మంగళవారం 07 జూలై 2020
Health - May 25, 2020 , 13:48:24

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే..!

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే..!

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి వస్తున్న క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 185 దేశాల్లోని ప్రజలు 36 రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారని గ్లోబోకాన్ 2018 డేటా చెబుతోంది. అయితే అన్ని క్యాన్సర్ల కన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలో అధికంగా ఉందని, అందులోనూ ఎక్కువగా పురుషులే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే లంగ్ క్యాన్సర్‌ను ఆరంభ దశలోనే గుర్తించాలని, దాంతో చికిత్సనందించడం సులభతరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. మరి ఎవరికైనా సరే లంగ్ క్యాన్సర్ వచ్చిందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

* సాధారణ దగ్గు అయితే 2 నుంచి 3 రోజుల్లో పోతుంది. లేదా మరికొద్ది రోజులు పడుతుంది. కానీ ఎన్ని రోజులు అయినా సరే.. దగ్గు తగ్గకపోతే.. దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాలి. అసలు దగ్గు తగ్గడం లేదంటే.. అది లంగ్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. ఈ లక్షణం ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలిసి చికిత్స తీసుకోవాలి.

* దగ్గు వచ్చినప్పుడు కొందరిలో శ్లేష్మం పడుతుంది. అయితే అందులో రక్తం ఉంటే దాన్ని కచ్చితంగా లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి.

* లంగ్ క్యాన్సర్ ఉన్నవారికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టతరమవుతుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టతరమవుతుంటే దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి.

* గ్యాస్ సమస్య, గుండె జబ్బులు ఉన్నవారిలో సహజంగానే ఛాతిలో నొప్పి వస్తుంటుంది. అయితే లంగ్ క్యాన్సర్ ఉన్నా ఛాతిలో నొప్పిగా ఉంటుంది. దాన్ని కూడా ఆ వ్యాధి ఉందని తెలిపేందుకు ఒక లక్షణంగా భావించాలి.

* సడెన్‌గా బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, కంఠస్వరంలో మార్పు, ఛాతిలో ఇన్‌ఫెక్షన్లు రావడం, చిన్నపనికే బాగా అలసిపోవడం, నీరసంగా ఉండడం.. వంటి లక్షణాలన్నీ లంగ్ క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏవి ఉన్నాయని అనుకున్నా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు.


logo