సిడ్నీ : పాలు, డెయిరీ ఉత్పత్తులు అధికంగా తీసుకునే వారిలో వాటిని తక్కువగా తీసుకునే వారితో పోలిస్తే గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. డెయిరీ ఫ్యాట్ అధికంగా తీసుకునే వారిలో అందరూ భావించేల మరణాల ముప్పు ఎక్కువగా లేకపోవడమే కాకుండా వీటిని తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల బారినపడే అవకాశం తక్కువని పీఎల్ఓఎస్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరించింది.
4000 మందికి పైగా స్వీడన్ పౌరులపై నిర్వహించిన అధ్యయనంతో పాటు ఇతరదేశాల్లో జరిగిన 17 ఈ తరహా పరిశోధనలను విశ్లేషించిన మీదట శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిగ్గుతేల్చారు. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ వినియోగం పెరిగిన నేపధ్యంలో దీనిపై మెరుగైన అవగాహన అవసరమని పరిశోధకులు పేర్కొన్నారు. అత్యధికంగా డెయిరీ కొవ్వులు తీసుకున్న వారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తాము గుర్తించామని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌కు చెందిన డాక్టర్ మాటి మర్ల్కుంద్ తెలిపారు.
డెయిరీ కొవ్వులు, డెయిరీ ఉత్పత్తులు ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆయన పేర్కొన్నారు. డెయిరీ ఉత్పత్తులు అధికంగా తీసుకునే వారిలో గుండె జబ్బులతో పాటు ఇతరత్రా ఏ కారణాలతో అయినా మరణాల ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలిందని చెప్పారు. ఆహార మార్గదర్శకాలకు సంబంధించి ఈ అధ్యయనం సరికొత్త అంశాలను ముందుకు తెచ్చిందని డాక్టర్ మర్క్లుంద్ వెల్లడించారు.