శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Jun 13, 2020 , 16:00:34

ఆందోళనతో నిద్రలేమి!

ఆందోళనతో నిద్రలేమి!

న్యూ ఢిల్లీ: ప్రపంచానికి మొత్తం కరోనా భయం పట్టుకున్నది. ఆ మహమ్మారి విజృంభణతో జీవితాలు అతాలకుతలం కాగా, చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. దీంతో నిద్రకు దూరమవుతున్నారు. ఒకటి, రెండు రోజులైతే ఫర్వాలేదు. కొన్నివారాలపాటు నిద్రపోకుంటే అసలుకే ముప్పని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న భయంతో మానసిక ఆందోళనకు గురువుతున్నారని, దీంతో నిద్రకు దూరమవుతున్నారని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

ఆందోళనకు, నిద్రకు చాలా దగ్గరి సంబంధముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆందోళనకు గురైతే నిద్రపట్టదని, నిద్రపట్టకుంటే ఆందోళన ఇంకా ఎక్కువవుతుందని, ఇదికాస్తా తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని తెలిపారు.  పెద్ద వయస్సువారితోపాటు యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. నిద్ర పట్టకపోవడాన్ని లైట్‌గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఆందోళనను దూరం చేసుకొని, నిద్రకు ఉపక్రమించవచ్చంటున్నారు. ఆందోళనను దూరం చేసుకోవాలంటే మొదట పొద్దంతా ఏదో ఒక పనిలో నిమగ్నమై పోవాలని పేర్కొంటున్నారు. వర్కవుట్స్‌, వంట చేయడం, ఇష్టమైనవారితో కాన్ఫరెన్స్‌ కాల్స్‌ మాట్లాడడం, మంచి పుస్తకాలు చదవడం లాంటి వాటిలో బిజీ అయిపోవాలని సూచిస్తున్నారు. దీంతో శరీరం అలసిపోయి కంటినిండా నిద్రపడుతుందని, ఆందోళన తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.  logo