మీకున్న ఈ అలవాట్లు కంటి చూపును దెబ్బ తీస్తాయి తెలుసా..?


Mon,September 3, 2018 01:02 PM

మన జ్ఞానేంద్రియాలలో కళ్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం మన నేత్రాలతో చూస్తాం. కానీ అవే నేత్రాలు లేకపోతే, సరిగ్గా చూపు లేకపోతే.. అప్పుడు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసు. పుట్టుకతోనో లేదా మరే ఇతర కారణం వల్లో అయితే కంటి చూపు పోతే అది వేరే విషయం. కానీ నిత్యం మనం పాటించే పలు అలవాట్ల వల్ల కూడా మన కంటి చూపు పోతుందని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. ఈ అలవాట్ల వల్లే మన కంటి చూపు దెబ్బ తింటుంది. అవేమిటంటే...

1. ధూమపానం


పొగతాగడం వల్ల దాని ప్రభావం కంటి ఆరోగ్యంపై పడుతుంది. ధూమపానం చేయడం వల్ల కంటి రెటీనాకు వెళ్లే రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతాయి. ఫలితంగా కళ్లలో మచ్చలు వస్తాయి. వీటి వల్ల కళ్లలో ఉండే కణాలు మరింత క్షీణించి కంటి చూపు మందగిస్తుంది. కనుక ధూమపానం మానేయడం వల్ల కంటి చూపు కోల్పోకుండా జాగ్రత్తపడవచ్చు.

2. ఎలక్ట్రానిక్ పరికరాలు


ప్రస్తుత తరుణంలో స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది రాత్రిపూట కూడా వీటిని విపరీతంగా వాడుతుంటారు. కానీ అలా చేస్తే కంటి చూపు దెబ్బ తింటుంది. కేవలం ఫోన్లే కాదు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా రాత్రి పూట వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. దీంతో కళ్లకు సంరక్షణ లభిస్తుంది.

3. కూరగాయలను తినకపోవడం


చాలా మంది నిత్యం కూరగాయలను సరిగ్గా తినరు. వాటితో చేసిన ఆహార పదార్థాలను తినకపోవడం వల్ల కంటికి సంబంధించి పోషణ సరిగ్గా అందదు. దీని వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంది. ఉదాహరణకు.. ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటిని తినకపోతే విటమిన్ ఎ సరిగ్గా అందదు. ఫలితంగా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. కంటి చూపు నెమ్మదిగా తగ్గుతుంది. కనుక నిత్యం ఎవరైనా అన్ని పోషకాలు ఉండే సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిందే. దీంతో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.

4. కళ్లను రుద్దడం


కొందరు కళ్లలో ఏవైనా పడినప్పుడు, లేదంటే కళ్లు మంటలు, దురద పెట్టినప్పుడు బాగా రుద్దుతారు. అలా చేయరాదు. చేస్తే కార్నియాపై ప్రభావం పడుతుంది. దానిపై గీతలు పడి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదు.

5. నిద్ర


నిత్యం మనం ఎవరమైనా తగినన్ని గంటల పాటు నిద్ర పోవాల్సిందే. లేదంటే దాని ప్రభావం కళ్లపై కూడా పడుతుంది. అలాంటప్పుడు కళ్లకు సరిగ్గా రక్తం సరఫరా అవదు. దీంతో కంటి నరాలు సంకోచించుకుంటాయి. ఫలితంగా కంటి చూపు తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది.

6. పరీక్షలు


నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారు అయినా సరే, ఆరోగ్యవంతులు అయినా సరే.. ఎవరైనా ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కొన్ని రకాల సమస్యలను గుర్తించలేం. ఫలితంగా కంటి చూపుపై అది ప్రభావాన్ని చూపుతుంది. కనుక ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన సమయానికి కంటి పరీక్షలు చేయించుకుని కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది.

4959
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles