శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 14, 2020 , 01:29:42

రంగుల పతంగి ఆకాశానికి వన్నెలద్ది

 రంగుల పతంగి ఆకాశానికి వన్నెలద్ది
  • -పరేడ్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ప్రారంభం
  • -వివిధ ఆకృతులతో ఆకట్టుకున్న పతంగులు
  • -15 దేశాల నుంచి కైట్‌ ప్లేయర్స్‌
  • -రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో ఎగురవేత
  • -సంక్రాంతి వరకూ సందడే

రంగురంగుల పతంగులు.. ఆకాశానికి సప్తవర్ణాలతో వన్నెలద్దాయి.. చూడచక్కటి ఆకృతులతో ఆహ్లాదాన్ని పంచాయి. నోరూరించే మిఠాయిలు పసందు చేశాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో సోమవారం ప్రారంభమైన కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ఆద్యంతం ఆకట్టుకున్నది. 15 దేశాల నుంచి తరలివచ్చిన కైట్‌ ప్ల్లేయర్స్‌తో సందడి నెలకొంది.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆకాశంలో పతంగులు నృత్యిస్తున్నాయా అన్నట్టుగా... కలర్‌ఫుల్‌ కైట్స్‌ గాల్లో విహరించాయి. విభిన్న ఆకృతుల్లో ఆకాశంలో మెరిశాయి. ఓ వైపు చిన్నారుల కేరింతలు.. మరోవైపు పతంగుల విన్యాసాలు ఇంకోవైపు నోరూరించే మిఠాయిలు వెరసి సంక్రాంతి  ఈ ఏడాది సరికొత్త అనుభూతిని కలిగించింది. అందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌ వేదికయింది. సంక్రాంతి సందడి పతంగులతోనే ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ సోమవారం ఆరంభమైంది. జాతీయ, అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్స్‌, మిఠాయి షాపుల నిర్వాహకులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈసారి గ్రామీణ ఆట, పాటలను జోడించి పల్లె వాతావరణాన్ని పట్నం వాసులకు పరిచయం చేయడం విశేషం. తొలిరోజే కైట్‌ ఫెస్టివల్‌కు చిన్నారులను తీసుకుని నగరవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈనెల 15 వరకు ఫెస్టివల్‌ ఉంటుంది.

రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతతో ఎగిరేద్దాం..!!

పతంగులు ఎగురవేయడమంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సమేతంగా పతంగులను గాల్లో ఎగురేస్తూ సంబురాలు చేసుకుంటారు. గాల్లో చాలా ఎత్తుకు వెళ్లిన పతంగులను చూస్తే ఆ కిక్కే వేరూ. భలే సంతోషాన్నిస్తుంది. అయితే అది తెగిపోతే చాలా బాధగా ఉంటుంది. మళ్లీ అంత ఎత్తుకు మరో పతంగి ఎగురవేయడం కష్టమే. అందుకే గంటల తరబడి గాల్లో చక్కర్లూ కొట్టే పతంగులను వీక్షించే అవకాశం వచ్చింది. పరేడ్‌ గ్రౌండ్‌లో పతంగుల కోలాహలం మొదలయింది. 15 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్స్‌, 60 మంది జాతీయ కైట్‌ ప్లేయర్స్‌ పాల్గొన్నారు. పతంగులు ఎగురవేయడంలో వారు ఎక్స్‌పర్ట్స్‌. ముఖ్యంగా రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ సహాయంతో గాల్లో పతంగులతో నాట్యం చేయిస్తున్నారు. తమ తమ దేశ ప్లాగ్‌లు, వారికి నచ్చిన ఆకృతుల్లో కైట్స్‌ను రూపొందించారు. 

ఆకృతి అదిరింది.. పతంగి మెరిసింది!!

పతంగులు విభిన్నఆకృతుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. కారు పతంగి, గన్నైంస్టెల్‌, పారాషుట్‌, నాట్య భంగిమ, డెల్టా, అతిభారీ గుండ్రని ఆకారంలో పతంగులు సందర్శకులను మెస్మరైజ్‌ చేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సింగపూర్‌, ఫిలిప్పిన్స్‌, జపాన్‌, కోరియా, టర్కీ, స్కాట్లాండ్‌, శ్రీలంక, ఇజ్రాయిల్‌, ఉక్రెయిన్‌, థాయిలాండ్‌, కబోడియా తదితర దేశాలకు  చెందిన కైట్‌ ప్లేయర్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొని వాళ్లు ప్రత్యేకంగా రూపొందించిన కైట్స్‌ను ఎగురవేశారు. సందర్శకులంతా వారితో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. వారి కైట్స్‌ను ఎగురవేస్తూ హ్యాపీగా ఫీలయ్యారు.

పతంగుల పండుగ నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు

పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైన పతంగులు, స్వీట్‌ ఫెస్టివల్‌ సందర్భంగా 15తేదీ వరకు పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విదిస్తున్నట్లు ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

-ప్లాజా వైపు నుంచి తివోలి ఎక్స్‌ రోడ్‌కు వెళ్లే వాహనాలను ఫ్లాజా నుంచి ఎస్‌బీఐ, వైఎంసీఏ, స్వీకార్‌ ఉపకార్‌ మీదుగా తివోల్‌ ఎక్స్‌ రోడ్స్‌ వెళ్లాలి.
-ఎస్‌బీఐ జంక్షన్‌ నుంచి స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్‌కు వచ్చే వాహనాలు ఎస్‌బీఐ నుంచి వైఎంసీఏ మీదుగా స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్‌కు వెళ్లాలి.
-తివోలి జంక్షన్‌ నుంచి ఫ్లాజా వైపు వచ్చే వాహనాలను తివోలి జంక్షన్‌ నుంచి బ్రూక్‌ బండ్‌, లీ రాయల్‌ ప్యాలెస్‌, సీటీఎం/స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్‌ మీదుగా వైఎసీఏ కుడివైపు వెళ్లాలి.

నోరూరించే వెయ్యి వెరైటీ స్వీట్లు..!!

దేశీయ, విదేశీ మిఠాయిలూ కూడా ఫెస్టివల్‌లో నోరూరిస్తున్నాయి. ముఖ్యంగా 12 దేశాలకు చెందిన మిఠాయిలు నగరవాసులకు పరిచయం చేశాయి. సుమారు వెయ్యి వెరైటీలు ఆకట్టుకుంటున్నాయి. దేశీ మిఠాయిలు మణిపూర్‌ ఖీర్‌, ఆంధ్ర పూతరేకలు, తమిళ పొంగల్‌, గుజరాత్‌ బాసుంది తదితర వెరైటీలు విక్రయానికి ఉన్నాయి. సుమారు 120కి పైగా స్టాళ్లు ఏర్పాటయ్యాయి. 

పల్లె ఆట పరిచయం..!!

కనుమరుగవుతున్న గ్రామీణ ఆటలకు ప్రాణం పోయాలనే ఉద్దేశంతో తెలంగాణ టూరిజం, భాషా సాంసృ్కతిక శాఖ ఆధ్వర్యంలో పల్లె ఆట, పాటలను నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. అందుకోసం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ముఖ్యంగా బొంగరం, చిర్రగోన, టైరు ఆట, గోలీలాటలు తదితర గ్రామీన ఆటలను ఫెస్టివల్‌కు జోడించారు.

 కైట్‌ మ్యూజియం ఏర్పాటు

చిన్నప్పటి నుంచి పతంగులు ఎగురవేయడ మం టే చాలా ఇష్టం. సుమారు 30ఏండ్ల నుంచి కైట్‌ ఫెస్టివల్‌ ఎక్కడ జరిగినా అక్కడ నా పతంగి ఎగురాల్సిందే. సందర్శకుల కోసం  కైట్‌ మ్యూజియా న్నే ఏర్పాటు చేశాను. హైదరాబాద్‌లో కైట్‌ ఫెస్టివల్‌ అనగానే ఆసక్తి కలిగింది. మొదటిసారి వచ్చా ను. రాజస్తాన్‌, గుజరాత్‌లో పాల్గొన్నాను. 
- మెహ్‌మెట్‌, ఇస్లాంబుల్‌

కైట్‌ ఫ్లైయర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌

కైట్‌ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ బాగుంటుంది
నేను కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం ఐదోసారి. అనేక రాష్ర్టాల్లో పాల్గొన్నా, కానీ హైదరాబాద్‌లో కైట్‌ ఫెస్టివల్‌ అంటే చాలామంది వస్తారు. అధికారులు మంచి ఆతిథ్యం ఇస్తారు. మా కైట్‌ పేరు డెల్టా. గతంలో లిమ్కాబుక్‌లో సైతం రికార్డు నమోదు చేశాం. అతి భారీ పతంగి తయారు చేశాం. ఈసారి డెల్టాతో నగరానికి వచ్చాం.
- ఖుష్బు జాంగిడ్‌, నాగ్‌పూర్‌

చిరునవ్వు కోసం..

పతంగులు ఎగురవేయడం కంటే వాటిని చూసి ఆనందించే చిన్నారుల చిరునవ్వంటేనే నాకు చాలా ఇష్టం. అందుకే పతంగుల ఫెస్టివల్‌ ఎక్కడ జరిగినా పాల్గొంటాను. కైట్‌ టీమ్‌ కూడా ఉంది. చిన్నారుల కోసం స్పెషల్‌ పతంగులు రూపొందించాం. వారికి ఉచితంగానే ఇస్తాం.
- రిక్కి, ఆస్ట్రేలియా..

కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది

హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. కైట్‌ ఫెస్టివల్‌కు చాలా స్పందన వచ్చింది. గతంలో వేరే కైట్‌ టీమ్‌ పాల్గొనడం వల్లే రాలేకపోయాను. ఈసారి మా కైట్‌ పేరు ఇన్‌సెక్ట. ప్రభుత్వం ఈ తరహా ఫెస్టివల్స్‌ నిర్వహించి ప్రజలకు ఆనందం ఇవ్వడంతో పాటు మాలాంటి వాళ్లకు ఉపాధిని కూడా ఇస్తుండటం మంచి విషయం.
- ఒహ్‌జీహ్వన్‌, కొరియా


logo