శనివారం 04 జూలై 2020
Health - May 31, 2020 , 17:19:14

సిగరెట్‌ తాగే అలవాటు మానుకోండి ఇలా!

 సిగరెట్‌ తాగే అలవాటు మానుకోండి ఇలా!

ప్యాషన్‌గా అలవర్చుకొన్న సిగ‌రెట్ స్మోకింగ్ నేటి యువతకు ప్రతిబంధకంగా తయారైంది. పల్లె, పట్టణం తేడా లేకుండా వయోభేదం అనే మాటే కరవై.. అన్నివర్గాలవారిని పొగాకు ఉత్పత్తులు ఆవహిస్తున్నాయి. జేబుతోపాటు గుండెకూ చిల్లు పడుతుందని తెలుసుకునేలోగా.. ప్రాణాలు సిగరెట్ పొగలా గాలిలో కలిసిపోవడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. రాముడు భీముడు సినిమాలోని.. స‌ర‌దా స‌ర‌దా సిగ‌రెట్టు.. ఇది దొర‌ల్ తాగు బ‌ల్‌ సిగ‌రెట్టు .. అనే పాట పాడుకోవ‌డానికి చాలా బాగుంటుంది. అలాగే పొగ తాగ‌నివాడు దున్న‌పోతై పుట్టున్ అని క‌న్యాశుల్కంలో గిరీశం చెప్పినా అది నాటిక వ‌ర‌కైతే డైలాగ్‌ బాగుంటుంది. మా ఆరోగ్యం.. మా ఇష్ట‌ం.. అంటూ గుప్పుగుప్పుమ‌ని పొగ వ‌దిలితే.. అదే పొగ‌లో మ‌సైపోవ‌డం ఖాయ‌మ‌ని వైద్య‌నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ధూమ‌పానం చేసేవారిలో ప్ర‌తి ఐదేండ్ల‌కు ఓ ఏడాది ఆయుఃప్ర‌మాణం త‌క్కువైపోతున్న‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చ‌రించింది. 

సిగ‌రెట్ తాగ‌డం వ‌ల్ల తారు, నికోటిన్, కార్బ‌న్ మోనాక్సైడ్, హైడ్రోజన్‌ సైనైడ్‌, అమ్మోనియా, ఫార్మల్డిహైడ్‌, ఆర్సెనిక్‌, డీడీటీ వంటి ర‌సాయ‌నాలు శ‌రీరంలోనికి వెళ్లి దాదాపు 40, 50 ర‌కాల క్యాన్స‌ర్లు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. మ‌న దేశంలో ఏటా సిగ‌రెట్ స్మోకింగ్ వ‌ల్ల 90 వేల మంది మ‌ర‌ణిస్తున్నార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెప్తున్నాయి. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి.  ధూమపానం చేసేవారికన్నా ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావ‌డంలేదు. సిగరెట్‌ను వీడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా స్మోకింగ్‌ను దూరం  చేసుకోవచ్చు. రేపు, మాపు అంటూ టైమ్‌పాస్ చేయ‌కుండా ఇప్ప‌టినుంచే స్మోకింగ్ మానేస్తున్నాన‌ని మాన‌సికంగా సిద్ధ‌మై వ్య‌స‌నం నుంచి బ‌య‌ట‌ప‌డాలి. ఒకేసారి ప్యాక్‌ సిగరెట్లు కొనకుండా చూసుకోవాలి. కాఫీలు, టీలు, కార్బొనేటెడ్‌ డ్రింకులు తాగడం పూర్తిగా మానేయాలి. సిగరెట్‌ స్మోకింగ్‌ నుంచి దృష్టిని మరల్చేందుకు చూయింగ్‌ గమ్‌ నమలాలి. కుటుంబసభ్యులు, బంధువులతో ఫోన్లో మాట్లాడటం అలవాటుచేసుకోవాలి. ఆన్‌లైన్‌ గేమింగ్‌, పజిల్స్‌, సుడోకు వంటి వాటిపై దృష్టిసారించాలి. ఇంటి పరిశుభ్రతను ఛాలేంజిగా తీసుకొని నిత్యం కనీసం గంట సేపైనా ఇంట్లో పరిశుభ్రతకు టైం కేటాయించడం వల్ల మన దృష్టి స్మోకింగ్‌ వైపు పోకుండా ఉంటుంది. ఆరోగ్య స‌మ‌స్య‌లు మొద‌లై దవాఖానల చుట్టూ తిరుగాల్సిన అవసరం రాకముందే సిగ‌రెట్ మానుకొని మీతోపాటు ఇంటిల్లిపాది సంతోషంగా ఉండండి.


logo