సోమవారం 30 మార్చి 2020
Health - Mar 17, 2020 , 15:51:20

ఇవి తింటే.. ఆరోగ్యం మీ వెంటే..!

ఇవి తింటే.. ఆరోగ్యం మీ వెంటే..!

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యవరాలు. ఆయా సీజన్లలో పండే పండ్లను తినడం  అంటే ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నట్టే. అన్నంతో పాటుగా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసినన్ని పోషకాలు సంపూర్ణంగా లభిసాయి. ఇదే ఉత్తమమైన, ఆరోగ్యకరమైన జీవనవిధానమని ప్రకృతి వైద్యం చెబుతుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మిగిలిన వాటితో పోలిస్తే చాలా తేలిగ్గా మనకు కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. అలాంటి వాటిలో కొన్ని...

ఉసిరికాయలు

వీటిని ఆహారంలో తీసుకుంటే చెడుకొవ్వును, రక్తంలోని చక్కెరను, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. అంతేగాక వీటిలో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 

ఎలా తినాలి? : ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్‌ ఉసిరి రసాన్ని తేనెతో కలిపి సలాడ్‌ చేసుకుని తినవచ్చు. లేదా ఉసిరిరసాన్ని నీళ్లలో కలుపుకొని ఉదయంపూట తాగవచ్చు. 

చిక్కుళ్లు

బీన్స్‌లోని ప్రొటీన్లు, పీచు బరువును నియంతిచుకోవడానికి తోడ్పడతాయి. గుండెజబ్బు, క్యాన్సర్‌ లాంటి వ్యాధులను నివారిస్తాయి. వీటిలో యాటిఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. 

ఎలా తినాలి? : ఉడకబెట్టిన బీన్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. లేదా సూప్‌లు, సలాడ్‌లలో కలిపి కూడా తినవచ్చు. 


బీట్‌రూట్‌

బీట్‌రూట్‌లలో ఫోలేట్‌, మాంగనీస్‌, పొటాషియం తగిన మోతాదులో ఉంటాయి. శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తవృద్ధి కూడా ఉంటుంది. 

ఎలా తినాలి? : పచ్చి బీట్‌రూట్‌ తురుమును సలాడ్‌లలో కలిపి, లేదా కొత్తిమీరతో తినవచ్చు. 

బ్లూబెర్రీస్‌

బ్లూబెర్రీలలోని పీచు, యాంటి ఆక్సిడెంట్లు వాపు, నొప్పులను తగ్గిస్తాయి. ఇది గుండెజబ్బులను నివారించడమే కాకుండా పెద్దపేగు క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది కూడా.

ఎలా తినాలి? : ఓట్స్‌, మొలకలు, పెరుగన్నంతో కలిపి తినవచ్చు. లేదా బేకింగ్‌ కోసం వాడవచ్చు. 

పెరుగు

దీనిలోని మంచి బాక్టీరియా జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ప్రొటీన్లు, కాల్షియం చాలా ఎక్కువ. 

ఎలా తినాలి? : అన్నంలో కలుపుకొని తినడమే కాకుండా పండ్లముక్కలు వేసుకుని కూడా తినవచ్చు. కొత్తిమీర చల్లుకుని తిన్నా బావుంటుంది. తాజా పెరుగును అలాగే తినేయవచ్చు. 

కోడిగుడ్లు

కోడిగుడ్లలో ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. 

ఎలా తినాలి? : బాగా ఉడకబెట్టి, మెత్తగా చేసి, అందులో కొద్దిగా ఉప్పు చల్లి, ఆలివ్‌ నూనెతో కలిపి తింటే మంచిది. 

మెంతులు 

ఇవి రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే పీచుపదార్థాలు చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా నివారిస్తుంది. 

ఎలా తినాలి? : ఒక టేబుల్‌ స్పూన్‌ మెంతిపిండిని చపాతీపిండిలో కలుపుకోవచ్చు. లేదా తగినంత పిండిని ఇతర కూరల్లో వేసుకోవచ్చు. 

వెల్లుల్లి

ఒక టేబుల్‌ స్పూన్‌ పచ్చి వెల్లుల్లిని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చెడుకొవ్వును, అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. 

ఎలా తినాలి? : వీటిని అతి చిన్న ముక్కలుగా తరిగి సలాడ్‌లలోను, సూప్‌లలోను, సాస్‌లోను కలుపుకోవచ్చు. 

అల్లం 

రక్తప్రసరణకు తోడ్పడే అల్లం కీళ్లవాతం, గుండెజబ్బులు, తలనొప్పులు, తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది. 

ఎలా తినాలి ?: సూప్‌లలో, సాస్‌లలో కలుపుకొని తినొచ్చు. టీలో వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక టేబుల్‌ స్పూన్‌ అల్లం తప్పనిసరిగా తినాలి. 

తేనె

మన జీర్ణకోశంలో ఉండే మంచి బాక్టీరియాను పెంచుతుంది తేనె. అంతేకాదు, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులను తగ్గించడానికి కూడా పనికొస్తుంది. 

ఎలా తినాలి? : పెరుగుతోనో, టీలోనో లేదా బ్రెడ్‌పైన రాసుకుని గాని తినవచ్చు. 

పుట్టగొడుగులు

వీటిలో కేలరీలు చాలా తక్కువ. శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు ప్రత్యేకించి విటమి బి, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. 

ఎలా తినాలి? : ఆలివ్‌ నూనెలో వేయించుకుని, ఇంట్లో చేసుకున్న పిజ్జా, పాస్తాల మీద చిన్న చిన్న ముక్కలుగా చల్లుకుని తినవచ్చు.

ఓట్స్‌

వీటిలో పీచు బాగా ఉంటుంది. గుండెకు ఆరోగ్యాన్నిచ్చే తృణధాన్యాలలో ఇది ఒకటి. ఎల్‌డీఎల్‌ కొవ్వును కరిగిస్తుంది. 

ఎలా తినాలి? : పాలలో కలిపి, తేనెలో కలిపి, ఇతర ధాన్యపు మొలకలతో కలిపి రకరకాల పదార్థాలు చేసుకుని తినవచ్చు. 

గుమ్మడి గింజలు

వీటిలో ప్రొటీన్లు, పీచు, మంచి కొవ్వు, స్టిరాల్స్‌ ఉన్నాయి. ఇవి ఎల్‌డిఎల్‌ కొవ్వును కరిగిస్తాయి. 

ఎలా తినాలి? : సలాడ్‌లతో కలిపి లేదా వేడిగా మిగిలిన ధాన్యాలతో కలిపి తినవచ్చు. 

సజ్జలు

వీటిలో లైసిన్‌ అనే అమైనో ఆమ్లం, ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి కణజాలం పెరగడానికి, బాగు చేయడానికి పనికివస్తాయి. 

ఎలా తినాలి? : వరిబియ్యానికి ప్రత్యామ్నాయంగా అన్ని వంటల్లో వీటిని వాడుకోవచ్చు. 

గోధుమ గడ్డి లేదా తవుడు

విటమిన్‌ సి, యాంటి ఆక్సిడెంట్లు దీనిలో బాగా ఉంటాయి. ఇవి నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. 

ఎలా తినాలి? : దీన్ని చపాతీ పిండితో, దోసెల పిండితో గాని, ఇడ్లీపిండితో గాని కలుపుకొని తీసుకోవచ్చు. 


logo