గురువారం 01 అక్టోబర్ 2020
Health - Jul 23, 2020 , 15:46:29

వర్షాకాలంలో ఇవి తింటేనే ఆరోగ్యం

వర్షాకాలంలో ఇవి తింటేనే ఆరోగ్యం

హైదరాబాద్‌: వర్షాకాలం.. వ్యాధులు ప్రబలే కాలం. అందుకే తీసుకోవాల్సిన ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. అసలే కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ సీజన్‌లో మన నోట్లోకి వెళ్లే ఆహారం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, లేకుంటే ఆరోగ్యానికి పెను ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, విటమిన్ డి లోపం, చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది.  అందుకే సమతులాహారం తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే, రుతువుల ప్రకారం ఏయే ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలమో మన ప్రాచీన ఆయుర్వేదంలో ఉందట. దీన్నే ‘రుతుచర్య’ అని పిలుస్తారు. దీని ప్రకారం వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహారాలేంటో చదవండి మరీ..


1. ప్రధానంగా ప్రతిరోజూ సురక్షితమైన మంచినీటిని పుష్కలంగా తాగాలి. అయితే, వర్షాకాలంలో వచ్చే వ్యాధులన్నీ నీటిద్వారా వచ్చేవే. కనుక ప్యూరిఫైడ్‌ వాటర్‌నే తాగాలి. ఇంట్లో ప్యూరిఫైర్‌ లేకుంటే కాచి వడపోచిన నీటిని మాత్రమే తాగాలి. ఈ సీజన్‌లో శరీరంపై తేమ, చెమట ఎక్కువగా వస్తుంది.  మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి తాజాగా తయారుచేసిన సూప్‌లు, పులుసులు, అల్లం చాయ్‌, హెర్బల్ టీలకు ప్రాధాన్యమివ్వాలి. 

2. ఈ కాలంలో లభించే పండ్ల(సీజనల్‌ ఫ్రూట్స్‌)ను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను పొందేందుకు పండ్లే ప్రధాన మూలం. కనుక మార్కెట్లో లభించే రకరకాల పండ్లను తప్పనిసరిగా తినాలి.  

3.కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ కూరలు ఎక్కువగా తినాలి.  వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక క్రమం తప్పకుండా తినాలి.

4.మన వంటిల్లే ఓ ఔషధశాల అని మీకు తెలిసిన విషయమే. పోపుల పెట్టలో ఉన్న సుగంధ ద్రవ్యాలను ఈ సీజన్‌లో కచ్చితంగా వంటల్లో ఉపయోగించాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, బగారా ఆకు, పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు ఆరోగ్య సంరక్షణలో ఎంతో ఉపయోగపడతాయి. ఇవి క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే, ఇవి వర్షాకాలంలో వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

5. గింజలు, విత్తనాలు మంచి పోషకాహారం. వీటిని ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఈ కాలంలోనే కాదు ప్రతి సీజన్‌లోనూ తీసుకోవాల్సిందే. 


వీటికి దూరంగా ఉండండి..

1. వర్షాకాలంలో సమతులాహారం తీసుకోవడంతోపాటు మరికొన్నింటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్యాన్సీ రెస్టారెంట్లతోపాటు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది ఆహారం, నీటి ద్వారా కలిగే వ్యాధుల సీజన్. కేవలం వండిన, తాజా, ఆరోగ్యకరమైన భోజనం మాత్రమే తినాలి.  

2. ఈ కాలంలో ఉష్ణోగ్రత, తేమ బ్యాక్టీరియా, శిలీంధ్రం పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వీటిని గోరువెచ్చని నీటిలో కడగాలి. వినియోగించే ముందు బాగా ఉడికించాలి.

3. ఈ సీజన్‌లో జీర్ణక్రియ కాస్త నెమ్మదిస్తుంది. అందుకే ఫ్రై చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి.  ఏదైనా ఫ్రై చేసేందుకు వాడిన నూనెను తిరిగి ఉపయోగించకూడదు. 

4.వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో చేపలు వివిధ రకాల హానికారక సూక్ష్మజీవులకు వాహకాలుగా మారే అవకాశముంది. కనుక చేపలను తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే బాగా శుభ్రం చేసి, పులుసు చేసుకొని తినడం మేలు. ఫ్రై తినకపోవడం మీ ఆరోగ్యానికే మంచిది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo