బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 15, 2020 , 03:09:45

23 కూడళ్లలో స్కై వాక్‌లు

23 కూడళ్లలో స్కై వాక్‌లు
  • - తొలి విడుతలో ఉప్పల్‌, మెహిదీపట్నం జంక్షన్‌లో స్కైవాక్‌లు
  • - డిజైన్లతో కూడిన నివేదిక సిద్ధం
  • - త్వరలో ప్రభుత్వం దృష్టికి హెచ్‌ఎండీఏ ప్రతిపాదన
  • - ముఖ్యమైన 23 కూడళ్ల గుర్తింపు
  • - విడుతల వారీగా పనులు
  • - తీరనున్న పాదచారుల కష్టాలు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పాదచారులకు ఇదో శుభవార్త. అత్యంత రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటాలంటే ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని దాటాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు నగరంలో ముఖ్యమైన కూడళ్లలో అద్భుతమైన ఆకాశమార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 23 చోట్ల ఆకాశమార్గాలు అవసరమని గుర్తించగా, తొలి విడుతలో రెండుచోట్ల ఉప్పల్‌, మెహిదీపట్నం జంక్షన్‌లలో ఆకాశమార్గాలకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. మెహిదీపట్నం రైతుబజార్‌ దగ్గర రెండువైపులా ఉన్న రోడ్డును దాటడం కష్టంగా మారింది. రోజూ మెహిదీపట్నం రైతుబజార్‌ నుంచి 7,900 బస్సులు వివిధ ప్రాంతాలకు తిరుగుతుంటాయి. ఇక్కడ ఇరువైపులా బస్టాండ్‌తోపాటు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానం చేస్తూ ఈ ఆకాశమార్గాన్ని నిర్మించనున్నారు. అసిఫ్‌నగర్‌, రైతుబజార్‌, లక్డీకాపూల్‌, రేతిబౌలి వైపునకు వెళ్లే పాదచారులకు ప్రయాణం సులువు కానున్నది. అద్భుతమైన డిజైన్లతో ఈ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రెండోది ఉప్పల్‌ జంక్షన్‌.. కాలేజీ, స్కూళ్లతోపాటు వరంగల్‌ జాతీయ రహదారి కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లాలంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమయంలో యథేచ్ఛగా దూసుకువచ్చే లారీలతో ప్రమాదాలు తరచూ జరగడం, పాదచారుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్‌ జంక్షన్‌లో నలువైపులా పాదచారులు వెళ్లేందుకు వీలుగా స్కైవే నిర్మాణం చేపట్టనున్నారు. బెంగళూరుకు చెందిన ఏజెన్సీతో కలిసి హెచ్‌ఎండీఏ ఇంజినీర్లు డిజైన్ల రూపకల్పన పూర్తి చేశారు. త్వరలో ప్రభుత్వ ఆమోదం మేరకు కార్యరూపంలోకి ఈ రెండు చోట్ల పనులను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

23 కూడళ్లలో స్కైవాక్‌లు..

హైదరాబాద్‌ మహా నగరంలో కీలకమైన రద్దీ ప్రాంతాల దగ్గర రోడ్డును దాటాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టుకోవాల్సిన దుస్థితి. ప్రధానంగా బస్టాండ్‌ నుంచి రైల్వే స్టేషన్‌కు కానీ, మెట్రో అందుబాటులోకి వచ్చాక మెట్రో స్టేషన్‌ నుంచి బస్టాండ్‌కు వెళ్లే సౌకర్యం లేదు. ఇందులో భాగంగానే మెట్రో, రైల్వే, బస్టాండ్‌, ఇతర వాణిజ్య భవనాలను అనుసంధానం చేస్తూ ఆకాశమార్గాలను నిర్మించాలని భావించారు. నగరం నలువైపులా అధ్యయనం చేసి తక్షణం 23 రద్దీ ప్రాంతాల్లో స్కైవాక్‌లు అవసరమని గుర్తించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, మెహిదీపట్నం, మదీనా జంక్షన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ జంక్షన్‌, జేఎన్‌టీయూ జంక్షన్‌, ఉప్పల్‌, ప్యారడైజ్‌ జంక్షన్‌, అఫ్జల్‌గంజ్‌ జంక్షన్‌, కోఠి ఆంధ్రాబ్యాంక్‌ జంక్షన్‌, లక్డీకాపూల్‌ పెట్రోల్‌ బంకు జంక్షన్‌, అమీర్‌పేట జంక్షన్‌, ఓవైసీ జంక్షన్‌, న్యూ బోయిన్‌పల్లి జంక్షన్‌, చిలకలగూడ జంక్షన్‌, బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు జంక్షన్‌, ఎంజే మార్కెట్‌ జంక్షన్‌, మియాపూర్‌ టీ జంక్షన్‌, సంగీత్‌ జంక్షన్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, ఖైరతాబాద్‌ జంక్షన్‌, ఎస్‌ఆర్‌నగర్‌ జంక్షన్‌, ఈసీఐఎల్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో స్కైవాక్‌లు అనివార్యమని ప్రతిపాదించారు. logo