బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Jan 31, 2020 , 14:09:00

కరోనా వైరస్‌ అంటే ఏమిటి..? దాని లక్షణాలేమిటో తెలుసా..?

కరోనా వైరస్‌ అంటే ఏమిటి..? దాని లక్షణాలేమిటో తెలుసా..?

కరోనా వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రస్తుతం ఈ వైరస్‌ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. చైనాలో తొలుత బయటపడ్డ ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తున్నది. పలు ఇతర దేశాల్లోనూ కరోనా వైరస్‌ కేసులు బయట పడుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా పలుచోట్ల కొందరు మృతి చెందడంతో అన్ని దేశాలూ అప్రమత్తమై ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. అయితే అసలింతకీ కరోనా వైరస్‌ అంటే ఏమిటి..? అది ఎలా వ్యాప్తి చెందుతుంది..? దాంతో ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


చైనాలోని ఉహాన్‌ అనే ప్రాంతంలో ఉన్న సముద్ర ఆహార మార్కెట్‌లో కరోనా వైరస్‌ మొదటగా వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు చేపట్టారు. దీంతో పరిశోధకులు వారికి కొత్త వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దానికి కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు. కరోనా అనేది లాటిన్‌ పదం. కరోనా అంటే కిరీటం అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్‌ను ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఆ సూక్ష్మ జీవులు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో పరిశోధకులకు కనిపించాయి. దీంతో ఆ సూక్ష్మ జీవులకు కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు. 

కరోనా వైరస్‌ మనిషి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్‌ సోకిన వారికి మొదటగా జలుబు వస్తుంది. తరువాత జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలు ఎదురవుతాయి. ఆ తరువాత తీవ్రమైన న్యుమోనియా వస్తుంది. అనంతరం అనారోగ్యం మరింత ఎక్కువై చివరకు ప్రాణాలు కోల్పోతారు. ఈ వైరస్‌ తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. 


క‌రోనా వైర‌స్ మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కే కాక‌, జంతువుల నుంచి మ‌నుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ బారిన పడిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా వారు ఆరోగ్యవంతమైన వ్యక్తులను స్పృశించినప్పుడు ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇక ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు ఇప్పటి వరకు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. కానీ హెచ్‌ఐవీ చికిత్సకు ఉపయోగించే పలు మందులు కరోనా వైరస్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయని పలువురు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై చైనా ఇప్పటికే పరిశోధనలు కూడా ప్రారంభించింది. అయితే కరోనా వైరస్‌ సోకిందని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. 


logo