బుధవారం 08 జూలై 2020
Health - May 30, 2020 , 16:21:50

లాక్‌డౌన్‌లో కొవ్వు కరగాలంటే..

లాక్‌డౌన్‌లో కొవ్వు కరగాలంటే..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలులోకి  తెచ్చిన  లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. కొత్తకొత్త వంటకాలు చేసుకొంటూ ఆరగిస్తున్నారు. సాయంత్రాల్లో చిరుతిండ్లు ఎక్కువయ్యాయి. బయటకు అడుగు కూడా వేయకుండా ఉంటుండటం.. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఇంట్లోనే గడుపుతుండటంతో కొవ్వు పెరిగిపోయి లావెక్కిపోతున్నారు. లాక్‌డౌన్‌ ముగిసేసరికి అరోగ్య సమస్యలతో బాధపడకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉంటూ కూడా వ్యాయామం చేయొచ్చు.

పగలంతా ఇంట్లోనే ఉండి టీవీ చూసినా.. ఎనిమిది గంటలపాటు ఒకే సీట్లో కూర్చుని పనిచేసినా ఫర్వాలేదు!! అయితే ఉదయం పూట ఓ గంటపాటు వ్యాయామం చేయండి చాలంటున్నారు నిపుణులు. నిత్యం జిమ్‌కి వెళ్లేవాళ్లూ, ఏదైనా ఆటని వృత్తిగా చేసుకొనే వాళ్లలోనే కాకుండా.. గంటపాటు ఇంట్లోనే వ్యాయామం చేసేవారూ అనారోగ్యాలకు దూరంగా ఉంటారని బ్రిటన్‌ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప‌రిశోధ‌కులు తేల్చారు. 

వ్యాయామం చేయాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. నిత్యం ఇంట్లోనే ఎక్సర్‌సైజ్‌ చేస్తూ జిమ్‌లో చేసిన ఫలితాలను పొందవచ్చు. ఇంటి పనులు చేయడం వల్ల పెద్ద మొత్తంలో క్యాలరీలను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చని సెలవిస్తున్నారు నిపుణులు. దండీలు, బస్కీల వంటివి చేయవచ్చు. సైకిల్‌ తొక్కి వ్యాయామం చేయవచ్చు. ఒక చోట వేలాడుతూ, శరీరాన్ని పైకి లేపుతూ కిందికి దించుతూ చేయాలి. వాటర్‌బాటిల్ సహాయంతో డంబెల్ ఎక్సర్‌సైజ్‌లను చేయవచ్చు. ఒకే మెట్టుపైకి మాటిమాటికీ ఎక్కుతూ, దిగుతూ వ్యాయామం చేయొచ్చు. పుషప్స్ చేయాలి. మొక్కలకు నీళ్లు పోయడం, నీళ్లు తోడటం వంటి పనులు చేయాలి. స్క్రబ్‌ తీసుకొని ఇంట్లో తలుపులు, కిటికీలు, గోడలు, మెట్లు, వంట గది, బాత్‌ రూమ్‌.. ఇలా అన్నింటినీ శుభ్రంగా రుద్ది కడగండి.  అప్పుడప్పుడూ బట్టలను కూర్చొని చేతితో ఉతకడం అలవాటు చేసుకోండి. ఇష్టమైన పాటకు లయబద్ధంగా డ్యాన్స్‌ చేయడం కూడా గొప్ప వ్యాయామమే అని గుర్తుంచుకోండి.


logo