శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 13, 2020 , 02:05:17

కిక్కిరిసిన నుమాయిష్‌

కిక్కిరిసిన నుమాయిష్‌
  • -వరుస సెలవులతో పెరిగిన రద్దీ
  • -ఎగ్జిబిషన్‌లో చిన్నారుల సందడి

సిటీబ్యూరో/అబిడ్స్‌, నమస్తే తెలంగాణ: ఎగ్జిబిషన్‌కు సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా సెలవులు కావడంతో నగర నలుమూలల నుంచి సందర్శకులు ఎగ్జిబిషన్‌ సందర్శించేందుకు తరలివస్తున్నారు. శనివారం 60వేల వరకు సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించగా ఆదివారం అదేస్థాయిలో తరలివచ్చారు. దీంతో ఎగ్జిబిషన్‌ మైదానం సందర్శకులతో కిటకిటలాడింది. గత పన్నెండు రోజులుగా దాదాపు రెండు లక్షలకు పైగా సందర్శకులు సందర్శించారు. సంక్రాంతి పండుగ సెలవులు తొడవడంతో సందర్శకులు రోజురోజుకూ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఆదివారం సందర్శకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మైదానంలోని దుకాణా లు సందర్శకులతో కిటకిటలాడాయి. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ బి.ప్రభాశంకర్‌, కోశాధికారి వినయ్‌కుమార్‌ మైదానంలో తిరిగి పర్యవేక్షించారు. పం డుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో నగర ప్రజలు షాపింగ్‌ బాటపట్టారు. వీరితోపాటు తమ పిల్లలకకు కూడా కావాల్సిన డ్రెస్సులు, ఇతర వస్తువులు తీసుకునేందుకు వారిని కూడా వెంట పెట్టుకుని తీసుకుపోతున్నారు పెద్దలు.

ఇక ఇదే సమయంలో నగరంలో అందరికీ అందుబాటులో ఉన్న అతి పెద్ద షాపింగ్‌ స్పాట్‌ అయిన నుమాయిష్‌ అటు షాపింగ్‌తోపాటు వారి పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన ప్రాంతంగా మారింది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణాలు, రంగుల రట్నం, కప్పూ సాసర్‌ వంటివి పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీంతో పిల్లలు నుమాయిష్‌ను చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఈకాలం పిల్లలకు ఫోన్‌ వంటి గ్యాడ్జెట్లకు అతుక్కుపోకుండా కాస్త నుమాయిష్‌ వల్ల బయట ప్రపంచం, ఆటలపై  కూడా ఆసక్తి పెరుగుతుంది.

కాస్త గిరాకీ పెరిగింది..

గత ఐదేండ్ల నుంచి ఇక్కడ స్టాల్‌ పెడుతున్నాం. సెలవులు ప్రారంభం అవ్వడం, ఆదివారం కావడంతో గిరాకీ బాగానే పెరిగింది. గత సంవత్సరం జరిగిన అగ్నిప్రమాదం వల్ల కాస్త జనాలు ఇన్ని రోజులు తక్కువగా వచ్చారు. ఈ సారి చేసిన ఏర్పాట్లను తెలుసుకుని మెల్లగా జనాల రాక పెరుగుతుంది. చిన్నారులు ఎక్కువగా తుపాకుల బొమ్మలు, చైనా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బార్బీ బొమ్మలు, డ్రోన్స్‌ ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
- చంద్రకాంత్‌, వ్యాపారి


logo