శనివారం 29 ఫిబ్రవరి 2020
గుండె లయ తప్పితే..?

గుండె లయ తప్పితే..?

Feb 11, 2020 , 09:13:59
PRINT
గుండె లయ తప్పితే..?

బీపీ, షుగర్‌ లాంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతుండడంతో గుండెపోటుతో పాటుగా ఈ ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ సమస్య కూడా పెరుగుతున్నది.

హెల్త్‌డెస్క్‌ / ఖైరతాబాద్‌: గుండెజబ్బులు అనగానే వెంటనే గుండెపోటు గుర్తుకొస్తుంది. కానీ గుండెపోటు సమస్య మాదిరిగానే గుండెజబ్బు కూడా ఉంటుంది. హృదయ స్పందనలో తేడాల వల్ల ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ అనే సమస్య  ఇటీవల కాలంలో ఎక్కువైందన్నారు ఎస్టేర్‌ ప్రైమ్‌ ఆస్పత్రి ఇంటర్వేన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రఘు. బీపీ,  షుగర్‌ లాంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతుండడంతో గుండెపోటుతో పాటుగా ఈ ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ సమస్య  కూడా పెరుగుతున్నది. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రఘు సూచించారు.  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ వ్యాధికి గల కారణాలు, నివారణోపాయాలను వివరించారు. 

ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ అంటే?

గుండె సాధారణంగా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ హృదయ స్పందన ఒక క్రమపద్ధతిలో ఉండాలి. రెండు హార్ట్‌ బీట్ల మధ్య గ్యాప్‌ ఎక్కువైనా, తక్కువైనా హృదయ స్పందనలో తేడా వస్తుంది. దాంతో గుండె మరింత వేగంగా కూడా కొట్టుకోవచ్చు. ఇలా హృదయ స్పందనల్లో ఏర్పడే అపసవ్యతలనే ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ అంటారు. దీనివల్ల శరీరంలోని అవయవాలకు రక్తం సక్రమంగా సరఫరా కాదు. దాంతో రక్తం అంతా గుండె గదుల్లోనే పేరుకుపోతుంది. ఇలా నిల్వ కాబడిన రక్తాన్ని క్రమంగా గడ్డలుగా ఏర్పరుస్తుంది. ఈ రక్తం గడ్డలు గుండెకు మాత్రమే పరిమితం కాకుండా శరీరం అంతటా ప్రయాణిస్తాయి. ఇవి మెదడుకు సులువుగా వెళ్తాయి. అలా మెదడు రక్తనాళాల్లో ఈ గడ్డలు చేరినప్పుడు మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది. పక్షవాతం రావడానికి 40 నుంచి 50 శాతం ఏట్రియల్‌ ఫిబ్రిలేషనే కారణం. 

ఎలా కనుక్కోవడం?

ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ వల్ల హృదయ స్పందనల్లో వచ్చే హెచ్చుతగ్గులు స్థిరంగా ఉండవు. ఒక్కసారిగా తేడాలు వచ్చి, మళ్లీ మామూలవ్వొచ్చు. అందువల్ల ఈ సమస్యను ఈసీజీ ద్వారా తెలుసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది. వైద్య సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత హృదయ స్పందనల రేటును రికార్డు చేయడానికి అనేక రకాల డివైస్‌లు వచ్చాయి. యాపిల్‌ వాచ్‌లు, ప్రత్యేకమైన సాంకేతికత ద్వారా రూపొందించిన దుస్తుల ద్వారా కూడా వీటిని రికార్డు చేయవచ్చు. ఇంప్లాంటబుల్‌ లూప్‌ రికార్డర్‌ ద్వారా ఒక మైక్రోచిప్‌ని చర్మంలో అమర్చి, ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ను కనుక్కోవచ్చు. అయితే బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులున్నవాళ్లు, అప్పటికే గుండెపోటు రావడం, గుండె పంపింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉన్నవాళ్లు, ర్యుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉన్నవాళ్లు, ఒకసారి స్ట్రోక్‌ వచ్చిన వాళ్లు ఈ పరీక్షల ద్వారా ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ సమస్య ఉందో లేదో చెక్‌ చేయించుకోవాలి. ఈ సమస్య ఉన్నవాళ్లలో గుండెదడ, ఆయాసం ఉంటాయి. ఎప్పుడూ నీరసంగా ఉంటుంటారు. కానీ పెద్దవాళ్లయితే వయసు వల్ల వచ్చిన నీరసం అని సరిపెట్టుకుంటుంటారు. కానీ అశ్రద్ధ చేయకూడదు. షుగర్‌ ఉండి, ఇలాంటి లక్షణాలుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలన్నారు.

ఎందుకిలా?

సాధారణంగా వయసు పెరిగినాకొద్దీ శరీరంలోని అవయవాల్లో తేడాలు వస్తాయి. వాటి పనితీరు మందగిస్తుంది. అలా గుండె కొట్టుకోవడంలో కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనికి తోడు ఆధునిక జీవనశైలి వల్ల ముంచుకొచ్చిన అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధులు ఉన్నవాళ్లలో కూడా ఈ ఆర్టియల్‌ ఫైబ్రిలేషన్‌ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు, ర్యుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ వల్ల కూడా గుండె కొట్టుకోవడంలో తేడాలు వస్తాయి. 

పరిష్కారం ఎలా.?

మందుల ద్వారా గుండె గదుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేయవచ్చు. నోటి ద్వారా తీసుకునే యాంటి కోయాగ్యులెంట్‌ మందులు 65 నుంచి 70 శాతం స్ట్రోక్‌ రిస్క్‌ రాకుండా నివారిస్తాయి. అయితే వీటి వల్ల రక్తస్రావం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కొత్త మందులు వచ్చాయి. నావల్‌ యాంటి కోయాగ్యులెంట్స్‌ అనే ఈ మందులు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. రక్తస్రావం అయ్యే అవకాశం చాలా తక్కువ. ఈ సమస్య ఉన్నప్పటికీ మంచి చికిత్సలున్నాయి. కాబట్టి అవగాహన పెంచుకుని, సకాలంలో డాక్టర్‌ను సంప్రదించాలని డాక్టర్‌ రఘు సూచించారు.

-డాక్టర్‌ రఘు, ఎస్టేర్‌ ప్రైమ్‌ ఆస్పత్రి ఇంటర్వేన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ 


logo