వాల్‌నట్స్‌లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వాల్‌నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వాటి వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే డయాబెటిస్ ఉన్న వారు వాల్‌నట్స్‌ను నిత్యం తింటుంటే షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో తెలిసింది. ఈ మేరకు న్యూట్రిషన్ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ అనే జర్నల్‌లో సైంటిస్టులు చేపట్టిన అధ్యయన వివరాలను కూడా ఇటీవలే ప్రచురించారు.
కొరియాకు చెందిన సైంటిస్టు బృందం డయాబెటిస్ తో బాధపడుతున్న 119 మంది కొరియన్ స్త్రీ, పురుషులను రెండు గ్రూపులుగా విభజించి వారికి 16 వారాల పాటు నిత్యం ఒక్కొక్కరికి 45 గ్రాముల చొప్పున వాల్నట్స్ తినమని, కొందరికి వాల్నట్స్ తినవద్దని చెప్పారు. అనంతరం 6 వారాలు విశ్రాంతి ఇచ్చి మళ్లీ 16 వారాలు అలాగే చేశారు. ఈ క్రమంలో చివరికి అందరికీ పరీక్షలు చేశారు. అందరి షుగర్ లెవల్స్, హెచ్‌బీఏ1సి, కొలెస్ట్రాల్ స్థాయిలను లెక్కించారు. దీంతో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వాల్నట్స్ తినని వారితో పోలిస్తే తిన్న వారిలో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సి, కొలెస్ట్రాల్, హైబీపీ స్థాయిలు గణనీయంగా తగ్గాయని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్, హైబీపీ తదితర సమస్యలతో బాధపడే వారు నిత్యం వాల్‌నట్స్‌ను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.