ఆదివారం 24 మే 2020
Health - Mar 24, 2020 , 14:51:42

లాక్‌డౌన్ ఎత్తేయాలని తొందరపడుతున్న ట్రంప్

లాక్‌డౌన్ ఎత్తేయాలని తొందరపడుతున్న ట్రంప్

కరోనా ఏ ఒక్క దేశం సమస్యో కాదు. 190కి పైగా దేశాలకు వ్యాపించి ఖండాంతర మహమ్మారిగా మారింది. యావత్తు భూగోళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్ని దేశాలు లాక్‌డౌన్ ఒక్కటే దిక్కని భావిస్తున్నయి. కానీ అమెరికా మాత్రం ఉలిపికట్టె తరహాలో పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ విధించి దేశాన్ని దిగ్బంధనంలో పెడితేగానీ కరోనా నియంత్రణ సాధ్యం కాదని ఆరోగ్య నిపుణులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. మనదేశం కూడా ఇటు చైనా అనుభవాన్ని, అటు ఇటలీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ ఉధృతంగా అమలు చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాక్‌డౌన్ ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాక్‌డౌన్ చేటు చేస్తుందని ఆయన అంటున్నారు. వైరస్ చావులను మించిన చావులు ఆర్థికరంగం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తాజాగా మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఆయన ప్రభుత్వంలోని ఆరోగ్య నిపుణులు దీంతో విభేదిస్తున్నారు. అమెరికాలో 40 వేలమందికి పైగా కరోనా సోకింది. 500 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ ఏకంగా వైట్‌హౌస్ తలుపు తట్టింది కూడా. ట్రంప్ సిబ్బందికి కరోనా సోకడంతో అలజడి రేగింది. ప్రథమ మహిళ మెలానియెకు సైతం కరోన పరీక్షలు జరపాల్సి వచ్చింది. మహమ్మారిని అదుపు చేయాలని, లేకపోతే అమెరికా ఆరోగ్య వ్యవస్థ తట్టుకోలేనంతగా అది వ్యాపిస్తుందని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. "వ్యాధి కన్నా చికిత్స ప్రమాదకరంగా ఉండొద్దు. ఈ 15 రోజుల గడువు ముగిసిన తర్వాత ఎటువైపు వెళ్లాలనే విషయమై ఒక నిర్ణయం తీసుకుంటాం" అని ట్రంప్ ట్విట్టర్ లో ప్రకటించారు. మార్చి 31 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ కొనసాగిస్తే ఆర్థికరంగం నష్టపోతుందని, నిరుద్యోగం రెండంకెలకు చేరుతుందని కొందరు రిపబ్లికన్ పార్టీ నాయకులు, గవర్నర్లు హెచ్చరిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ వారివైపు మొగ్గుతున్నారా?  logo