శనివారం 04 ఏప్రిల్ 2020
Health - Mar 02, 2020 , 16:06:57

పగటి పూట ఎక్కువగా నిద్రిస్తున్నారా..? అయితే ఈ వ్యాధులు వస్తాయట..!

పగటి పూట ఎక్కువగా నిద్రిస్తున్నారా..? అయితే ఈ వ్యాధులు వస్తాయట..!

మనలో అధిక శాతం మంది రాత్రి పూట తగినంత నిద్ర పోయినా వారిలో కొందరికి పగటి పూట కూడా విపరీతంగా నిద్ర వస్తుంటుంది. దీంతో వారు పగలు కూడా చాలా ఎక్కువ సేపు నిద్రిస్తుంటారు. అయితే రాత్రి నిద్ర సరిపోయినప్పటికీ పగటి పూట కూడా ఎక్కువగా నిద్రిస్తే భవిష్యత్తులో పలు వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 

కెనడాలోని టొరంటోలో ఏప్రిల్‌ 25 నుంచి మే 1వ తేదీ వరకు అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ 72వ వార్షిక సమావేశం జరగనుంది. అందులో పలువురు సైంటిస్టులు తమ అధ్యయనాలకు సంబంధించిన నివేదికలను సమర్పించనున్నారు. ఇక వాటిలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సమర్పించనున్న అధ్యయన వివరాలు కూడా ఉన్నాయి. ఆ అధ్యయనం ప్రకారం.. పగటి పూట ఎక్కువగా నిద్రించే వారికి డయాబెటిస్‌, గుండె జబ్బులు, క్యాన్సర్‌, ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. 3 ఏళ్ల పాటు పరిశోధకులు 65 సంవత్సరాల పైబడి వయస్సు ఉన్న 10,930 మందిని ప్రశ్నించి వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పైన వివరాలను వెల్లడించారు. 

పగటిపూట ఎక్కువగా నిద్రించే స్థితిని హైపర్‌సోమ్నోలెన్స్‌ అంటారని.. అలా చేయడం వల్ల భవిష్యత్తులో డయాబెటిస్‌, గుండె జబ్బుల వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సదరు పరిశోధకులు తేల్చారు. కనుక రాత్రి పూట తగినంత నిద్రపోయే వారు పగటి పూట నిద్ర పోవడం మానుకుంటే మేలని వారు సూచిస్తున్నారు.


logo