గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 09, 2020 , 17:56:47

కిలకిలారావాలు..పాతబస్తీలో అమ్మకాలు

కిలకిలారావాలు..పాతబస్తీలో అమ్మకాలు

-విదేశాల నుంచి పక్షుల దిగుమతి
-మహబూబ్‌చౌక్‌ దుకాణాల్లో సందడిఇడుమాల కిరణ్‌కుమార్‌


(సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ):అది చార్మినార్‌ వెనకాల ఉన్న మహబూబ్‌ చౌక్‌.. మజీద్‌ పక్కన ఉండే ఓ గల్లీ. అక్కడికి వెళితే చాలు.. పక్షుల కిలకిలారావాలు.. రామ చిలుక అందమైన పలుకులు.. ఆహ్లాదాన్ని అందించే ఆస్ట్రేలియన్‌ లవ్‌ బర్డ్స్‌.. మొత్తంగా పక్షుల ప్రపంచంలోకి వెళ్లామా అనే అనుభూతి కలగక మానదు. విభిన్న రకాల పక్షులు అక్కడ దర్శనమిస్తాయి. ఆ గల్లీ మొత్తం పక్షుల షాపులే. ఊర పిచ్చుక నుంచి విదేశీ పక్షుల వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అందమైన రంగులతో కనువిందు చేస్తూ స్వాగతం పలుకుతాయి.

విదేశాల నుంచి..
కాకాటియల్‌ పక్షి, కానరీ పక్షి, బాజిరిగర్‌ పక్షులు భలే సందడి చేస్తున్నాయి. రూ. 100 నుంచి లక్ష యాభై వేల వరకు ఖరీదు చేసే పక్షి జాతులు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, ఫిలిప్పిన్స్‌ తదితర దేశాల నుంచి నగరానికి పక్షులు దిగుమతి అవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ లవ్‌బర్డ్స్‌, కెనడా నుంచి కానరీ తదితర జాతులు భాగ్యనగరానికి దిగుమతి అవుతున్నాయి. పొడుగ్గా ఉన్న అరుదైన జాతికి చెందిన ఓ పావురం ధర రూ. 25 వేలు. సిల్వర్‌ రంగులో ఉన్న కెనడాకు చెందిన మరో పావురం ధర రూ. 15 వేలు. ప్రేమ పావురాల జతకు రూ. 3.500. కొమ్ములున్నాయా అన్నట్టుగా కనిపించే కాకాటియల్‌ పక్షులు యమ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అందమైన మాక పక్షల ధర రూ. 1.50 వేలు ఉందని నగరవాసులు కొనుగోలు అధికంగా చేసే వాటిలో అవే మొదటి స్థానంలో ఉన్నాయని తెలిపారు.

ఇంటికే అందం..!!
ఇంటీరియర్‌ డిజైన్‌తో ఇండ్లు అద్భుతంగా కనిపించేలా నిర్మించుకోవడమే కాదు.. ఇండ్లల్లో పక్షులు, జంతువులను పెంచుకొనే కల్చర్‌ నగరంలో పెరిగింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మణికొండ, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్‌మెంట్లు, నగర శివార్లులోని విల్లాల్లో ఎక్కువగా పెట్‌ కల్చర్‌ విస్తిరిస్తుంది. నగరంలో ఆబిడ్స్‌, పంజాగుట్ట, బేగంపేట, కోఠి తదితర ప్రాంతాల్లో కూడా పెట్‌ షాపులు వెలిశాయి.

దిష్టికోసం కాకులకు డిమాండ్‌..!!
కాకులను దిష్టి తీయడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క కాకి ధర రూ. 200. మంగళ,
శనివారాల్లో కాకులు అధికంగా విక్రయమవుతాయని షాపు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ వారానికి సుమారు 300 కాకుల వరకు విక్రయిస్తామని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు.


logo