ఆదివారం 07 మార్చి 2021
Health - Jan 17, 2021 , 15:55:56

మరో వైరస్‌ ‘డిసీజ్‌ ఎక్స్‌’ దాడి చేయనుందా..?

మరో వైరస్‌ ‘డిసీజ్‌ ఎక్స్‌’ దాడి చేయనుందా..?

మొన్నటివరకు ఎబోలా, చికెన్‌ ఫాక్స్‌ వంటి వ్యాధులతో సతమతమవగా.. నిన్నటి వరకు కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. రేపు.. ఏ వ్యాధి ఏ రూపంలో మనపై దాడి చేయనుంది? దాని ఆనవాళ్లేంటి? ‘డిసీజ్‌ ఎక్స్‌’ అనే వ్యాధి అదేనా?.. అనే ప్రశ్నలు ప్రస్తుతం మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కారణంగా అన్నిరకాలుగా నష్టపోయిన ప్రపంచం.. ఇప్పుడిప్పుడే కోలుకొని అడుగులు వేస్తున్న తరుణంలో కొత్త వ్యాధి ‘డిసీజ్‌ ఎక్స్‌’ కు సంబంధించిన చర్చ జరుగుతున్నది. ఈ ‘డిసీజ్‌ ఎక్స్‌’ వ్యాధికి సంబంధించిన అంశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతగా ప్రాధాన్యం ఇవ్వడమే వైద్యనిపుణులను భయపెడుతున్నది. 

ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితుల్లోకి రాకుండా ఉండేందుకు 2015 మే లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) "అంటువ్యాధులను నివారించడానికి చర్యల కోసం ఆర్‌ అండ్‌ డీ బ్లూప్రింట్" ను రూపొందించాల్సిందిగా వైద్యనిపుణులను కోరింది. వైరల్ ఇన్ఫెక్షన్ల గుర్తింపు, టీకాలు / చికిత్సల ఆమోదం మధ్య సమయం తగ్గుతుందని భావించి ఈ మేరకు బ్లూప్రింట్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. డబ్ల్యూహెచ్‌ఓ నియమించిన ప్రపంచ నిపుణుల బృందం - "ఆర్ అండ్ డీ బ్లూప్రింట్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్" - పది "బ్లూప్రింట్ ప్రాధాన్య వ్యాధుల" షార్ట్‌లిస్ట్‌ను రూపొందించడానికి ఏర్పడింది. భవిష్యత్‌లో అంటువ్యాధికి కారణమయ్యే "తెలియని" వ్యాధికారకానికి ప్రాతినిధ్యంగా ప్లేస్‌ హోల్డర్‌గా ‘డిసీజ్ ఎక్స్‌’ను జాబితాలో చేర్చారు. 

డబ్ల్యూహెచ్‌ఓ నియమించిన నిపుణుల బృందం షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో ‘డిసీజ్‌ ఎక్స్‌’తో పాటు కరోనా, క్రిమియన్-కాంగో రక్తస్రావం జ్వరం, ఎబోలా వైరస్ వ్యాధి, మార్బర్గ్ వైరస్ వ్యాధి, లాసా జ్వరం, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, నిపా, హెనిపావిరల్ వ్యాధులు, రిఫ్ట్ వ్యాలీ జ్వరం, జికా.. ఉన్నాయి. అయితే, ఇది సమగ్రమైన జాబితా కాదని, ఈ జాబితాను అవసరాలకు తగినట్లుగా సమీక్షించి నవీకరిస్తుందని, ప్రాధాన్యత వ్యాధుల ఆధారంగా రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయడానికి ఇలాంటి జాబితా ఉపకరిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టంచేసింది. ఇలాఉండగా, ఎబోలా, కొవిడ్‌ వైరస్‌ల గురించి ముందే తెలియకపోవడం వల్ల కొత్త వ్యాధుల గురించి భయపడాల్సి వస్తుందని మరికొందరు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘డిసీజ్ ఎక్స్’ గురించి ఒక ఉన్నతస్థాయి పరిశోధకుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు బహిరంగ చర్చనీయాంశమయ్యాయి. "వైద్యులు కొత్త వ్యాధి ఎక్స్‌కి భయపడటంతో కొత్త ప్రాణాంతక వైరస్‌లు మానవాళిని తాకడానికి సిద్ధంగా ఉన్నాయి" అని 1976 లో ఎబోలా వైరస్‌ను కనుగొనడంలో సహాయపడిన ప్రొఫెసర్ జీన్ జాక్వెస్ ముయెంబే టాంఫమ్.. ఇటీవల హెచ్చరించారు. ఆఫ్రికా ఉష్ణమండల వర్షారణ్యాల నుంచి కొత్త, ప్రాణాంతక వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని ఆయన అన్నారు.

‘డిసీజ్ ఎక్స్‌’ మిస్టరీ ఏంటి?

‘డిసీజ్‌ ఎక్స్’ అనే వ్యాధి ఖచ్చితంగా కొత్త వ్యాధి కాదని, ఇంకా కనుగొనబడని సంభావ్య వ్యాధిగా అభిప్రాయపడుతున్నారు పలువురు వైద్య పరిశోధకులు. డిసీజ్ ఎక్స్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2018 ఫిబ్రవరిలో స్వీకరించిన ప్లేస్‌ హోల్డర్ పేరు అని వారు చెప్తున్నారు. ఇది కొత్తగా కనుగొన్న ముప్పు కాదని, భవిష్యత్‌లో ఉద్భవించి, మహమ్మారికి కారణమయ్యే ఒక ఊహాత్మక వ్యాధి అని వారంటున్నారు. అయితే, ‘డిసీజ్ ఎక్స్’ అనేది కొత్తగా కనుగొన్న ముప్పున్న వ్యాధి కాకపోయినపక్షంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అని ఇంకొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పుడు వార్తల్లో ఎలా..?

కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్‌కు చెందిన ఓ మారుమూల పట్టణంలో నివసించే ఒక మహిళలో ఇటీవల రక్తస్రావం, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. ఆమెను ఎబోలాతోపాటు అనేక వ్యాధుల కోసం పరీక్షించినప్పటికీ.. అన్ని పరీక్ష నివేదికలు ప్రతికూలంగా వచ్చాయి. దాంతో ఇది కొత్త, ప్రాణాంతక వైరస్ లక్షణం కావచ్చునని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ‘డిసీజ్‌ ఎక్స్‌’ రోగి సున్నా అయితే మరింత భయపడాల్సి వస్తుందని డాక్టర్‌ డాడిన్‌ బోంకోల్‌ చెప్తున్నారు. ఎబోలా, కొవిడ్‌ వైరస్‌ల గురించి ముందస్తుగా తెలియకపోవడం వల్ల చాలా నష్టపోవాల్సి వచ్చిందని, అందుకు ‘డిసీజ్‌ ఎక్స్‌’ గురించి ఆలోచించాల్సి వస్తున్నదని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇలాఉండగా, ఇంకా చాలా జూనోటిక్ వ్యాధులు, ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులు భవిష్యత్‌లో చాలా తలెత్తవచ్చని ప్రొఫెసర్ టామ్‌ఫమ్ హెచ్చరించారు. ఇన్ఫ్లుయెంజా, రాబిస్, యెల్లో ఫీవర్‌ - ఇవన్నీ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందాయని, ఈ వ్యవహారం ఇలాగే కొనసాగి భవిష్యత్‌లో అంటువ్యాధులు, మహమ్మారికి దారితీయవచ్చని టామ్‌ఫమ్‌ పేర్కొంటున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవి కూడా చదవండి..

మొన్నటి కిమ్‌ పరేడ్‌ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!

అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?

భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..

VIDEOS

logo