గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 19, 2020 , 00:23:49

నేడు పల్స్‌ పోలియో

నేడు పల్స్‌ పోలియో


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జిల్లాలో పల్స్‌పోలియో నిర్వహణకు గాను సర్వం సిద్ధమయ్యింది. నిండు జీవితానికి భద్రతనిచ్చే చుక్కల మందు వేసేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకుగాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో 0-5ఏండ్లలోపు వారు 5,00,122 మంది పిల్లలుండగా, వీరందరికి వ్యాక్సీన్లు వేయనున్నారు. ఇందుకోసం 2,728బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 85 మొబైల్‌, 50 ట్రాన్సిట్‌పాయింట్లల్లో చుక్కల మందు వేయనున్నారు. జిల్లాలో 110 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించగా, వీటిలో వందశాతం లక్ష్యాన్ని అధిగమించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు గాను పర్యవేక్షణాధికారులను నియమించారు. చుక్కలు వేయడానికి వైద్యాధికారులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోబోతున్నారు. జిల్లాలో గల తల్లిదండ్రులంతా తమ పిల్లలకు చుక్కల మందు వేయడం ద్వారా పోలియో రహిత సమాజ సాధనకు కృషిచేయాలని డీఎంఅండ్‌హెచ్‌వో డా.వెంకటి, ఇమ్యూనైజేషన్‌ అధికారి నాగార్జున కోరారు.

ఎక్కడెక్కడ వేయించుకోవచ్చు

పోలింగ్‌బూత్‌లు, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, నర్సింగ్‌హోంలు, అంగన్‌వాడీ సెంటర్లు, కమ్యూనిటీహాళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ప్లేస్కూళ్లు, గార్డెన్లు, పార్క్‌లు, ఫంక్షన్‌హాళ్లు, దేవాలయాలు, మజీద్‌, చర్చి, గురుద్వారాలు, సమావేశమందిరాల్లో వేయించుకోవచ్చు.

మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నేడు (ఆదివారం) ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యాధికారి డా.నారాయణరావు సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ దఫా జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 4,18,720 మంది ఉన్నారని, వీరందరికీ చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పోలియో చుక్కలు వేసేందుకు 1093 బూత్‌లను ఏర్పాటు చేశామని, మొదటి రోజు పోలియో చుక్కలు వేయించుకోలేని వారు ఈ నెల 20, 21 తేదీలలో తమ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ప్రజలు తమ సిబ్బందికి సహకరించాలని డీఎంఅండ్‌హెచ్‌వో సూచించారు. జిల్లాలో 267 హైరిస్క్‌ ప్రాంతాలున్నాయని, ఇందులో సుమారు 4,283 మంది చిన్నారులున్నారని, వీరికి కూడా పోలియో చుక్కలు వేసేందుకు గాను 19 మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పబ్లిక్‌ ప్రాంతాలలో బస్టాండులలో, రైల్వే స్టేషన్లలో, మెట్రో స్టేషన్లలోను పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 108 రూట్లలో 4,372 మంది సిబ్బంది పోలియో విధులను నిర్వర్తించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.నారాయణరావు తెలిపారు.


logo
>>>>>>