న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జైడస్ కాడిలాకు చెందిన యాంటీ వైరల్ డ్రగ్ వైరాఫిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇండియాకు చెందిన జైడస్ కంపెనీ తయారు చేసే పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా-2బీనే వైరాఫిన్ పేరుతో పిలుస్తున్నారు. అయితే ఈ డ్రగ్ వల్ల కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం రాదని పరిశోధనల్లో తేలడం పెద్ద ఊరట కలిగించే విషయం. ఈ నేపథ్యంలో అసలు ఈ డ్రగ్ ఎలా పని చేస్తుంది? అందరు కొవిడ్ పేషెంట్లకు దీనిని ఇస్తారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఒకసారి చూద్దాం.
వైరల్ లోడ్ తగ్గిస్తుంది
కొవిడ్ పేషెంట్లలో వైరల్ లోడ్ మోస్తరు నుంచి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఈ వైరాఫిన్ డ్రగ్ బాగా ఉపయోగపడుతుంది. మోస్తరు ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్లపై ఈ డ్రగ్ మెరుగ్గా పని చేసినట్లు జైడస్ కాడిలా చెబుతోంది. ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు పేషెంట్లలో వైరల్ లోడ్ తగ్గి ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది. మోస్తరు ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్లకు వైరాఫిన్ తొలి డోసు ఇచ్చిన వారం రోజుల తర్వాత వైరల్ లోడ్ సున్నాకు చేరినట్లు తమ మూడో దశ ట్రయల్స్‌తో తేలిందని సంస్థ వెల్లడించింది. అంటే వైరల్ లోడ్‌ను ఈ డ్రగ్ చాలా వేగంగా తగ్గిస్తున్నట్లు స్పష్టమైంది. దీని ఆధారంగానే డీసీజీఐ ఈ డ్రగ్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. నిజానికి 2004లో వచ్చిన సార్స్ సమయంలోనూ ఈ మందు బాగా పనిచేసింది. ప్రస్తుతం హెపటైటిస్ సి చికిత్సలోనూ వాడుతున్నారు.
అందరికీ అందుబాటులో ఉంటుందా?
వైరాఫిన్ను అత్యవసరంగా, పరిమిత స్థాయిలో వినియోగానికి అనుమతి ఇచ్చారు. అంటే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే ఈ మందు ఇస్తారు. ఓవర్ ద కౌంటర్లో అందరికీ ఇది అందుబాటులో ఉండదు. ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఈ డ్రగ్ ఇవ్వరు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
యాంటీ వైరల్‌గా వాడే డ్రగ్ ఏదైనా సైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వైరాఫిన్తోనూ ఉంటాయి. కొందరిలో ఇన్ఫ్లెయెంజా వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని కేసుల్లో న్యూరో సైకియాట్రిక్ సంబంధిత సమస్యలు కూడా వచ్చినట్లు గుర్తించారు. అందుకే ఈ డ్రగ్‌ను డాక్టర్ సలహా మేరకే వాడాలి. ఇప్పటికే కొవిడ్ కోసం మాత్రమే రెమ్‌డెసివిర్, ఫాబిఫ్లూ వంటి మందులను వాడుతున్నారు. ఇప్పుడు వైరాఫిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.