శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 12, 2020 , 01:22:42

మానవత్వం మరిచారు..పసిపాపను వదిలేశారు

మానవత్వం మరిచారు..పసిపాపను వదిలేశారు


జీడిమెట్ల, జనవరి 11 : మానవత్వం మరిచిన ఓ తల్లి ముక్కుపచ్చలారని పసిపాప(ఆడబిడ్డ)ను ఎముకలు కొరికే చలిలో వదిలేసి వెళ్లింది. పాపం ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కాని పసిపాపను భారంగా భావించి బజారులో పడేసింది. తెల్లవారు జామున చలికి వణుకుతూ గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పసికందును చూసి స్థానికులు కంటతడి పెట్టారు. వాకింగ్‌కు వెళ్లిన వారు చూసి డయల్‌ 100కు కాల్‌ చేయగా పసికందును దవాఖానకు తరలించారు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అపురూపకాలనీలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకున్నది.  పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సుమారు రెండు రోజుల పసికందును ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వదిలేసి వెళ్లారు.  వాకింగ్‌కు వెళ్లిన ఓయువకుడు పసికందు ఏడుపు వినిపించడంతో అక్కడి వెళ్లి చూడగా ఓ బట్టలో పసికందు ఏడుస్తూ కనిపించింది. వెంటనే డయల్‌ 100 కు కాల్‌ చేసి విషయం తెలుపగా జీడిమెట్ల ఏఎస్‌ఐ పాండునాయక్‌, కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌ పెట్రోమొబైల్‌తో అక్కడికి చేరుకుని  చైల్డ్‌లైన్‌ కో ఆర్డినేటర్‌ ప్రేమ్‌కుమార్‌ సమాచారం అందించి బాలానగర్‌ స్మైల్‌ టీం ఎస్సై యాదగిరి, సలీం బృందానికి అప్పగించారు. వారు పాపను పరీక్షించి  చికిత్స నిమిత్తం నిలోఫర్‌ దవాఖానకు తరలించారు.  అయితే మూడు నెలల కిందట హెచ్‌ఎంటీ నిర్జన ప్రదేశంలో ఓ పసికందును వదిలేసి వెళ్లిన ఘటన మరువక ముందే  మళ్లీ శనివారం తెల్లవారుజామున అపురూప కాలనీలో మరో సంఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.


logo