స్వైన్ ఫ్లూతో జాగ్ర‌త్త‌..!


Sun,October 14, 2018 12:33 PM

చ‌లికాలం ఇప్పుడిప్పుడే ప్రారంభ‌మ‌వుతోంది. నెమ్మ‌దిగా స్వైన్ ఫ్లూ కూడా త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లు చోట్ల స్వైన్ ఫ్లూ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే కాస్త జ్వ‌రం, జ‌లుబు వ‌స్తే జ‌నాలు వ‌ణికిపోతున్నారు. స్వైన్ ఫ్లూ వ‌చ్చిందేమోన‌ని కంగారు ప‌డుతూ హాస్పిట‌ల్స్‌కు ప‌రిగెత్తుతున్నారు. అయితే స్వైన్ ఫ్లూ నిజానికి ఆ వ్యాధి సోకిన ప‌శువుల మాంసం తిన‌డం వ‌ల్ల వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతుంటారు. ఈ వైర‌స్‌ను హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయెంజా అని కూడా పిలుస్తారు.

స్వైన్ ఫ్లూ లక్షణాలు...


స్వైన్ ఫ్లూ మొద‌ట సాధార‌ణ జ‌లుబులాగే క‌నిపిస్తుంది. కానీ దీని ల‌క్ష‌ణాలు మాత్రం 6 రోజుల త‌రువాత బ‌య‌ట ప‌డ‌తాయి. అప్పుడు ఆయాసం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, జ్వ‌రం, ఒళ్లు నొప్పులు, ముక్కు కార‌డం, ద‌గ్గు, గొంతు నొప్పి, త‌ల‌నొప్పి, వాంతులు, విరేచ‌నాలు త‌దిత‌ర ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే హాస్పిట‌ల్‌కు వెళ్లి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకోవాలి. అయితే కొంద‌రిలో వేగంగా శ్వాస తీసుకోడం, నీరు తాగ‌డం లేదా ఆహారం మింగ‌డంలో ఇబ్బందులు క‌ల‌గ‌డం, తీవ్ర‌మైన ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి.

సాధార‌ణంగా స్వైన్ ఫ్లూ అనేది ఆస్త‌మా, డ‌యాబెటిస్‌, అధిక బ‌రువు ఉన్న‌వారు, గుండె జ‌బ్బులు ఉన్న‌వారు, త‌క్కువ రోగ నిరోధ‌క శ‌క్తి ఉన్న‌వారు, గ‌ర్భిణీల‌కు త్వ‌ర‌గా వ‌స్తుంది. స్వైన్ ఫ్లూ ఉన్న‌వారు ఎవ‌రైనా ద‌గ్గిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు వారి నుంచి వైర‌స్ ఎదురుగా ఉండే ఇత‌ర వ్య‌క్తుల శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. క‌నుక ఎవ‌రైనా ద‌గ్గేట‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు ముక్కు, నోరుకు చేతుల‌ను లేదా టిష్యూ పేప‌ర్ల‌ను అడ్డుగా పెట్టుకోవాలి. చేతుల‌ను అడ్డుగా పెట్టుకుంటే ప్ర‌తి సారి శుభ్రం చేసుకోవాలి. టిష్యూ అయితే ఒకేసారి ఉప‌యోగించాలి.

చిన్నారుల‌కు అయితే ముందుగానే సీజ‌న‌ల్ ఫ్లూ నివార‌ణ వ్యాక్సిన్ల‌ను వేయిస్తే మంచిది. దీంతోపాటు స్వైన్ ఫ్లూ నివార‌ణ వ్యాక్సిన్లు కూడా ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో ఇస్తారు. మొద‌టి డోసు ఇచ్చాక మూడు వారాలు ఆగి మ‌రో డోసు ఇవ్వాలి. అయితే వ్యాక్సిన్ ఇచ్చాక స్వైన్ ఫ్లూ వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు శ‌రీరానికి రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంది.

స్వైన్ ఫ్లూ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు...
1. దీనిని తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, వీలైనన్ని సార్లు చేతులు కడుగుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

2. ప్రతి ఇంట్లోనూ ఉండే తులసి ఆకులు ఉదయాన్నే నోటిలో వేసుకుని నమిలితే కొంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

3. అడుగు పొడవున్న తిప్పతీగను తీసుకుని ఐదారు తులసి ఆకులతో కలిపి నీటిలో 20 నిమిషాలు మరిగించి రుచి కోసం నల్ల మిరియాలు, సైంధవ లవణం, రాతి ఉప్పు, పటిక బెల్లం కలుపుకుని గోరువెచ్చగా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు గోరువెచ్చటి నీటితో తిన్నా ప్రయోజనముంటుంది. గోరువెచ్చటి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే కొంత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

5. దాల్చిన చెక్క‌, ల‌వంగాలతో చేసిన టీని తాగితే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. అలాగే సీజ‌నల్ పండ్ల‌ను తిన‌డం ద్వారా రోగాల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

3099

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles