శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 22, 2020 , 19:25:31

కొవిడ్‌ వేళ దవాఖానకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి!

కొవిడ్‌ వేళ దవాఖానకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి!

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి జీవితం ప్రభావితమైంది. పాఠశాల, కళాశాలలు మూసివేయడం నుంచి ఇంటి నుంచి పనిచేసే చాలా మంది వరకు.. ఎన్నో అంతరాలు ఎదురవుతున్నాయి.  లాక్‌డౌన్‌, నిర్ణీత దూర నిబంధనల అమలు కారణంగా పట్టణ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు పబ్లిక్ క్లినిక్‌లు లేదా కుటుంబ వైద్యులు, మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ దవాఖానలు, హెల్త్‌కేర్ సెంటర్లలోకి అడుగు పెట్టడానికి జంకుతున్నారు. అక్కడికి వెళ్లడానికి బదులుగా టెలికన్సల్టేషన్, వీడియో కన్సల్టేషన్, హెల్త్ యాప్స్ ద్వారా వైద్యులను సంప్రదిస్తున్నారు. రెగ్యులర్ చెకప్‌లు, ఫాలో-అప్లను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కారణాలు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో మెల్లమెల్లగా దవాఖానలు, క్లినిక్‌లు తిరిగి తెరుచుకుంటున్నాయి. కొవిడ్‌-19 మహమ్మారి ఇంకా మనల్ని విడిచిపెట్టి పోని కారణంగా నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ద్వారా మనకు కరోనా వైరస్‌ సంక్రమించకుండా చూసుకోవచ్చు. జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ ప్రాక్టీస్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం.. వైద్యుడి వద్దకు వెళ్లడానికి ఆలస్యం కాకుండా క్లినిక్‌లు, వారి సిబ్బంది, వైద్యులు, రోగులు తగిన భద్రతా వ్యూహాలను అవలంబించాలి. 

అపాయింట్‌మెంట్ ఇవ్వడం : 

క్లినిక్ లేదా ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ముందుగానే అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలి. అదే సమయంలో బీమా, ఇతర సంబంధిత సమాచారాన్ని తీసుకోవాలి. దీనివల్ల్ క్లినిక్‌కు వచ్చినా లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. వైద్యుడిని కలిసే సమయంలో తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా చూడాలి.

పరిచయాన్ని పరిమితం చేయడం :

క్లినిక్ సిబ్బంది, రోగులు కనీసం ఆరు అడుగుల నిర్ణీత దూరాన్ని పాటించాలి. అపాయింట్‌మెంట్‌కు ముందు తెలియజేయాల్సిన సమాచారం ఫోన్‌లో ఇవ్వాలి. రోగులతోపాటు ఎవరినీ వెంట తీసుకెళ్లకుండా ఒంటరిగా  వెళ్లడం శ్రేయస్కరం. క్లినిక్‌లో నిరీక్షణ సమయాన్ని అనవసరంగా పెంచకుండా ఉండేందుకు అపాయింట్‌మెంట్ టైమ్‌ కన్నా ముందే క్లినిక్‌కు చేరుకోవాలి.

పరిశుభ్రత తప్పనిసరి

క్లినిక్‌లోకి ప్రవేశించేటప్పుడు హ్యాండ్ శానిటైజర్‌లను తప్పనిసరిగా వాడాలి. చేతులు తాకడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను అన్నింటినీ ఎప్పటికప్పుడు ఆస్పత్రి సిబ్బంది శుభ్రపరచాలి. వెయిటింగ్ రూమ్‌లో రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాష్‌రూంలు శుభ్రంగా ఉండేలా చూడాలి.

ల్యాబ్‌ పరీక్షలకు జాగ్రత్తలు

రక్తం, మూత్రం లేదా ఇతర ల్యాబ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన రోగులు ముందస్తు అపాయింట్‌మెంట్‌ పొందాలి. రక్త, మూత్ర నమూనాలను సేకరించేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రోటోకాల్‌ పాటించాలి. కొవిడ్‌-19 స్క్రీనింగ్‌ల కోసం వచ్చే రోగులు ఇతర ఆరోగ్య సమస్యల కోసం వచ్చిన వారితో సన్నిహితంగా లేకుండా చూసుకోవాలి. ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా క్లినిక్‌లు, దవాఖానలకు వెళ్లే వారు కరోనా వైరస్‌ సంక్రమణకు గురికాకుండా.. ఇతర సమస్యలకు లోనుకాకుండా చూసుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.