విట‌మిన్ సి ఆహారంతో 'ర‌క్తం' పెరుగుతుందా..?


Thu,January 7, 2016 07:06 PM

'విట‌మిన్ సి' ఆహార‌మంటే అధిక శాతం వ‌ర‌కు పులుపుగానే ఉంటుంది. కానీ ఈ రుచిని ఆస్వాదించేందుకు మ‌న‌లో అధిక శాతం మంది అంత‌గా ఆస‌క్తి చూపించ‌రు. కొంచెం పుల్లగా ఉండే సిట్రస్ పండ్లపై ఎవ‌రికీ అంత ఇష్టం కూడా ఉండ‌దు. అయితే వీటిని పక్కన పెడితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే విట‌మిన్ సి ఉన్న పండ్ల‌ను తీసుకోక‌పోతే ర‌క్తం త‌గ్గిపోతుంది. అదేమిటి? పండుకీ, రక్తానికీ సంబంధం ఏముంటుంది, అనుకుంటున్నారా? అవును, సంబంధం క‌చ్చితంగా ఉంది. ఎందుకంటే ఫ‌లాల్లో స‌మృద్ధిగా ఉండే విట‌మిన్ సి ని త‌గినంత తీసుకోక‌పోతే శ‌రీరం గ్ర‌హించుకునే ఐర‌న్ శాతం త‌క్కువ‌వుతుంది. దీంతో ర‌క్తం కూడా త‌యారు కాదు.

తాజాగా ఉండే చాలా ఫలాల్లో విటమిన్ సి ఉంటుంది. ఉసిరి, జామ, నిమ్మ, టమాట, అనాస, బొప్పాయి, మామిడి, జీడిమామిడి వంటి పండ్లలో సి విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండే మధ్యవయసు వారు రోజుకి 50 నుంచి 75 మిల్లీగ్రాముల సి విటమిన్ తీసుకోవాలి. చిన్నారులకు మాత్రం 25 నుంచి 50 మిల్లీగ్రాములు స‌రిపోతుంది.

విటమిన్ సి లోపం వల్ల వచ్చే సాధారణ వ్యాధి స్కర్వీ. దీని వల్ల నోటిలో చిగుళ్లు వాచి, రక్తం కారుతుంది. ఒక్కోసారి ముక్కులోంచి కూడా రక్తం రావచ్చు. అదేవిధంగా చర్మం కింద ముఖ్యంగా కాళ్ల వెనుక భాగంలో అక్కడక్కడ రక్తం గ‌డ్డ కట్టుకుపోతుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానవు. రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారు. పిల్లల్లో ఎముకలు పెరగకపోవడం, ప్రతి చిన్న విషయానికి చిరాకుపడడం వంటి సమస్యలు కలుగుతాయి. కాళ్లలోని కండరాల్లో నొప్పుల వల్ల కాళ్లు ముడుకుపోవాలని పదే పదే అనిపిస్తుంది.

vitamin-c-for-blood


విటమిన్ సి చుక్కలు గాని, మాత్రలు గాని వాడడం ద్వారా దీనిలోపాన్ని అధిగమించవచ్చు. పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. జ్వరంగా ఉన్నప్పుడు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు సి విటమిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ సి ఉండే ఆహారం అధికంగా తీసుకోవాలి.

అన్ని సిట్రస్ ఫలాల కన్నా ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వంద గ్రాముల ఉసిరి గుజ్జులో 920 మిల్లీగ్రాముల దాకా సి విటమిన్ ఉంటుంది. రెండు నారింజ పండ్లలో ఉన్నంత విటమిన్ ఒక్క ఉసిరికాయలో ఉంటుంది. ఉసిరిలో మరో సుగుణం కూడా ఉంది. సహజంగా సి విటమిన్ వేడి చేసినా, ఉడికించినా వృథాగా నశించిపోతుంది. కాని ఉసిరిలో ఉన్న సి విటమిన్ ఉడికించినా, నిలవ చేసినా నశించిపోదు.

8336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles