రోజూ 3 అర‌టి పండ్లు తింటే..?


Sun,December 10, 2017 05:14 PM

పురాతన కాలం నుంచి అరటి పండ్లు మ‌న‌కు పోషకాలనిచ్చే ఆహారంగానే కాక వివిధ రకాల అనారోగ్యాలను నయం చేయడంలో ఔషధంగానూ పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని ఏ క్రీడాకారున్ని తీసుకున్నా వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎవరైనా కూడా రోజుకి 3 అరటిపండ్లను తినడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మ‌న‌ శరీరానికి నిత్యం కావల్సిన మోతాదులో పొటాషియం అందుతుందని పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే నిత్యం 3 అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఇంకా ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే సమయాల్లో ఒక్కో అరటి పండును తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇలా చేయడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం 21 శాతం వరకు తగ్గుతుందని తెలిసింది. ఒక్కో అరటి పండులో దాదాపుగా 500 మిల్లీగ్రాముల పొటాషియం ఉండడం వల్ల రోజూ వీటిని 3 వరకు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. అదేవిధంగా శరీరంలోని ద్రవాలను కావల్సిన స్థాయిలో ఉంచేందుకు, బీపీని తగ్గించేందుకు ఈ పండు అమోఘంగా పనిచేస్తుంది.

2. మ‌నం నిత్యం తినే ఆహారంలో ఉండే అత్యధిక లవణాల గాఢత కారణంగా ఎముకలు త్వరగా క్షయానికి గురవుతాయి. అయితే అరటి పండ్లను తింటే ఎముకలు దృఢంగా మారడంతోపాటు ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది.

3. మెదడు సరిగ్గా పనిచేయడంలో సెరటోనిన్ అనే మూలకం కీలకపాత్రను పోషిస్తుంది. మనం తినే అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి దోహద పడుతుంది. దీని కారణంగా రోజూ తగినంత సంఖ్యలో అరటి పండ్లను తింటే మానసికంగా దృఢంగా ఉండవచ్చు. ప్రధానంగా విద్యార్థులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాల్లో అరటిపండును తీసుకుంటే తమ జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకోవచ్చు.

4. రక్తహీనతను నివారించడంలో అరటిపండ్లు మెరుగ్గా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తం, హిమోగ్లోబిన్‌ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

5. పీచు పదార్థానికి నెల‌వుగా ఉన్న అరటిపండ్లు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఎటువంటి మందులు వాడకుండానే నిత్యం అరటిపండ్లను తింటే మలబద్దకం దానంతట అదే తగ్గిపోతుంది.

6. అరటిపండ్లు, తేనెతో తయారు చేసిన స్మూత్ షేక్‌ను తీసుకుంటే హ్యాంగోవర్‌ను తగ్గిస్తుంది. ఇది శరీరానికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

19804

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles