ఈ 5 లాభాలు పొందాలంటే.. పాల‌కూర‌ను త‌ర‌చూ తినాల్సిందే..!


Thu,October 26, 2017 12:27 PM

పాల‌కూర‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ప‌ప్పు, కూర ఎలా చేసినా పాల‌కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే టేస్ట్‌కు మాత్ర‌మే కాదు, మ‌న‌కు ఆరోగ్యాన్ని క‌లిగించ‌డంలోనూ పాల‌కూర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఉన్న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. అంతేకాకుండా శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది. ప‌లు కీల‌క విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే పాల‌కూరను త‌ర‌చుగా తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే టాప్ 5 బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎముక‌ల‌కు


పాల‌కూర‌లో విట‌మిన్ కె స‌మృద్ధిగా ఉంటుంది. ఇది ఎముక‌ల్లో కాల్షియంను నియంత్రిస్తుంది. అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కు ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. పాల‌కూర ఎదిగే పిల్ల‌ల‌కు పెడితే చాలా మంచిది. వారు దృఢంగా ఎదుగుతారు.

2. రోగ నిరోధ‌క శ‌క్తి


పాల‌కూర‌లో బీటా కెరోటిన్‌, జిక్సాన్‌థిన్‌, లుటీన్‌, క్లోరోఫిల్ అనబ‌డే పోష‌కాలు ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మనం క‌లిగిస్తాయి.

3. విట‌మిన్ ఎ


పాల‌కూర‌లో విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీంతో నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి. దృష్టి మెరుగు ప‌డుతుంది. చ‌ర్మం పొర‌ల్లో ఉండే బాక్టీరియాను విట‌మిన్ ఎ బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో చ‌ర్మం శుభ్ర‌మ‌వుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఇది మేలు చేస్తుంది.

4. విట‌మిన్ సి


ఈ విట‌మిన్ కూడా పాల‌కూర‌లో ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది. గుండె స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది.

5. శ‌క్తి


పాల‌కూర‌లో ఉండే మెగ్నిష‌యం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌క్తి ఎక్కువగా శ‌రీరానికి అందేలా చూస్తుంది. శారీర‌క శ్ర‌మ చేసే వారికి, నిత్యం బ‌య‌ట తిరిగే వారికి పాల‌కూర చ‌క్క‌గా ప‌నికొస్తుంది. దీంతో శ‌రీరంలో ఎన‌ర్జీ లెవ‌ల్స్ పెరుగుతాయి.

4862

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles