కీటో డైట్ అంటే ఏమిటో.. దాని వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఏవో తెలుసా..!


Thu,February 15, 2018 10:14 AM

కీటోజెనిక్ డైట్.. లో కార్బ్ డైట్.. లో కార్బ్ హై ఫ్యాట్ డైట్.. ఇలా పేరేదైనా ఈ డైట్ మాత్రం ఒక్కటే. నేటి తరుణంలో ఎక్కడ చూసినా ఈ హై ఫ్యాట్ డైట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తున్నది. అయితే అసలింతకీ కీటో డైట్ అంటే ఏమిటి..? దాంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అది ఎలా ప‌నిచేస్తుంది ? త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరం శక్తిని రెండు రూపాల్లో తీసుకుంటుంది. ఒకటి.. మనం తినే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లను గ్లూకోజ్‌గా మార్చి ఆ శక్తిని తీసుకుంటుంది. ఇక రెండోది.. ఫ్యాట్. సాధారణంగా మన శరీరం గ్లూకోజ్‌నే శక్తి రూపంలో తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంది. ఎందుకంటే అది శరీరంలో ఇన్‌స్టంట్‌గా వస్తుంటుంది. మనం తినే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్ల నుంచి తేలిగ్గా అది తయారవుతుంది. కనుక తేలిగ్గా లభించే శక్తి రూపం వైపే శరీరం ఎదురు చూస్తుంది. కానీ కష్టంగా కరిగే ఫ్యాట్ శక్తి పట్ల ఆసక్తి చూపదు. దీంతో ఫ్యాట్ మన శరీరంలో అంత సులభంగా కరగదు. అయితే కీటోడైట్‌లో కేవలం ఫ్యాట్ మాత్రమే కరిగి మన శరీరానికి శక్తి అందుతుంది. గ్లూకోజ్‌ను శరీరం ఏమాత్రం తీసుకోదు. తీసుకోదు అంటే.. ఆ తరహా శక్తినిచ్చే ఆహారాలను మనం తినం. కేవలం ఫ్యాట్‌నిచ్చే ఆహారాలను మాత్రమే తింటాం. కనుక శరీరానికి గ్లూకోజ్ అందే మార్గం ఉండదు. దీంతో శరీరానికి ఫ్యాట్‌ను కరిగించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో మన బాడీ ఆటోమేటిక్‌గా ఫ్యాట్‌ను కరిగించడం వైపు మొగ్గు చూపుతుంది. దీన్నే ఫ్యాట్ మెటబాలిజం అంటారు. అలా అధిక బరువును మనం తగ్గించుకోవచ్చు.
keto-diet
ఒకసారి శరీరం ఫ్యాట్ మెటబాలిజం వైపు మళ్లితే ఇక బరువు వేగంగా తగ్గుతారు. అయితే ఈ ప్రాసెస్‌కు శరీరం రావాలంటే అందుకు 2 రోజుల వరకు సమయం పట్టవచ్చు. కొందరిలో కేవలం ఒక్క రోజులోనే ఫ్యాట్ మెటబాలిజం మొదలవుతుంది. ఇలా జరగాలంటే పూర్తిగా హై ఫ్యాట్ డైట్‌నే తీసుకోవడం ప్రారంభించాలి. దీంతో శరీరంలో ఉండే గ్లూకోజ్ పూర్తిగా ఖర్చవుతుంది. తరువాత లివర్‌లో స్టోర్ అయిన గ్లూకోజ్ నిల్వలు కూడా ఖర్చవుతాయి. ఈ ప్రాసెస్ కొందరిలో రెండు రోజులు జరుగుతుంది. కొందరిలో కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. అనంతరం శరీరానికి గ్లూకోజ్ అందదు. దీంతో అది కచ్చితంగా ఫ్యాట్ మెటబాలిజం వైపు మళ్లుతుంది. అయితే ఇలా శరీరం గ్లూకోజ్ నుంచి ఫ్యాట్ మెటబాలిజం వైపు మళ్లే క్రమంలో కొందరికి పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలు అవడం, వికారంగా ఉండడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. అయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే శరీరం మార్పునకు లోనయ్యే క్రమంలో ఇదంతా సహజంగా జరిగే ఓ ప్రక్రియ.

ఇక మన శరీరాన్ని ఫ్యాట్ మెటబాలిజం వైపు మళ్లించేందుకు ఉపయోగపడేదే కీటో డైట్. ఇందులో పూర్తిగా హై ఫ్యాట్ కలిగిన ఆహారాలు ఉంటాయి. కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కిడ్నీ, లివర్, నెయ్యి, కొబ్బరినూనె, పన్నీర్, చీజ్, వెన్న, పాల మీద మీగడ తదితరాలు హై ఫ్యాట్ డైట్ కిందకు వస్తాయి. కనుకనే కీటో డైట్ పాటించే వారు కేవలం వీటినే ఆహారంగా తీసుకుంటారు. ఈ క్రమంలో ఈ ఆహారాల వల్ల శరీరం 1, 2 రోజుల్లో ఫ్యాట్ మెటబాలిజం వైపు మళ్లుతుంది. అప్పుడు మన శరీరంలో ఉండే కొవ్వులను లివర్ కీటోన్లుగా మారుస్తుంది. అవి మనకు శక్తిని అందిస్తాయి. క‌నుక‌నే దీనికి కీటో డైట్ అని పేరు వ‌చ్చింది. కేవ‌లం కీటోన్ల‌నే శ‌రీరం శ‌క్తి కోసం తీసుకుంటుంది.

కీటో డైట్ లాభాలు ఇవే...


1. కీటో డైట్ వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. యాక్టివ్‌గా ఉంటారు.

2. మధుమేహం అదుపులోకి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ రివర్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

3. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అల్జీమర్స్ తగ్గుతుంది.

4. శరీర శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఏ పని చేసినా అంత త్వరగా అలసిపోరు. బాడీ బిల్డింగ్ చేసే వారు ఎన్ని గంటలైనా వ్యాయామం చేయవచ్చు. దీంతో శరీరం త్వరగా చక్కని షేప్‌లోకి వస్తుంది.

5. బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

6. చర్మం కాంతివంతంగా మారుతుంది. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

keto-diet

కీటోడైట్‌లో ఉన్నవారు తినాల్సినవి...


చేపలు, బీఫ్, మేక, గొర్రె మాంసం, చికెన్, ఎగ్స్, ఆకుపచ్చని కూరగాయలు, కాలిఫ్లవర్, చీజ్, క్రీం, వెన్న, నట్స్, అవకాడోలు, బ్లాక్ బెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, స్టీవియా, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, నెయ్యి, పన్నీర్ తదితర ఆహారాలను కీటో డైట్‌లో ఉన్నవారు తినాలి. కార్బొహైడ్రేట్లను అస్సలు తీసుకోరాదు. లేదంటే ఆశించిన ఫలితం రాదు.

కీటోడైట్‌లో ఉన్నవారు తినకూడనివి...


గోధుమలు, మొక్కజొన్న, రైస్, తృణ ధాన్యాలు, చక్కెర, తేనె, యాపిల్స్, అరటి పండ్లు, ఆరెంజ్‌లు, ఆలుగడ్డలు, చిక్కుడు, బటానీ గింజలు తినరాదు.

11387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles