తెలంగాణ వెరీ 'గుడ్డు'.. వినియోగంలో మనమే నం.1


Sun,January 13, 2019 01:37 PM

కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ ముందంజలో ఉంది. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్) నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోనే కోడి గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో కోడిగుడ్ల తలసరి వినియోగం ఏడాదికి 180 అని తేల్చింది నెక్ నివేదిక. ఇది జాతీయ పౌష్ఠికాహార సంస్థ(ఎన్‌ఐఎన్) చెప్పిన తలసరి వినియోగానికి సమానం అని తన నివేదికలో పేర్కొంది నెక్. ఈ నివేదిక ప్రకారం కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ టాప్‌లో నిలిచింది.

ఇక దేశ వ్యాప్తంగా రోజుకు 22 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. అందులో తెలంగాణ వాటా 3.2 కోట్లు అని నెక్ తెలిపింది. తెలంగాణలో రోజుకు 1.7 కోట్ల కోడిగుడ్లను వినియోగిస్తుండగా.. అందులో హైదరాబాద్‌లోనే 55 లక్షల కోడిగుడ్లను లాగించేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంది. మరోవైపు పక్కనే ఉన్న ఏపీలో మాత్రం కోడిగుడ్ల తలసరి వినియోగం 119 మాత్రమేనని నెక్ నివేదిక పేర్కొంది.

ఈ జాబితాలో 123 కోడిగుడ్ల తలసరి వినియోగంతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా మూడోస్థానంలో ఏపీ, తర్వాతి స్థానాల్లో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి. చివరిగా తలసరి 12 కోడిగుడ్ల వినియోగంతో రాజస్థాన్ ఈ జాబితాలో చివరన ఉంది.

3571
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles