నవ్వుతో మానసిక సమస్యలనే కాదు, శారీరక రుగ్మతలను కూడా నివారించవచ్చు. నవ్వు సాయంతో క్యాన్సర్‌లాంటి మహమ్మారిని జయించలేకపోవచ్చు కానీ.. మెదడు, గుండె ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు జరుగుతుంది. సంతోషకరమైన సందర్భాల్లో మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది. అది మనిషి మరింత సంతోషంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాగే, సెరొటొనిన్ అనే హార్మోన్ ఏడుపుగొట్టు మూడ్‌ను మార్చేస్తుంది.
ఎండార్ఫిన్స్ నొప్పి, ఒత్తిడి తాలూకు బాధను దూరం చేస్తాయి. నవ్వినప్పుడు విడుదలయ్యే యుఫోరియా అనే రసాయనం మాదకద్రవ్యంలా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలను కూడా తరచూ నవ్వించాలని, అలా చేస్తే వాళ్లలో మానసిక సమస్యలు వచ్చే ఆస్కారం తక్కువని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని గోల్డ్స్మిత్స్ ఇన్ఫాన్ట్ ల్యాబ్ డైరెక్టర్, డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ డాక్టర్ కాస్పర్ అడ్డీమ్యాన్.