శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 18, 2020 , 00:58:39

చూడముచ్చటగా..

చూడముచ్చటగా..
  • - మారిపోనున్న రహదారుల రూపురేఖలు
  • - శాస్త్రీయ పద్ధతుల్లో మరమ్మతులు
  • - నేడు అత్తాపూర్‌లో మిల్లింగ్‌ విధానానికి శ్రీకారం
  • - ఫుట్‌పాత్‌లకూ సొబగులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర రోడ్లు కొత్త సొబగులు అద్దుకోనున్నాయి. రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. నగరవాసులకు అద్భుతమైన ప్రయాణ అనుభూతిని కలిగించనున్నాయి. సీఆర్‌ఎంపీ విధానంలో 709 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఐదేండ్ల పాటు సాగే ఈ కాంట్రాక్టుకు రూ. 1827 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో భాగంగా తరుచూ బీటీ వేస్తూ.. రోడ్ల ఎత్తును పెంచేస్తున్న విధానానికి స్వస్తిపలికేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. శాస్త్రీయ పద్ధతుల్లో మిల్లింగ్‌ విధానం ద్వారా చెక్కి మరమ్మతులు చేశాకే.. బీటీ మిశ్రమాన్ని వేయనున్నారు.  ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. అత్తాపూర్‌లో శనివారం ఈ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ఫుట్‌పాత్‌లూ సరికొత్తగా కనిపించనున్నాయి.

లేయర్లపై లేయర్లు బీటీ వేస్తూ రోడ్ల ఎత్తును పెంచేస్తున్న విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ సమాయత్తమైంది. శాస్త్రీయ పద్ధతుల్లో మిల్లింగ్‌ విధానం ద్వారా రోడ్లను చెక్కి మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్తాపూర్‌లో శనివారం పనులకు శ్రీకారం చుడుతున్నారు. దీనివల్ల పనుల నాణ్యతలోనే కాకుండా రోడ్ల ఎత్తు పెరగకుండా ఉంటుందని, నగర వ్యాప్తంగా ఇదే పద్ధతిని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం(సీఆర్‌ఎంపీ)కింద నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహణ పనులు ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో చేపడుతున్న విషయం విదితమే. ఈ శనివారం నుంచి పనులు ప్రారంభమవుతున్నాయి. అత్తాపూర్‌లోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 170 వద్ద మిల్లింగ్‌ పనులతో పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విధానంలో రోడ్డు ఏర్పాటుకు ముందు దాన్ని ఎగుడు దిగుడు లేకుండా మిల్లింగ్‌ యంత్రం ద్వారా పూర్తిగా చెక్కుతారు. అనంతరం ఆ వ్యర్థాలను పూర్తిగా తొలగించి బీటీ మిశ్రమాన్ని వేస్తారు. దీనివల్ల రోడ్డు ఎత్తు పెరగకుండా ఉండడమే కాకుండా బీటీ మంచిగా అతుక్కొని ఎక్కువ కాలం మన్నుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా సక్రమంగా క్యాంబర్‌(నీరు సునాయాసంగా వెళ్లేలా రోడ్డుకు స్లోప్‌)ను ఏర్పాటు చేస్తారని, దీని వల్ల రోడ్డుపై నీరు నిలువకుండా బీటీ ఎక్కువకాలం మన్నే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. రోడ్లను శాస్త్రీయ పద్ధతుల్లో ఏర్పాటు చేయాలని, మిల్లింగ్‌ విధానాన్ని చేపట్టాలని ఆయా ప్రైవేటు ఏజెన్సీలతో బల్దియా ఒప్పందం చేసుకున్నది. దీంతో ఇక సాంప్రదాయ పద్ధతుల్లో లేయర్‌పై లేయర్‌ బీటీ వేస్తూ రోడ్డు ఎత్తును పెంచుకుంటూ పోయే పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికినట్లు అవుతుందని అధికారులు వివరించారు. మిల్లింగ్‌ విధానం కొంత ఖర్చుతో కూడుకున్నది. ఎంతో ఖర్చుతో కూడుకున్న మిల్లింగ్‌ యంత్రాన్ని గతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లో ఏర్పాటు చేసిన వైట్‌ టాపింగ్‌ రోడ్డు సందర్భంగా నగరానికి తెప్పించారు. ఈ విధానం ద్వారానే వైట్‌ టాపింగ్‌ రోడ్డును ఏర్పాటుచేయగా, దాదాపు ఐదేండ్లుగా ఆ రోడ్డు చెక్కు చెదరలేదు. అయితే, ప్రస్తుతం బీటీ ఏర్పాటు చేసేందుకు కూడా మిల్లింగ్‌ యంత్రాన్ని  ఉపయోగించాలని నిర్ణయించారు. సీఆర్‌ఎంపీ విధానంలో 709 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలు చేపట్టిన విషయం విదితమే. ఐదేండ్లపాటు సాగే ఈ కాంట్రాక్టుకు రూ.1827 కోట్లు ఖర్చు చేయనున్నారు.


కొత్త ఫుట్‌పాత్‌లకు విభిన్న నమూనాలు

సీఆర్‌ఎంపీ కార్యక్రమంలో భాగంగా రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రస్తుతమున్న ఫుట్‌పాత్‌లను యథావిథిగా మరమ్మతులు చేయనుండగా, ప్రతి జోన్‌లో సుమారు పది కిలోమీటర్ల చొప్పున కొత్త ఫుట్‌పాత్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఈ ఫుట్‌పాత్‌లను విభిన్న నమూనాల్లో ఆయా ప్రైవేటు ఏజెన్సీలు తమ బ్రాండింగ్‌ ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేయనున్నాయి. దీనివల్ల ఫుట్‌పాత్‌లు కొత్తదనంతో ఉండడమే కాకుండా ఏ ఫుట్‌పాత్‌ను ఏ ఏజెన్సీ అభివృద్ధి చేసిందో ఇట్టే తెలుసుకునే వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.


logo