మంగళవారం 31 మార్చి 2020
Health - Jan 08, 2020 , 10:57:29

ఎండ తగులకపోవడమే శాపం!

ఎండ తగులకపోవడమే శాపం!

ఆధునిక జీవనశైలి మనల్ని శాపగ్రస్థులుగా మారుస్తున్నది. సూర్యరశ్మి సోకని దురవస్థలో గడిపేస్తున్నాం. ఫలితంగా శరీరానికి ఉచితంగా లభించే డీ విటమిన్‌ పొందలేకపోతున్నాం. మన దేశంలో 85శాతం మంది డీ విటమిన్‌లోపంతో బాధపడుతుండగా.. ఢిల్లీలో ఏకంగా 90 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఓ సర్వేలో వెల్లడయింది. హైదరాబాద్‌లోనూ 85శాతం మందిని ఈ సమస్య పీడిస్తున్నది. కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, గృహిణులు డీ విటమిన్‌ పొందలేక వివిధ వ్యాధులకు గురవుతున్నారు.

-ఎక్కల్‌దేవి శ్రీనివాస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విపరీతమైన ఒంటినొప్పులు, తీవ్రమైన అలసట, నీరసం, దానికితోడు స్వల్పంగా గూని! సాధారణంగా వృద్ధాప్యంలో పీడించే ఈ సమస్య దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రోహిత్‌ అనే విద్యార్థిని ఇంటర్‌లోనే చుట్టుముట్టాయి. డీ విటమిన్‌ లోపమే ఈ దురవస్థకు కారణమని వైద్యులు గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని తీవ్రమైన వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరించారు. దీంతో రోహిత్‌ తల్లిదండ్రులు ఇంటర్‌ చదువును ఒక ఏడాది ఆపేసి, చికిత్స తీసుకొంటూనే ఆరుబయట కొంత సమయం గడిపేలా, ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తున్నారు.
ఉద్యోగం వదిలేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

విటమిన్‌ డీ శాపగ్రస్థులకు మరో ఉదాహరణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రసాద్‌. కొంతకాలంగా ఒంటినొప్పులతో బాధపడుతున్న ప్రసాద్‌కు ఒకరోజు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. కార్డియాలజిస్ట్‌ను సంప్రదించగా యాంజియోగ్రామ్‌ తీసి గుండె సంబంధ సమస్యలేవీ లేవని తేల్చిన డాక్టర్‌.. చివరకు విటమిన్‌ డీ లోపం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించారు. డీ విటమిన్‌ మాత్రలు వేసుకుంటూ.. రోజూ శరీరానికి కొంతసేపు సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలని సూచించారు. ఏసీ కారులో ఆఫీసుకు వెళ్లి ఏసీ గదుల్లో పనిచేస్తుండటంతో సూర్యరశ్మి ఒంటికి తగలడంలేదని గ్రహించిన ఆయన కొంతకాలం ఆ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నారు.డాక్టర్లకూ తప్పని తిప్పలు!

హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో పనిచేస్తున్న సుమారు 250 మంది వైద్యుల్లో 99 శాతం మంది డీ విటమిన్‌ లోపంతో బాధపడున్నట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కార ణాలు గ్రహించి శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్త పడుతున్నారు.విటమిన్‌ డీ లోపం లక్షణాలు

విటమిన్‌ డీ లోపిస్తే ఒంటినొప్పులు, కీళ్లు, కండరాలు, ఎముకల నొప్పులు, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో రికెట్స్‌వ్యాధి వస్తుంది. అది దొడ్డికాళ్లకు దారితీసి ఎముకల సాంద్రత తగ్గిస్తుంది. ఏ చిన్న దెబ్బతగిలినా ఎముకలు విరుగుతాయి. పెద్దవారిలో ‘ఆస్టియో మలేషియా’ వ్యాధి వస్తుంది. స్క్రీజోఫీనియా, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. గర్భిణులకు విటమిన్‌ డీ లోపిస్తే గర్భంలోని శిశువు పెరుగుదల తగ్గుతుంది. పుట్టిన పిల్లలకు ఎముకల వ్యాధులతోపాటు ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వృద్ధుల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. తరచూ కింద పడిపోతుంటారు. ఎముకలు చిన్నపాటి దెబ్బలకే విరిగిపోతుంటాయి.క్యాన్సర్లకు హేతువు

విటమిన్‌ డీ 20 నానో గ్రామ్స్‌/మిల్లిలీటర్‌ కన్నా తగ్గితే.. బ్రెయిన్‌, ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌, కొలాన్‌ తదితర ఏడు రకాల కాన్సర్లు వచ్చే అవకాశం 30 నుంచి 50 శాతం పెరుగుతుంది. ఉమెన్‌ హెల్త్‌ ఇనీషియేటివ్‌ సంస్థ చేసిన సర్వేలో.. విటమిన్‌ డీ 12 నానోగ్రామ్స్‌/మిల్లిలీటర్‌ కంటే తక్కువగా ఉంటే.. కొలాన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 253 శాతం పెరుగుతుందని తేలింది.విటమిన్‌ డీ ప్రయోజనాలు

విటమిన్‌ డీ సమృద్ధిగా ఉంటే.. శరీరంలో కథెలిసిడిన్‌ అనే ప్రొటీన్‌ తయారుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రొటీన్‌.. టీబీ బ్యాక్టీరియాను చంపుతుంది. బ్లడ్‌ప్రెషర్‌కు కారణమయ్యే రెనిన్‌ అనే ఎంజైమ్‌ను నియంత్రించడంలోనూ విటమిన్‌ డీ తోడ్పడుతుంది. దీంతో బీపీ నార్మల్‌గా ఉంటుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. టైప్‌2 డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం 33 శాతం తగ్గుతుంది.ఎలా లభిస్తుంది?

VITAMIN-D1

శరీరానికి అవసరమైన డీ విటమిన్‌లో దాదాపు 96 శాతం సూర్యరశ్మి ద్వారానే లభిస్తుంది. మిగిలినది సాల్మన్‌ఫిష్‌, ట్యూనా, ఫోర్టిఫైడ్‌ మిల్క్‌ ద్వారా లభిస్తుంది. ఎండ తీవ్రతను బట్టి కాళ్లు, చేతులకు కనీసం 5 నుంచి 30 నిమిషాలపాటు వారానికి రెండుసార్లు సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో సూర్యరశ్మి మన శరీరాన్ని తాకేలా చూసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం

మనకు వ్యాధులు రాకుండా కాపాడేది సూర్యరశ్మి. ఆధునిక జీవనశైలి కారణంగా ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. దీంతో సూర్యుడి నుంచి లభించే డీ విటమిన్‌ పొందలేక అనేక వ్యాధులబారిన పడుతున్నాం. సూర్యనమస్కారాలు, యోగా వంటివి ఉదయం ఆరుబయట చేయడం వల్ల శరీరం పటుత్వంగా తయారవ్వడమేకాకుండా డీ విటమిన్‌ లభిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 1000-2000 ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌ డీ విటమిన్‌ కావాలి. ఇందుకు కొంతసేపు ఎండలో ఉంటే సరిపోతుంది. చాలా మంది ఇంజక్షన్లు, మాత్రలు వాడుతున్నారు. ఇది కూడా ప్రమాదకరమే.

Drsarath-chandra-mouli

-డాక్టర్‌ వీరవల్లి శరత్‌చంద్రమౌళి,చీఫ్‌ రుమటాలజిస్ట్‌, కిమ్స్‌మధుమేహానికి దారితీయవచ్చు

డీ విటమిన్‌ ఎముకల పటుత్వానికి, వ్యాధి నిరోధకశక్తిని పెంచడానికి అవస రం. ఈ విటమిన్‌ లోపం వల్ల ఒంటినొప్పులు, తీవ్ర అలసట, నిస్సత్తువ, తేలికపాటి గాయాలకే ఎముకలు విరు గడంతోపాటు హృదయ, రక్త సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ప్రకారం.. డీ విటమిన్‌ లోపం మధుమేహానికి కూడా దారితీసే అవకాశాలు కనపడుతున్నా యి. ఉదయం వేళలో సూర్యరశ్మి శరీరానికి తగిలితే మనకు కావాల్సిన విటమిన్‌ డీ లభిస్తుంది.

Dr-vamshi-krishna

- డాక్టర్‌ వంశీకృష్ణ, ఫిజీషియన్‌, ఎస్సెల్జీ దవాఖాన


logo
>>>>>>