గురువారం 04 మార్చి 2021
Health - Jan 05, 2021 , 17:54:27

వ‌ణికిస్తున్న బ‌ర్డ్ ఫ్లూ.. మ‌న‌కూ అంటుకుంటుందా? ల‌క్ష‌ణాలు ఏంటి?

వ‌ణికిస్తున్న బ‌ర్డ్ ఫ్లూ.. మ‌న‌కూ అంటుకుంటుందా? ల‌క్ష‌ణాలు ఏంటి?

క‌రోనా మ‌హ‌మ్మారి పీడ విర‌గ‌డ కానే లేదు.. అప్పుడే మ‌రో వైర‌స్ ఇండియాను వ‌ణికిస్తోంది. ఇది గ‌తంలో చాలాసార్లు భ‌య‌పెట్టిందే. దాని పేరు బ‌ర్డ్ ఫ్లూ. ఇప్పుడీ వైర‌స్ కార‌ణంగానే ఐదు రాష్ట్రాలు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించాయి. ఈ రాష్ట్రాల్లో వేల కొద్దీ కాకులు ఈ వైర‌స్ కార‌ణంగా మృత్య‌వాత ప‌డుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేర‌ళ ఇప్ప‌టికే దీనిని రాష్ట్ర విప‌త్తుగా ప్ర‌క‌టించి 40 వేల ప‌క్షుల‌ను చంపాల‌ని నిర్ణ‌యించింది. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంద్‌సౌర్‌లో 15 రోజుల పాటు చికెన్ సెంట‌ర్ల‌ను మూసివేయాల‌ని అధికారులు ఆదేశించ‌డాన్ని బ‌ట్టి అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

ఇక‌ రాజ‌స్థాన్‌,  హ‌ర్యానాల్లోనూ వేలాది కాకులు, ఇత‌ర ప‌క్షులు బ‌ర్డ్‌ఫ్లూ కార‌ణంగా మృత్య‌వాత ప‌డుతున్నాయి. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ పాంగ్ డామ్ స‌రస్సు ద‌గ్గ‌ర‌ 1800 ప‌క్షులు చ‌నిపోయిన‌ట్లు గుర్తించారు. ఇవి వారం కింద‌ట మృత్య‌వాత ప‌డ‌గా.. అవి హెచ్‌1ఎన్‌1 ఏవియ‌న్ ఇన్‌ఫ్లెయెంజా వైర‌స్ వ‌ల్లే చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అటు క‌ర్ణాట‌క కూడా తాము హైఅల‌ర్ట్‌లో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

ఎక్క‌డ మొద‌లైంది?

తాజాగా ఈ బ‌ర్డ్‌ఫ్లూని తొలిసారి రాజ‌స్థాన్‌లో గుర్తించారు. అక్క‌డ వంద‌ల సంఖ్య‌లో మృత్య‌వాత ప‌డుతున్న కాకుల‌ను చూసి ఆందోళ‌న చెందిన అధికారులు.. వాటి క‌ళేబ‌రాల‌ను ప‌రీక్షించ‌గా బ‌ర్డ్‌ఫ్లూ వ‌ల్లే అవి చ‌నిపోయిన‌ట్లు గుర్తించారు. డిసెంబ‌ర్ 25 ప్రాంతంలో తొలిసారి ఈ కాకులు మృత్య‌వాత ప‌డ‌టం ప్రారంభ‌మైంది. ఝాలావ‌ర్‌, కోటె, బార‌న్‌, పాలి, జోధ్‌పూర్‌, జైపూర్ జిల్లాల‌కు బ‌ర్డ్ ఫ్లూ పాకింది. దీంతో ఝాలావ‌ర్ జిల్లాలోని బాలాజీ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా 144 సెక్ష‌న్ విధించారు. ఆ త‌ర్వాత ఈ ఫ్లూ మ‌రో నాలుగు రాష్ట్రాల‌కు పాకింది. హ‌ర్యానాలో పౌల్ట్రీ ప‌క్షులు ల‌క్ష‌ల సంఖ్య‌లో మృత్య‌వాత‌ప‌డ‌టంపై అక్క‌డి ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ విచార‌ణ‌కు ఆదేశించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చ‌నిపోయిన కాకుల క‌ళేబ‌రాల్లో బ‌ర్డ్ ఫ్లూ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఇండోర్‌, మంద్‌సౌర్‌, అగ‌ర్‌మాల్వా, ఖార్‌గోన్ జిల్లాలకు ఇప్ప‌టికే ఈ బ‌ర్డ్‌ఫ్లూ పాకింది.

రాష్ట్ర విప‌త్తుగా ప్ర‌క‌టించిన కేర‌ళ‌

కేర‌ళ అయితే ఈ బ‌ర్డ్ ఫ్లూను ఏకంగా రాష్ట్ర విప‌త్తుగా ప్ర‌క‌టించింది. అంతేకాదు ఇది మ‌రింత వ్యాపించ‌కుండా 40 వేల ప‌క్షుల‌ను చంప‌డానికి కూడా ఆ రాష్ట్రం ప్లాన్ చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెంజా హెచ్‌1ఎన్‌8 వైర‌స్‌ను గుర్తించారు. ముఖ్యంగా కొట్టాయం, అల‌ప్పుజ జిల్లాల‌ను హైఅల‌ర్ట్‌లో ఉంచారు. వైర‌స్ క‌నిపించిన చుట్టుప‌క్క‌ల కిలోమీట‌ర్ ప‌రిధిలో వేలాది ప‌క్షుల‌ను చంప‌డానికి అధికారులు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. వంద‌లాది బాతులు మృత్యువాత ప‌డ‌టం గుర్తించిన అక్క‌డి అధికారులు వాటి న‌మూనాల‌ను భోపాల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమ‌ల్ డిసీజెస్‌కు పంపించారు. ఇందులో ఐదు ప‌క్షులు బ‌ర్డ్‌ఫ్లూ కార‌ణంగా చనిపోయిన‌ట్లు తేలింది. 

బ‌ర్డ్‌ఫ్లూ అంటే ఏంటి?

బ‌ర్డ్‌ఫ్లూ లేదా ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయెంజా అనేది ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయెంజా వైర‌స్‌ల వ‌ల్ల క‌లిగే ఒక ఇన్ఫెక్ష‌న్‌. ఈ ఫ్లూ వైర‌స్‌లు ప‌క్షుల్లో స‌హ‌జంగానే క‌నిపిస్తుంటాయి. ప‌క్షుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెంది, కోళ్లు, బాతుల వంటి ప‌క్షుల‌ను చంపేస్తుంటాయి. 

మ‌నుషుల‌కు వ్యాపిస్తుందా?

ప‌క్షుల మ‌ధ్య వేగంగా వ్యాప్తి చెందే ఈ ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయెంజా.. ఈ వైర‌స్ కార‌ణంగా జ‌బ్బుప‌డిన‌, చ‌నిపోయిన ప‌క్షుల‌కు చేరువ‌గా వెళ్లిన మ‌నుషులకు కూడా పాకుతుంది. అయితే మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ‌చ్చే అవ‌కాశాలు మాత్రం చాలా చాలా త‌క్కువ‌. ప‌క్షుల్లో ఈ వైర‌స్ వ్యాప్తిని సాధ్య‌మైనంత త‌క్కువ చేయ‌డం ద్వారానే మ‌నుషుల‌కు ముప్పు లేకుండా చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్ర‌స్తుతానికి ఈ వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌కుండా పౌల్ట్రీల్లోని ప‌క్షుల‌ను చంప‌డం త‌ప్ప మ‌రో మార్గం లేదు. 

బ‌ర్డ్‌ఫ్లూ ల‌క్ష‌ణాలు

చాలా వ‌ర‌కు ఫ్లూలాంటి ల‌క్ష‌ణాలే హెచ్‌5ఎన్‌1 ఇన్ఫెక్ష‌న్ ఉన్న‌వాళ్ల‌లోనూ క‌నిపిస్తాయి. ద‌గ్గు, డ‌యేరియా, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, జ్వ‌రం (100.4 డిగ్రీల కంటే ఎక్కువ‌), త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పి, ముక్కు కారుతూ ఉండ‌టం, గొంతు నొప్పిలాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. 

పౌల్ట్రీ ఉత్ప‌త్తుల‌ను తినొచ్చా?

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ప్ర‌కారం.. పౌల్ట్రీ ఉత్ప‌త్తుల‌ను ఎప్ప‌టిలాగే వండుకొని, తిన‌వ‌చ్చు. ఈ వైర‌స్ 30 నిమిషాల‌పాటు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త ద‌గ్గ‌ర చ‌నిపోతుంది. అయితే పౌల్ట్రీ ఉత్ప‌త్తుల‌ను వాడిన త‌ర్వాత శుభ్రంగా చేతులు క‌డుక్కోవ‌డం మాత్రం త‌ప్ప‌నిస‌రి. గుడ్లలోని తెల్ల‌, ప‌చ్చ‌సొన‌లు పూర్తిగా ఉడికి గ‌ట్టిప‌డే వ‌ర‌కూ గుడ్ల‌ను ఉడికించాలి. 

వ్యాక్సిన్ ఉందా?

బ‌ర్డ్‌ఫ్లూ సోక‌కుండా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి వ్యాక్సిన్లు లేవ‌ని ఎయిమ్స్ స్ప‌ష్టం చేసింది. ఇక ఈ బ‌ర్డ్‌ఫ్లూను నివారించ‌డానికి ముందుగా వాడే మందులు కూడా ఏమీ లేవు.


ఇవి కూడా చ‌ద‌వండి

బంగారాన్నే మించిపోతున్న బిట్‌కాయిన్.. ఎందుకిలా?

అద‌ర్ పూనావాలా భార్య ఎవ‌రు? ఆయ‌న మ‌తం ఏంటి?

ఇండియ‌న్ క్రికెట‌ర్‌తో మాట్లాడిన ఆ న‌ర్స్ ఎవ‌రు?

ఆ డీల్ ఆప‌క‌పోయారో.. ఇండియాకు అమెరికా వార్నింగ్‌

VIDEOS

logo