Diet after abortion | అబార్షన్.. మహిళల జీవితంలో చేదు ఘటన. తల్లి అవుతున్న వార్త స్త్రీకి ఎంతటి మధురానుభూతులను ఇస్తుందో.. దురదృష్టవశాత్తు అబార్షన్ కావడం వల్ల ఆ బాధ వర్ణతీతంగా ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరిలో ఆదిలోనే పిండాన్ని తుంచేయాల్సి వస్తుంది. కొన్ని అబార్షన్లు మహిళల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంటాయి. రక్తస్రావం అధికమై శరీరంలో విటమిన్ బీ 12, బీ9 తో పాటు ఐరన్ వంటివి తగ్గిపోతాయి. ఫలితంగా ఎంతో బలహీనపడిపోతారు. అలాగే, రక్తహీనత, ఎముకల అరుగుదల వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యల నుంచి బయటపడేందుకు తగిన పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
కాల్షియం
గర్భస్రావం తర్వాత శరీరంలో కాల్షియం మొత్తంలో వేగంగా క్షీణత ఉంటుంది. అందుకని క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం చాలా ముఖ్యం. ఇందుకోసం టోఫు, డ్రై ఫ్రూట్స్, సీ ఫుడ్, పాలు, పాల ఉత్పత్తులు, ఆకు కూరలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఇవి ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంతో తోడ్పడతాయి.
ఐరన్, విటమిన్ సీ
ఐరన్, విటమిన్ సీ శరీరానికి చాలా ముఖ్యమైనవి. అబార్షన్ తర్వాత మహిళల శరీరంలో ఐరన్, విటమిన్ సీ లోపం కనిపిస్తుంది. ఐరన్ ఎర్ర రక్త కణాలను తయారు చేయడం ద్వారా శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ఇదే సమయంలో సీ విటమిన్.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీంతో పాటు సీ విటమిన్ శస్త్రచికిత్స గాయాన్ని నయం చేయడంలో ఉపయుక్తంగా ఉంటుంది. ఐరన్, సీ విటమిన్ పొందేందుకు పాలకూర, ఖర్జూరం, గుమ్మడికాయ, బీట్రూట్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఫోలిక్ యాసిడ్
ఫోలిక్ యాసిడ్ మానసిక ఒత్తిడికి, ఎర్ర కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనత వంటి వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది. అబార్షన్ అయిన తర్వాత ఫోలిక్ యాసిడ్ అధికంగా ఆహారాలను తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. అవకాడో, బాదం, వాల్ నట్స్ వంటి వాటిని డైట్లో చేర్చుకోవాలి.
తృణధాన్యాలు
తృణధాన్యాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. తృణధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండి అజీర్ణం, గ్యాస్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం ఫైబర్ రిచ్ తృణధాన్యాలు బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్, వోట్మీల్ వంటివి ఆహారంలోకి చేర్చుకోవాలి.
కొవ్వు పాలు, మాంసాలు
అబార్షన్ తర్వాత పాల ఉత్పత్తులు, మాంసం వంటి కొవ్వు పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే, ఆహారంలో వెన్న, చీజ్, పచ్చి పాలు, బీఫ్ మొదలైనవాటిని చేర్చుకోవచ్చు.
అలాగే, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు, జీర్ణసమస్యలను దూరం చేసుకునేందుకు ఎక్కువ మొత్తంలో నీరు తాగుతుండాలి. మనుసుకు నచ్చిన ఆహారాలను తింటూ ఉండాలి. మానసిక స్థితిని మెరుగుపర్చుకునేందుకు, ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాక్లెట్లు, డార్క్ చాక్లెట్లు తినాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న పసుపు ఎక్కువగా వాడేలా చూసుకోవాలి. యూట్రస్కు బలం చేకూర్చేందుకు అవిసె గింజలను తింటుండాలి.
అబార్షన్ తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ ఫుడ్స్‌ను దూరం పెట్టాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకుండా చూసుకోవాలి. అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన షుగర్ ఫుడ్స్, క్యాండీలు, కార్బోనేటేడ్ పానీయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం అలవర్చుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.