫ్స్‌.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. వారి వారి పనుల్లో బిజీగా ఉన్నా  గ్రూపులో యాక్టివ్‌గా స్పందిస్తున్నారు.

కష్టాన్ని పంచుకుంటారు..!!

గత ఏడాది సెప్టెంబర్‌లో ‘తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌' అనే గ్రూపు ఏర్పాటయింది. అందులో ఇప్పటి వరకు 2300కు పైగా సభ్యులు ప్రవేశం పొందారు. ప్రపంచ వ్యాప్తంగా అందులో సభ్యులుగా ఉన్నారు. మహిళల సాధికారికతే లక్ష్యంగా ఈ గ్రూపు పనిచేస్తుండటం విశేషం. గ్రూపు సభ్యులకు ఏ కష్టమొచ్చినా ఒకరికొకరు బాసటగా నిలుస్తున్నారు. వారంలో.. ఒక్కో రోజు ఒక్కో టాపిక్‌పై గ్రూపులో చర్చలు జరుపుతారు. సోమవారం- మానసిక ఆరోగ్యం, ఇంటి అలంకరణ చిట్కాలు, సలహాలు, మంగళవారం- పుసక్త పరిచయాలు, విశ్లేషణలు, బుధవారం- బిజినెస్‌ ప్రకటనలు, ఉద్యోగ అవకాశాలు, గురువారం- తెలుగు సాహిత్యం చర్చలు, సాహిత్య పోటీలు, శుక్రవారం- తెలుగు ఆచారాలు, పండగలు, శనివారం- వంటలు, ఆదివారం సినిమా కబుర్లు, సరదా ఆటలు తదితర కార్యక్రమాలతో సభ్యులంతా చర్చిస్తారు.

అనామికతో అండగా..!!

ఆడవారికి అనేక సమస్యలు.. అందులో వారు ఇతరులకు చెప్పుకోలేనివీ ఉంటాయి. కొంతమంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.  అలాంటి వారికి అండగా తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌ గ్రూపు చేయూతనిస్తుంది. ఎవరైన తమ కష్టాన్ని  చెప్పుకోవడానికి ఇబ్బందిగా భావిస్తే వారు గ్రూపు ఫౌండర్‌కు వ్యక్తిగత సందేశం పంపితే సరిపోతుంది. ఆ సమస్యను ‘అనామిక’ పేరుతో పోస్టు చేస్తారు. ఎవరో ఒకరూ ఆ సమస్యపై స్పందిస్తుంటారు. అలా ఇప్పటి వరకు ఏడు వందల మంది మామ్స్‌ సమస్యలను పరిష్కరించామని ఫౌండర్‌ ప్రదీప్తి తెలిపారు. అందులో ఉద్యోగ సమాచారం షేర్‌ చేసుకుంటూ కొంతమంది అమ్మలు ఉద్యోగిణులుగా ఎదగడం విశేషం. వారి కుమారులు, కుమార్తెలకు సంబంధించిన విషయాలను చర్చించుకుంటూ సలహాలు..సూచనలు చేసుకుంటూ అమ్మలంతా సోషల్‌ మీడియలో స్మార్ట్‌ అమ్మలుగా దూసుకుపోతున్నారు.

సేవా కార్యక్రమాలు..

సమస్య వస్తే ఎదిరించి నిలబడాలి. మనకు మనమే పరిష్కరించుకోవాలి. మనసు ఉంటే ఎలాగైనా సాయం చేయొచ్చు. అమ్మలకు ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే దారులు తక్కువగా ఉంటాయి. అందుకే సోషల్‌ మీడియాలో ఒక గ్రూపుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మహిళల కోసం తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌ గ్రూపును ఏర్పాటు చేసుకున్నాం. ఆడవారి సమస్యలపై చర్చిస్తాం. ఎఫ్‌బీ గ్రూపులో సభ్యులుగా ఉన్న మేము కలుసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంటాం. -వి.ప్రదీప్తి, తెలుగు మామ్స్‌ గ్రూప్‌ అడ్మిన్‌

వెంటనే స్పందన..

మనం ఎంత సంపాదించామనేది కాదు.. ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి మనం చేయాల్సినది చేయాలి. ఇతరులకు సాయం చేయడానికి ఉన్న ఏ దారిని వదలుకోవొద్దు. గ్రూపులో సామాజిక అంశాలపై చర్చిస్తూ అనేక విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ఎవరికైన సమస్య ఉంటే వెంటనే స్పందించి పరిష్కరించుకుంటున్నాం. చాలా మంది సమయం ఉండటం లేదని భావిస్తారు.  సోషల్‌ మీడియాలో కూడా ఇలా ఒకరికి ఒకరం అండగా ఉండొచ్చనే విషయాన్ని ప్రచారం చేస్తున్నాం.     
- దీప్తి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి


logo