బీవేర్ ఆఫ్ వడదెబ్బ..తీసుకోవాల్సిన జాగ్రత్తలు!


Wed,May 8, 2019 08:28 AM

తొలి కోడికూసే వేళకు అంతా చల్లచల్లగానే ఉంటున్నది. తొలిపొద్దు పొడిచేసరికి వీపుపై కాస్త వేడి తగిలినట్లనిపిస్తున్నది. ఉదయం తొమ్మిది కాకముందే సూరీడు సుర్రుమంటున్నడు. పదకొండు అయిందంటే చాలు భగ్గుమని మండిపోతున్నడు. మధ్యలో మబ్బులు పడినట్లు యాక్షన్ చేస్తున్నా.. మొత్తానికి ఎండల్ మండేలా అని ఝలక్ ఇస్తున్నడు. అప్రమత్తంగా ఉండడం.. అగడ్ తగులకుండా అపాయం జరుగకుండా ఉపాయంగా ఉండడమే మన కర్తవ్యం. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తం కావాల్సి ఉంది. తాగే నీరు, తినే ఆహారం, వేసుకునే దుస్తుల విషయంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం ఇది..

ముందు జాగ్రత్తలు మేలు :

రోజురోజుకీ భానుడు భగభగలతో ప్రజలను అల్లాడిస్తున్నాడు. ప్రకృతి వనరులను విచక్షణారహితంగా కొల్లగొట్టడం వల్లే వర్షాలు కొరవడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ వేసవిలో భానుడి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు అవసరం.


బీవేర్ ఆఫ్ వడదెబ్బ: శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఎండలో తిరుగడం వల్ల 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. 38 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రతకు గురైన వ్యక్తి ఐదు రోజుల్లో మృతిచెందే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఐదేళ్లలోపు, 60 ఏళ్ల పైబడ్డవారు త్వరగా వడదెబ్బకు గురవుతారు. గర్భిణుల రీరంలో తేమశాతాన్ని కాపాడుకోకుంటే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది.రక్తకణాలు కుచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం మీద పడుతుంది.

వడదెబ్బ లక్షణాలు :


- వడదెబ్బకు గురైనవారి శరీరంలో నీటిశాతం లోపించి బాడీ డీహైడ్రేట్ అవుతుంది.
- శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె, రక్తనాళాలు, కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
- ఒంట్లోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు.
- జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరుగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- అధిక ఉష్ణోగ్రత వల్ల పల్స్ పడిపోతుంది. తల తిరుగడం, తలనొప్పి వస్తాయి.
- మతి కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, మూత్రం పచ్చగా రావడం లాంటి లక్షణాలుంటాయి.


చికిత్స:


- వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకురావాలి.
- బట్టలను వదులు చేసి 25 - 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న నీటితో శరీరాన్ని తడుపాలి. దీని వల్ల శరీరంపై ఉండే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉంటాయి.
- శరీర ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలి. గజ్జలు, చంకలు, మెడపై ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
- వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. సకాలంలో చికిత్స అందించాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు:


- ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండలో తిరుగక పోవడం ఉత్తమం.
- ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి ఎండ తగులకుండా జాగ్రత్త పడాలి. టోపీ, గొడుగు, తలపాగా ధరించాలి.
- ఇళ్లు, కార్యాలయాల్లో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
- ప్రతిరోజూ 5 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలి.
- నీరసంగా అనిపిస్తే ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ కలిపిన నీటిని తీసుకోవాలి.
- ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
- కారం, మసాలాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
- కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
- వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి.
- తగ్గించాలి. యోగా, నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.


వృద్ధులకు దెబ్బే
జాగ్రత్తలు:


- 60 ఏళ్లు దాటిన వారు ఉదయం 8 గంటలలోపే నడక, వ్యాయామాన్ని పూర్తి చేసుకోవాలి.
- మధుమేహంతో బాధపడేవారు వీలైనంత త్వరగా అల్పాహారాన్ని తీసుకోవాలి.
- అల్పాహారం, భోజనానికి మధ్యలో బార్లీ నీరు, పల్చని మజ్జిగ, ఖర్జూరాలు కాచిన నీటిని తాగితే మంచిది.
- సాయంత్రం పూట చెరుకు రసం తాగాలి. వీలైతే అందులో నిమ్మరసం, అల్లం రసం కలుపుకోవాలి.
- సాయంత్రం 5 గంటల తర్వాతే బయటకు వెళ్లాలి.
- వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట బయటకు తీసుకెళ్లవద్దు.

చిన్నారులు భద్రం

వేసవిలో వచ్చే ఇన్‌ఫెక్షన్లు:


- ఎండాకాలంలో ఆటలమ్మ (చికెన్ ఫాక్స్) వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది.
- చెమట ఎక్కువగా పోవడంతో శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతిని వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.
- ఆరేళ్లలోపు వారిలో శరీర ఉష్ణోగ్రత పెరుగడం వల్ల ఫిట్స్ వస్తాయి.
- కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, హైపటైటిస్ ఏ కామెర్లు కూడా వ్యాపిస్తాయి.
- డీహైడ్రేషన్ వల్ల మూత్రం ఆగిపోయి.. మూత్రపిండాలపై ప్రభావం చూపవచ్చు.
- వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. నిల్వచేసిన మాంసాహారం మంచిది కాదు.

జాగ్రత్తలు:


- పిల్లలకు మెత్తని, పల్చని నూలు దుస్తులనే వేయాలి. ఉక్క పోస్తుందని బట్టలు వేయకుండా ఉండకూడదు.
- సబ్బుకు బదులుగా సున్ని పిండితో స్నానం చేయించాలి.
- పిల్లల గదుల చుట్టూ చల్లటి గుడ్డలను వేలాడదీయాలి.
- చెస్, క్యారమ్‌లాంటి ఇండోర్ గేమ్స్ ఆడేలా చిన్నారులను ప్రోత్సహించాలి.
- నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి.
- బయటి ఆహారానికి పూర్తి దూరంగా ఉంచాలి.
- కూరల్లో మసాలాలు వీలైనంతగా తగ్గించాలి.
- పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినిపించాలి.
- టీకాలన్నీ సకాలంలో వేయించాలి.
- చిన్నారులను పరుపులపై కాకుండా మెత్తని దుప్పట్లపై పడుకోబెట్టాలి.


ఈత ఓకే.. కానీ..


వేసలో ఉక్కపోత.. మండే ఎండల నుంచి రక్షణ కోసం పిల్లలు చెరువులు, వాగుల్లో స్నానాలు చేసేందుకు మక్కువ చూపిస్తారు. ఈత నేర్చుకుందామనే సరదా పిల్లల పాలిట శాపంగా మారకూడదంటే ఇలా చేయండి.
- ఐదేళ్లు దాటిన తర్వాతే పిల్లలకు తల్లిదండ్రులు దగ్గరుండి ఈత నేర్పించాలి.
- మూర్చ వ్యాధి, జ్వరం, చర్మ వ్యాధులు ఉన్నవారిని ఈతకు దూరంగా ఉంచాలి.
- ఎండలో ఈత కొట్టడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.
- ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈతకు వెళ్లాలి.
- చెవులు, కళ్లను సంరక్షించుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
- చెరువులు, బావుల్లో దాగుడు మూతలు.. అడుగు భాగానికి వెళ్లి మట్టి తేవడం లాంటి ఆటలు ఆడకుండా చూడాలి.
- నీటిలో ఎవరు ఎక్కువ సేపు దాక్కుంటారోననే పందాలు కాయడం కూడా అనర్థాలకు దారి తీస్తుంది.
- కాలువల్లో ఈత కొట్టే వారు ప్రవాహానికి ఎదురీదడం మంచిదికాదు.
- ప్రవాహం ఎక్కువగా ఉంటే ఈత కొట్టకపోవడమే మంచిది.

అందరికీ హడలే!


పిల్లలు, వృద్ధులనేకాదు.. మహిళలు, నడివయస్కులను కూడా భానుడు ముప్పు తిప్పలు పెడుతాడు. ఏ వయస్సువారైనా.. ఎంత ఆరోగ్యవంతులైనా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి వేసవిలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి.
- ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి.
- చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం వాటర్ కలిపిన మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను
రాసుకోవాలి.
- కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగడం మంచిది.
- కాఫీలు, టీలకు వీలైనంత దూరంగా ఉండాలి.
- తీసుకునే ఆహారంలో ఉప్పు, నీరు, పోషక విలువలు తగినంత ఉండేలా చూసుకోవాలి.
- వేపుడు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
- తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటే మంచిది.
- నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలి.
- ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.
- వైద్యుల సలహా తీసుకొనే వ్యాయామం చేయాలి.


ఫ్యాషన్‌స్పెషల్


- ఇన్నాళ్లూ ధరించిన జీన్స్.. సింథటిక్ దుస్తులనే ఇప్పుడు కూడా వేసుకుంటామంటే కుదురదు.
ఈ ఎండల్లోనూ అందంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే సమ్మర్ ఫ్యాషన్‌కు మారిపోవాల్సిందే.
- వేసవి ఎండకు శరీరం చెమటలు కక్కుతుంది. ఇలాంటి సమయంలో చెమటను బాగా
పీల్చగలిగే, వదులు దుస్తులను ధరిస్తే ఎంతో హాయిగా ఉంటుంది.
- ఖద్దరు కుర్తా, పైజామాలు ఇప్పుడు సమ్మర్ ఫ్యాషన్‌గా మారాయి. కాబట్టి ఖాదీ వస్ర్తాలను ధరిస్తే
మంచిది.
- కాటన్, లెనిన్ దుస్తులు కూడా చెమటను సులభంగా గ్రహిస్తాయి. ఎండ తీవ్రతను
ఎదుర్కోవడానికి సాయపడుతాయి.
- ప్రకృతి సహజమైన ఖద్దరు బట్టలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ధరించడం వల్ల గాలి
బాగా ఆడుతుంది. చెమట పోయదు. శరీరం నుంచి వాసన రానివ్వదు.
- వేసవిలో సింథటిక్ ఫ్యాబ్రిక్ దుస్తులను ధరించవద్దు. చెమట వల్ల వీటితో ఎలర్జీలు కలిగే ప్రమాదం
ఉంటుంది. ఖద్దరుతో ఈ సమస్య ఉండదు.
- వేసవిలో గర్భిణులతోపాటు కడుపులోని బిడ్డ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత
మేరకు వదులుగా ఉండే దుస్తులనే ధరించాలి. అవి కూడా మెత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా
చూసుకోవాలి.
- నలుపు, ముదురు రంగు దుస్తులు త్వరగా వేడిని గ్రహిస్తాయి. కాబట్టి సమ్మర్‌లో వాటిని
దూరం పెట్టాల్సిందే.
- నెత్తిపై టోపీ పెట్టుకోవడం, గొడుగును వెంట తీసుకెళ్లడం వల్ల సూర్య కిరణాల నుంచి రక్షణ
లభిస్తుంది.

వేసవిలో మజ్జిగే దివ్యౌషధం..


ఎండాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో ఉండే సోడియం, పొటాషియం.. చెమట వల్ల శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. నిస్సత్తువను దూరం చేస్తుంది. వేడి వల్ల కలిగే జలుబుకు కూడా మజ్జిగే దివ్యౌషధం. ఈకాలంలో ఆకలి మందగిస్తుంది. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో రసం, సాంబార్‌కు ప్రాధాన్యమివ్వాలి. వ్యాయామం చేసేవారు నీళ్లలో కాస్తంత ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.


కళ్లకు రక్షణ:


- కళ్లను నిండుగా కప్పి ఉంచే చలువ కళ్లద్దాలను ధరించాలి. యూవీ ప్రొటెక్షన్ కలిగి ఉండేవైతే మరీ మంచిది.
-సూర్య కిరణాలు కళ్లను తాకకుండా తలపై పెద్ద టోపీ
పెట్టుకోవాలి.
-కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సమ్మర్ ఐప్యాక్స్‌ను ఆశ్రయిస్తే మంచిది.
- ఏసీ రూముల్లో చల్లటిగాలి నేరుగా కళ్లలోకి వెళ్లేలా కూర్చోవద్దు. దీనివల్ల సైడ్‌ఎఫెక్టులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
- ఈత కొట్టే సమయంలోనూ కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నీటిలోని క్లోరిన్ కళ్లకు హాని చేస్తుంది. అందుకే ఈత కొట్టేటప్పుడు స్విమ్మింగ్ గాగుల్స్‌ను తప్పనిసరిగా ధరించాలి. స్విమ్మింగ్ అయిపోయిన వెంటనే మంచినీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.

ఏ ఎండకా పండు


వేసవి తాపాన్ని తీర్చడంలో పండ్లు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఎండా కాలంలో కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి శాతాన్ని కోల్పోకుండా చూడడంతోపాటు వేసవిలో వచ్చే అనారోగ్యసమస్యలనూ అధిగమించవచ్చు.

పుచ్చకాయ:


- ఇందులోని పొటాషియం మూత్రవ్యవస్థ సాఫీగా సాగేలా చేస్తుంది.
- వేసవిలో ఉక్కపోత వల్ల కలిగే చెమటతోపాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా బయటకు వెళ్లిపోయి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీన్ని తీర్చడంలో పుచ్చకాయలు ముందుంటాయి.
- వేసవిలో వచ్చే మలబద్దకం సమస్యను పుచ్చకాయతో అధిగమించవచ్చు.
- పుచ్చకాయ రసంలో కాస్తంత తేనె కలుపుకొని తాగితే నీరసం తగ్గుతుంది.

తాటి ముంజలు:


- దాహార్తిని తగ్గించే వాటిలో తాటి ముంజలు ముందు వరుసలో ఉంటాయి. శరీరానికి చల్లదనాన్నిస్తాయి.
- నీరసం, అలసటను తాటి ముంజలు నివారించి, శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.
- చిన్నారులు, వృద్ధులతోపాటు గర్భిణులు కూడా వేసవిలో తాటి ముంజలు తినడం మంచిది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపర్చి, మలబద్దకం, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- వేసవిలో ఎదురయ్యే అన్ని రకాల జీర్ణ సమస్యలను తాటి ముంజలు దూరం చేస్తాయి.

కొబ్బరి బోండాం:


- డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
- శరీరంలోని బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్‌ఫెక్షన్లు రాకుండా తోడ్పడుతాయి.
- జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్‌ను అందిస్తుంది.

కీరదోస:


- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- ఊపిరితిత్తులు, కాలేయంలోని వేడిని నిరోధించడంలో కీరదోస సమర్థవంతంగా పనిచేస్తుంది.
- సమ్మర్‌లో కలిగే చర్మవ్యాధులను తగ్గిస్తుంది.
- మెదడును ఉత్సాహపరిచి, తలపై ఉష్ణోగ్రతను నిరోధిస్తుంది.

నీరు నిక్కచ్చిగా:


ఈ కాలంలో మంచినీరే దివ్యౌషధం. ఎండాకాలంలో వేడి అధికమైనప్పుడు శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి వడదెబ్బ, ఎండ నుంచి ఉపశమనం కోసం డీహైడ్రేషన్ రాకుండా మంచినీటినే ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు నిమ్మరసం, చెరుకు రసం, మజ్జిగ తాగడం వల్ల ఎండలతో కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

3583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles