శరీరంలో విటమిన్ ఎ లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?


Tue,March 13, 2018 05:50 PM

విటమిన్ ఎ లోపిస్తే కంటి చూపు సరిగ్గా ఉండదని అందరికీ తెలిసిందే. అయితే విటమిన్ ఎ లోపం వల్ల ఇదే కాదు, ఇంకా పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. విటమిన్ ఎ కొవ్వులో కరిగే విటమిన్. అందువల్ల కొవ్వు పదార్థాలను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకుంటేనే ఈ విటమిన్ మనకు లభిస్తుంది. ఈ క్రమంలో అసలు విటమిన్ ఎ లోపం వల్ల మనకు ఇంకా ఏయే అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శరీరంలో విటమిన్ ఎ లోపిస్తే ఎముకలు సరిగ్గా పెరగవు. అవి బలహీనంగా మారుతాయి.

2. మూత్రాశయం ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది.

3. చర్మం పొడిగా మారుతుంది. చర్మంలో సహజసిద్ధమైన తైలాలు స్రవించవు. దీంతో చర్మం పొడిగా, బరుకుగా మారుతుంది.

4. గర్భంతో ఉన్న స్త్రీలు విటమిన్ ఎ సరిగ్గా తీసుకోకపోతే వారి పిల్లలకు రేచీకటి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

5. కంటి చూపు తగ్గుతుంది. దీర్ఘకాలికంగా అయితే శుక్లాలు వస్తాయి. కంటి చూపు పూర్తిగా పోయేందుకు అవకాశం ఉంటుంది.

6. చర్మం, ఊపిరితిత్తులు, వక్షోజాలు, అండాశయం, మూత్రాశయం క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

విటమిన్ ఎ ఉన్న ఆహారాలు...


క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, యాప్రికాట్స్, బ్రొకొలి, కోడిగుడ్లు, మామిడి పండ్లు, బొప్పాయి పండ్లు, చేపలు, పాలు, పాల సంబంధ ఉత్పత్తులు, యాపిల్ పండ్లు, టమాటాలు, ఎరుపు రంగు క్యాప్సికం, బాదం పప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, గుమ్మడి పండ్లు, ఆలివ్ ఆయిల్, ఖర్బూజా, క్యాబేజీ, మటన్, ఉల్లిపాయలు, చిక్కుడు జాతి గింజలు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.

కావల్సిన మోతాదు...


1 నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నిత్యం 300 మైక్రోగ్రాముల విటమిన్ ఎ కావాలి. అలాగే 4 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న వారికి రోజుకు 400 మైక్రోగ్రాములు, 9 నుంచి 13 ఏళ్ల వారికి రోజుకు 600 మైక్రోగ్రాములు, 14 ఏళ్లు ఆపైన వయస్సు ఉన్న వారికి రోజుకు 700 మైక్రోగ్రాముల వరకు విటమిన్ ఎ అవసరం. ఇక గర్భిణీలకు రోజుకు 770 మైక్రోగ్రాముల వరకు విటమిన్ కావాలి. పాలిచ్చే తల్లులు రోజూ 1300 మైక్రోగ్రాముల వరకు విటమిన్ ఎ తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకు కూడా విటమిన్ ఎ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు. విటమిన్ ఎ డోస్ ఎక్కువైతే వికారం, ఆకలి లేకపోవడం, పచ్చకామెర్లు, వాంతులు, వెంట్రుకలు రాలడం, కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. మద్యం సేవించే వారు విటమిన్ ఎ ట్యాబ్లెట్లు వేసుకోరాదు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ పొందేవారు, బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకునే వారు విటమిన్ ఎ ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన మేరకు వాడాలి.

10515

More News

VIRAL NEWS