ఒక్కో మెట్టూ ఎక్కేకొద్దీ మీ ఖాతాలో ఉజ్జాయింపుగా ఒక్కో నిమిషం ఆయుర్దాయం జమవుతూ ఉంటుంది. క్రమక్రమంగా శతమానానికి చేరువవుతారు. ఒకేసారి ఎక్కుతారా, పొద్దున కొన్ని మెట్లు, మధ్యాహ్నం ఇంకొన్ని మెట్లు, రాత్రికి మరికొన్ని మెట్లు ఎక్కుతారా అన్నది మీ ఇష్టం. ఎక్కారా, లేదా అన్నదే ముఖ్యం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈమధ్యే జరిగిన ఓ ఆన్లైన్ కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించి ఓ పరిశోధనా పత్రాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు 16,000 మంది యువతీ యువకుల జీవన శైలిని అతిదగ్గర నుంచి గమనించాక ఈ నిర్ధారణకు వచ్చింది పై వైద్యబృందం. మిగిలినవారితో పోలిస్తే రోజుకు 1,000 మెట్లు ఎక్కేవారు ఏ అనారోగ్యంతోనో మరణించే ఆస్కారం 28 శాతం తగ్గుతుందని, రోజుకు 2,000 మెట్లు ఎక్కేవారిలో మరణ ప్రమాదం 32 శాతం తగ్గుతుందనీ తేల్చారు. రోజుకు 4,500 మెట్లు ఎక్కేవారి ఆయుర్దాయానికైతే ఎలాంటి ఢోకా ఉండదట! ఆలస్యమెందుకు? ఎక్కు, ఎక్కు బాగా ఎక్కు! ఇంకా ఎక్కు!