శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 08, 2020 , 14:29:11

గిఫ్ట్‌ ఆశ చూపుతారు లక్షలు లాగుతారు

గిఫ్ట్‌ ఆశ చూపుతారు లక్షలు లాగుతారు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ చూసి సైబర్‌నేరగాళ్లు వేస్తున్న వలలో అత్యాశతో కొందరు చిక్కుకుపోతున్నారు. ఇలా చిక్కుకుపోతున్న వారిలో ప్రొఫిషనల్స్‌.. ఉన్నత చదువులు చదువుకున్న వారే ఉంటున్నారు. గిఫ్ట్‌ పేరిట ఆశ చూపి లక్షలు సైబర్‌చీటర్లు లాగేస్తున్నారు..

అవసరం ఉందంటే వంద రూపాయలు కూడా ఇవ్వడానికి చేతులు రాని వారు.. తమకు కోట్ల విలువైన ఆస్తి ఉచితంగా కలిసి వస్తుందంటూ నమ్మిస్తే.. అక్కడ మాత్రం లక్షలు ఖర్చు చేసేస్తున్నారు.. గుర్తుతెలియని వ్యక్తులు పంపిస్తారనే చిన్న లాజిక్‌ను మరిచిపోతున్న ఉన్నతచదువులు చదివిన వారు గుడ్డిగా మోసపోతున్నారు.

సైబర్‌నేరగాళ్లు ఇలా కొన్ని సందర్భాల్లో .. మన పాత స్నేహితులమంటూ.. మరికొన్నిసార్లు పెండ్లి చేసుకుంటామని.. ఇంకొన్నిసార్లు వ్యాపారం చేద్దామంటూ నమ్మించి మోసం చేసేస్తున్నారు. పెండ్లి చేసుకుందామని మోసం చేసే వారి వివరాలను మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో సేకరిస్తూ.. ఆయా ప్రొఫైల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ నేరగాళ్లు.. స్నేహితులు, వ్యాపారం, క్లాస్‌మెట్‌ అంటూ మోసాలు చేసే అంశాలలో ఫేస్‌బుక్‌లోని ప్రొఫైల్‌లోని వివరాలనే ఆధారంగా చేసుకొని చీటింగ్‌ చేస్తున్నారు.

ప్రొఫైల్స్‌తో కొత్త ఖాతా !

గిఫ్ట్‌ల పేరుతో మోసాలు చేసేది ఎక్కువగా నైజీరియన్లకు చెందిన సైబర్‌మోసగాళ్లే. వీరు ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తుంటారు, కొందరు స్టడీస్‌ ఇన్‌ ఇంగ్లాండ్‌.. 2005 నుంచి 2010 వరకు అంటూ, మరికొందరు యూఎస్‌ఏలో ఎంస్‌ చేశామంటూ తమ ప్రొఫైల్స్‌లో తమ వివరాలు పొందుపరుస్తారు. దాంతో పాటు వాళ్లకు ఉన్న ఫ్రెండ్స్‌ ఎవరనే విషయం కూడా ఫేస్‌బుక్‌లో ఆయా ఖాతాల ద్వారా తెలిసిపోతుంది. దీంతో ఆ వివరాలను తీసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు.. తమ ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్‌ పేరుతో కొత్త ఖాతాను తెరిచి, అందులో ఉన్న స్నేహితులందరికీ ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారు.. కొందరు తెలిసిన వాళ్లు తమ పాత ఫ్రెండ్‌ కదా అంటూ అంగీకరిస్తుంటారు... అయితే అప్పటికే ఆ ఖాతా పేరుతో ఫ్రెండ్స్‌ యాడ్‌ అయి ఉండడంతో.. తమ పాత ఫ్రెండే కదా అనే భ్రమలో అందులో ఉన్నవారు ప్రొసీడ్‌ అవుతుంటారు. దీంతో ఇలా ఒక నెల రోజుల పాటు ఆయా ప్రొఫైల్స్‌, ఖాతాలపై దృష్టి పెట్టి.. అందరికీ హాయ్‌.. ఎలా ఉన్నారు.. ఏమిచేస్తున్నారంటూ మాటల్లో నింపేస్తుంటారు. అయితే అసలైన ఫ్రెండ్‌ ఎప్పుడో ఓ సారి కూడా ఫేస్‌బుక్‌లో హాయ్‌ చెప్పడు.. అతడు బిజీగా ఉండడంతో ఎప్పుడో ఓ సారి మాత్రమే హాయ్‌ చెబుతుంటారు. ఈ క్రమంలోనే తన పేరుతో మరో ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు ప్రారంభించారనే విషయం అతనికి తెలియదు.. తెలుసుకోవాల్సిన అవసరం కూడా అతనికి ఉండదు. ఇదే సైబర్‌నేరగాళ్లకు కలిసి వస్తుంది. అసలైన ఖాతాదారుడి ప్రొఫిషన్‌ గూర్చి తెలుసుకొని.. తాను అదే పనిచేస్తున్నానని అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో పనిచేస్తున్నామంటూ బిల్డప్‌ ఇస్తారు.

- లండన్‌లో చదివానంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్న సైబర్‌నేరగాడు రూ. 15 లక్షలు టోకరా.
- ఆస్ట్రేలియాలో పదేండ్ల క్రితం మనకు కలిసి పనిచేశామంటూ నమ్మించిన ఓ వ్యక్తి ఒక మహిళకు రూ. 6 లక్షలు మోసం .
- పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ. 18 లక్షలు మోసానికి పాల్పడ్డారు.
- తాను డాక్టర్‌ను.. మీరు అమెరికాలో చదువుకున్నారు కదా అంటూ నమ్మించి మరో మహిళకు రూ. 22 లక్షలు గుర్తుతెలియని వ్యక్తులు బురిడీ కొట్టించిన ఘటనలున్నాయి.

నైజీరియన్‌ సైబర్‌చీటర్‌ అరెస్టు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నేను ఇంగ్లాండ్‌లో ఒక ఆస్తి కేసు గెలిచాను.. నాకు భారీగా కలిసి వచ్చింది.. నీకు గిఫ్ట్‌ పంపిస్తానంటూ మోసాలకు పాల్పడిన ఓ నైజీరియన్‌ సైబర్‌ చీటర్‌ను సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ‘బార్‌ బ్లెసింగ్‌ రోజ్‌' ప్రొఫైల్‌ ఐడీతో ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి పరిచయమైంది. తాను ఇంగ్లాండ్‌లో ఉంటున్నానంటూ కొన్ని రోజులు ఫేస్‌బుక్‌లో చాట్‌ చేసి, ఆ తరువాత ఇంగ్లాండ్‌ నంబర్‌తో వాట్సాఫ్‌ చాటింగ్‌ చేసింది. ఇద్దరి మధ్య చాటింగ్‌ స్నేహాం ఏర్పడిన తరువాత తాను లండన్‌లో ఒక ఆస్తికి సంబంధించిన కేసులో విజయం సాధించాను, తనకు భారీగా కలిసి వచ్చింది, నీకు.. మన స్నేహానికి గుర్తుగా విలువైన గిప్ట్స్‌ పంపిస్తానంటూ నమ్మించింది. ఆ తరువాత గిఫ్ట్‌ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ క్లియెరెన్స్‌ కాకపోవడంతో ఆగిపోయిందని చెప్పి, వివిధ రకాల క్లియరెన్స్‌ల పేరిట అతని వద్ద నుంచి రూ. 1,20,500 నగదును వివిధ ఖాతాల్లో డిపాజిట్‌ చేయించి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్‌ పోలీసులు ఈ కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకున్నారు.

ఆడ..మగ పేర్లతో ...

కేసు దర్యాప్తులో భాగంగా ఇదంతా ఢిల్లీ నుంచి జరిగినట్లు గుర్తించిన ఇన్‌స్పెపెక్టర్‌ గంగాధర్‌ బృందం నిందితుడు జేమ్స్‌ లక్కీ ఓబసీ అని గుర్తించి ఢిల్లీలో పట్టుకున్నారు. నైజీరియన్‌కు చెందిన జేమ్స్‌ లక్కీ ఒబసీ ఢిల్లీలో నివాసముంటున్నాడు. ఆడ, మగ రెండు పేర్లతో ఫేస్‌బుక్‌ ఫ్రొపైల్స్‌ తయారు చేశాడు. తన ప్రొఫైల్‌ అందరినీ ఆకర్శించేవిధంగా ఉంటుంది. దీంతో తాను లండన్‌లో నివాసముంటున్నానంటూ చెప్పుకుంటూ ఫేస్‌బుక్‌లో పలువురికీ మేసేజ్‌లు పెట్టడం, ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పెట్టడం చేస్తుంటారు. ఇతడి ప్రొఫైల్‌ను చూసి చాలామంది హై ప్రొఫైల్‌ ఉన్న వారు కూడా ఇతడి బుట్టలో పడిపోతారు. ఇలా ఇంగ్లాండ్‌ నంబర్‌తో వాట్సాఫ్‌లో చాటింగ్‌ చేస్తూ తాను ఇంగ్లాండ్‌ వాసిననే బిల్డప్‌ ఇస్తాడు. ఫోన్‌లో మాట్లాడకుండా ఆడ, మగ వారితో చాటింగ్‌ మాత్రమే చేస్తుంటాడు. తాను ఆస్తిని గెలిచానని, నీకు గిప్ట్‌ పంపిస్తానంటూ నమ్మించి, ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారినంటూ ఇండియన్‌ ఫోన్‌ నంబర్‌తో బాధితులకు ఫోన్‌ చేస్తాడు. కొన్ని సందర్భాలలో తన మహిళా స్నేహితుల సహకారం తీసుకొని కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్లు కూడా చేయిస్తుంటాడు. ఇలా బాధితుల నుంచి కస్టమ్స్‌ క్లియరెన్స్‌ పేరిట అందినకాడికి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయించుకుంటూ దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నాడు. నిందితుడిని ఢిల్లీలో అరెస్టు చేసి, అతని వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు పీటీ వారెంట్‌తో హైదారబాద్‌కు తరలించి, మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలో ఇన్‌స్పెపెక్టర్‌ గంగాధర్‌ బృందం ఎస్సైలు పి.సురేశ్‌, శాంతరావు దర్యాప్తు చేస్తున్నారు.

బహుమతులంటే ఎలా నమ్ముతారు..

ఊరికే.. ఎవరికి డబ్బులు రావు. మనకు కష్టముందని ఎంత స్నేహితుడైనా ఉరికనే ఇవ్వరు. మన కండ్ల ముందు ఉన్న వారు.. మన కష్టాలను.. సమస్యలను చూసిన వారు కూడా ఇవ్వడం కష్టమే.. అలాంటిది ఎక్కడో ఉండి.. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. ముఖం కూడా చూడకుండా.. లక్షలు, కోట్ల బహుమతులు పంపిస్తారంటే ఎలా నమ్ముతారు.. చాలామంది అత్యాశకు పోయి, మోసాలకు గురవుతున్నారు. కోట్ల రూపాయలు డబ్బు గిఫ్ట్‌గా ఇస్తా అన్నవాళ్లు.. వేల రూపాయలు ట్యాక్స్‌లు కట్టలేరా? ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరముంటుంది.. గిప్ట్‌ల పేరుతో ఎవరైనా నమ్మిస్తే.. అది మోసమని గుర్తించండి. ఆశకు పోయి, అప్పుల్లో కూరుకపోవద్దు. ఎవరైనా గిఫ్ట్‌ పంపిస్తారంటే... కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన వారితో చర్చించాలి.. సమాజంలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయనే విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాల్సిన అవసరమున్నది.
-కేవీఎం ప్రసాద్‌,హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ

క్లియరెన్స్‌ పేరిట.. చెమటలు పట్టిస్తారు !

ప్రతి రోజు హాయ్‌.. బాయ్‌ చెబుతుండడంతో మన స్నేహితుడేగా మంచి ప్రొఫిషనల్‌లో సెటిల్‌ అయ్యాడు.. అలాంటి వాడు.. నాకు కొంత సమయాన్నిస్తున్నడనే అపోహలో బాధితులుంటారు. ఇలా వారితో మాట్లాడే సమయంలోనే కొంత సమాచాన్ని సేకరిస్తూ ఎవరిని టార్గెట్‌ చేయాలో నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్న తరువాత టార్గెట్‌ చేసిన వారితో క్లోజ్‌గా మాట్లాడుతూ ఆర్థిక పరమైన అంశాల గురించి మాట్లాడుతూ అప్యాయతలను వలకబోస్తుంటారు. దీంతో నా పాత స్నేహితుడు నన్ను బాగా గుర్తుపెట్టుకున్నాడు.. నాకు సాయం చేసే అవకాశముందనే అపోహలోకి బాధితుడు వచ్చేస్తాడు.. అప్పుడే ఇక సైబర్‌నేరగాడు తన టార్గెట్‌ను గురిపెడుతాడు.. నీకు విలువైన గిఫ్ట్‌ పంపిస్తానంటూ ఆశ పెట్టడంతో.. అత్యాశకు పోయి సరేనంటూ బాధితులు ఒప్పుకుంటారు. కొందరు మీ ఎయిర్‌పోర్టులో క్లియరెన్స్‌ చేసుకోవాలంటూ ముందే చెబుతుంటారు.. మరికొందరు కస్టమ్స్‌ క్లియరెన్స్‌కు అక్కడ డబ్బు లు చెల్లించాలి అది తక్కువగానే ఉంటాయంటూ సూచిస్తారు. లక్షలు, కోట్ల రూపాయలను మనకు ఫ్రీగా వస్తుంటే.. క్లియరెన్స్‌లకు కొంత మేర వెచ్చించడం పెద్ద కష్టమేమీ కాదనే ఆలోచనలో బాధితులుంటారు. గిఫ్ట్‌ ఎంత విలువైందనే విషయంలో కొందరు ముందుగానే చెబుతుంటే.. మరికొందరు నీవు ఉహించని విధంగా దాని విలువ ఉంటుందంటూ కోట్ల రూపాయల ఆలోచనలు రెకెత్తిస్తారు. గిఫ్ట్‌ ఆశ చూపిన రెండు మూడు రోజుల్లోనే... ఎయిర్‌పోర్టు నుంచి బాధితులకు కాల్స్‌ వచ్చేస్తుంటాయి. కస్టమ్స్‌, జీఎస్‌టీ, ఇన్‌కం ట్యాక్స్‌, ఆర్‌బీఐ క్లియరెన్స్‌, యాంటీ టెర్రరిస్ట్‌ సర్టిఫికెట్‌, గిఫ్ట్‌ ట్యాక్స్‌, ఫారన్‌ కరెన్సీ ఎక్చేంజ్‌ ట్యాక్స్‌ ఇలా ఇష్టం వచ్చిన ట్యాక్స్‌ల పేరుతో బాధితుల నుంచి లక్షలు లాగేస్తుంటారు. అయితే వచ్చేవి కోట్లలో ఉన్నాయనే ఆశతో.. బాధితులు అప్పులు తెచ్చి మరి సైబర్‌నేరగాళ్లకు చెల్లిస్తుంటారు. కొందరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పరు.. చెబితే వాటా అడుగుతారనే ఉద్దేశ్యంలో కొందరు.. మరికొందరు అవన్ని బూటకమంటారు.. నాకు నమ్మకం ఉంది.. అందుకే ఎవరికి చెప్పొద్దనుకుంటున్నా అనే బావనలో ఉంటారు. ఇలా నిండుగా మునిగిపోయిన తరువాత కానీ చాలామంది తేరుకోవడం లేదు.

పశువుల ఆయిల్‌ కొని అమ్మితే లాభాలే.. నగరవాసికి రూ. 6.82 లక్షలు టోకరా


- మరో నైజీరియన్‌ సైబర్‌ చీటర్‌తో పాటు గుర్‌గావ్‌ వాసి అరెస్టు
ఫేస్‌బుక్‌లో హై ప్రొఫైల్‌ను ప్రదర్శిస్తూ... హెర్బల్‌ ఆయిల్‌ విక్రయాల వ్యాపారం పేరుతో అమాయకులకు గాలం వేస్తూ లక్షల రూపాయలు మోసం చేస్తున్న మరో నైజీరియన్‌ సైబర్‌చీటర్‌తో పాటు అతడికి సహకరిస్తున్న ఢిల్లీ వాసిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ విటోలైన్‌ ఆయిల్‌ పశువుల మెడిసిన్‌లో ఉపయోగిస్తారు, దీని లీటర్‌ ధర ఇంగ్లాండ్‌లో 850 డాలర్లు (రూ. 60 వేలు), అదే ఇండియాలో రూ. 19500 అంటూ నమ్మించింది. ఇండియాలో కొని, మాకు విక్రయిస్తే మీకు భారీ లాభాలొస్తాయంటూ నమ్మించింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ పేరుతో చాటింగ్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి మాటలను నమ్మిన బాధితుడు రూ. 6.82 లక్షలు వెచ్చించి, ఆ నూనెను కొని మోసపోయాడు.. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నైజీరియన్‌కు చెందిన ఎజుమిజు లక్కీ ఓజ్హా ప్రధాన నిందితుడిగా, అతడికి గుర్‌గావ్‌కు చెందిన దీపక్‌ సహకరిస్తున్నట్లు గుర్తించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఈ ఇద్దరిని ఢిల్లీలో అరెస్టు చేసి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.

ఒక్క సెట్‌తో ధనవంతులవుతారు..

నిందితుడు ఎజుమిజ్‌ లక్కీ ఓజ్హా ఫేస్‌బుక్‌లో తాను హై ప్రొఫైల్‌ బిజినెస్‌ మ్యాన్‌గా ప్రొఫైల్‌ను పెట్టుకుంటాడు. తన ప్రొఫైల్‌తో ఫేస్‌బుక్‌లో పలువురికీ ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపిస్తాడు. ఆమెరికా, లండన్‌, ఘనా, ఆఫ్రికా దేశాల్లో పశువులకు సం బంధంచిన మందుల తయారీలో విటోలైన్‌ ఆయిల్‌ వాడుతారు, దీనికి ఇక్కడ భారీ గిరాకీ ఉందంటూ నమ్మిస్తాడు. చాటింగ్‌ చేసే వ్యక్తులను బట్టి ఆయిల్‌ పేరు మార్చేస్తాడు. ఇలా తనకు తెలిసిన వారి వద్దనే భారీ ధరకు అయిల్‌ డబ్బాలు కొనాలంటూ సూచిస్తాడు. దీంతో బాధితులు భారీగా డబ్బు వెచ్చించి వాటిని కొంటూ, టెస్టింగ్‌ కోసం తిరిగి నిందితులకే అప్పగిస్తారు, కంపెనీ మరిన్ని లీటర్లు ఉంటేనే కొంటుందంటూ ఎక్కువ మొత్తంలో ఆయిల్‌ పేరుతో ఉండే డబ్బాలను కొనిస్తారు. ఇలా తీరా బాధితులు వేల నుంచి లక్షల రూపాయలు పొగొట్టుకుంటారు..

ఇవిధంగా మోసాలకు పాల్పడే నైజీరియన్‌ ప్రధాన నిందితుడికి బ్యాంకు ఖాతాలను గుర్‌గావ్‌కు చెందిన దీపక్‌ అందిస్తుండడంతో అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.


logo